28, మార్చి 2026, శనివారం

సమస్య - 5422

29-3-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె”
(లేదా...)
“గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్”

5 కామెంట్‌లు:

  1. భీమమగు వేడికి పుడమి బీటలొంద
    నింగి మబ్బులు గ్రమ్మె ; వెన్నెలయుఁ గురిసె
    రైతుల మనము లందు , దూర భువిపయిన
    పడగ విరివిగ పంటలు పండుననుచు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    దేవకీసతి గర్భాన దివ్యమనఁగ
    నవతరింపగ నష్టమి నచ్యుతుండు
    నంద గోకుల మేగెడు ముందు, వెనుక
    నింగి మబ్బులు గ్రమ్మె! వెన్నెలయుఁ గురిసె!

    చంపకమాల
    జగమున ధర్మమున్ నిలుప శౌరియె దేవకి గర్భమందునన్
    సుగతిని గూర్పఁగన్ వెలయ సుందరడై! వసుదేవుఁడా నిశిన్
    వగపును వీడ నందకుల వాసము జేర్చెడు ముందు వెన్కలన్
    గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను, వెన్నెల విస్తరింపఁగన్

    రిప్లయితొలగించండి
  3. కఱవు రక్కసి కసిబూని కాటువేయు
    తరుణమందున వరుణుఁడు కరుణ జూప
    నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె
    వానతోబాటుగా రైతు బ్రతుకునందు

    రిప్లయితొలగించండి

  4. వృద్ధ భీష్ముడొరిగినంత విజయ మదియె
    తథ్య మనుచు పాండవుల నేత్రములు కాంతి
    వంత మైనను లోకమ్ము వగచె గాంచ
    నింగి మబ్బులు గ్రమ్మె, వెన్నెలయుఁ గురిసె.


    పగతురి పక్షమున్ నిలిచి పౌంస్యమొనర్చెడి భీష్మ పర్వమే
    ముగిసిన పాళ మందు పృథ పుత్రులు గర్వము నందు వేళలో
    మొగములు కాంతులీనగను ముజ్జగముల్ పరికేద మందెగా
    గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్.

    రిప్లయితొలగించండి
  5. వింగడించగ వానకు వెనుక ముందు
    సంగతుల పరిణామము స్పష్టమాయె
    నింగి మబ్బులు గ్రమ్మె వెన్నెలయుఁ గురిసె
    పొంగి పోయెను గలువలు పోతరమున

    పగటికి రేయికిన్ గలుగు వ్యత్యయమే గమనించినంతలో
    స్వగతము తెల్పెనీ విధము 'వర్షపు చిన్కులు రాలునప్పుడే
    గగనమునందుఁ గార్మొగులు గ్రమ్మెను వెన్నెల విస్తరింపఁగన్
    ధగధగ కాంతులీనినవి తన్మయ మొందగ కల్వఱేకులే'

    రిప్లయితొలగించండి