5, జూన్ 2026, శుక్రవారం

సమస్య - 5489

6-6-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష”

(లేదా...)

“ప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ధ్యాన యోగాది క్రియలతో తన్మయమున
    సాధకుఁడు పరిపూర్ణత సంతరించ
    సలుపు జీవాత్మ పరమాత్మ సంగమంపు
    ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష

    చంపకమాల
    తృణముగ నెంచి చింతలను దేజమునింపెడి యోగమందునన్
    క్షణమున గాల్చి సాధకుడు జ్ఞానిగ జేసెడు ధ్యానమందునన్
    మణితమనంగ జీవ పరమాత్మలు సల్పెడు సంగమంబునౌ
    ప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై

    రిప్లయితొలగించండి
  2. వింత యొకటి జరిగినది , వినర తంబి !
    నిత్య మలవాటయిన రీతి నేడు జేయ ,
    ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష ,
    దీని భావమేమి టనగ దెలియ కుండె

    రిప్లయితొలగించండి
  3. ప్రణయి కై వర్తమానము పంపి తాను
    క్షణమొక యుగమై రుక్మిణీకాంత వేచె
    ప్రణుతమనుచు పఠింతురు భక్తులెల్ల
    ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష

    ప్రణుతము రుక్మిణీ ప్రణయ భాజిత మంచు పఠింత్రు భక్తులే
    క్షణమొక యుగ్మమే ననుచు కన్యక రుక్మిణి వేచి చూచె నా
    ప్రణయనమే మనోహరము రమ్యత చొప్పడు రుక్మిణీ కథన్
    బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై

    రిప్లయితొలగించండి
  4. చం॥ఝణఝణ నాదమందియల సాగఁగ జవ్వని నాట్య మొప్పఁగా
    నణువణువా విధిన్ మరుల నద్భుత రీతినిఁ గాంచఁ బాడుచున్
    బ్రణతుల గోప బాలకుని వర్ణన సేయఁగ రాసలీలలన్
    బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి పద్యమండి
      గోపబాలుఁడు వెన్నుని కొంటె తనము
      కడు ముదము సుధా మధురము కనిన వినిన
      తనువు పులికించి భక్తియుఁ దనరు గతినిఁ
      బ్రణయమునఁ దొఁచె సుందర ప్రణవ ఘోష

      తొలగించండి
  5. తే.గీ:ఆ ఉ మా యని హుమ్మని యామె మూల్గ
    రతిని పారవశ్యము నంది పతియు తత్త్వ
    వేత్త కావున శ్రద్ధ తో వినిన యంత
    ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవఘోష”
    (భార్య రతిపారవశ్యం లో "ఆ ఉం ఆ హుం" అని మూలుగుతోంది.అ ఉ మ కలిస్తే ఓం అవుతుంది అని ఉపనిషత్తులు చదివిన భర్తకి అనిపించింది.అన్ని శబ్దాలు ఓం కారము లో లయ మౌతాయి.అన్ని ఆనందాలు బ్రహ్మానందం లో భాగాలే. ఆనందో బ్రహ్మ.రసో వై సః.
    )

    రిప్లయితొలగించండి
  6. చం:"ప్రణయము గృష్ణు తో జరుగ రా"దని రాజులు కుత్సితాత్ములై
    రణమును రేప గృష్ణుడు కరమ్మున శంఖము బట్టి యూదగా
    ప్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో , మకరాంక రేఖయై
    క్షణమున గృష్ణు విల్లు కలకంఠికి దోచెను సుందరమ్ముగన్.
    (రుక్మిణి కి కృష్ణుని తో వివాహాన్ని అడ్డుకోటానికి రాజులు వస్తే కృష్ణుడు పాంచజన్యం పూరించగా ప్రణవనాదం పలికింది. ఆయన చేతిలోని విల్లు మకరాంకరేఖ లాగా రుక్మిణికి కనిపించింది.)

    రిప్లయితొలగించండి
  7. కణకణమందు నిండెనదె
    కాంచగ చేతన రాగరక్తియే
    ప్రణుతిగ నిండి జీవనము
    ప్రాప్తిగొనంగ ప్రభావ రాగమై
    గణుతిని జేయ విశ్వపరి
    కల్పనజేసెడి రమ్యభావ హృ
    త్ప్రణయము నందు దోచె బ్రణ వంబదిగో! మకరాంకరేఖయై!

    రిప్లయితొలగించండి
  8. కోరి యొ కటైన వలపుల క్రొత్త జంట
    మోజు దీరగ గడుపుచు మునిగి తేలె
    ప్రణయ మున :: దోచె సుందర ప్రణవ ఘోష
    వింత సవ్వడి తో ముని వీను లకును

    రిప్లయితొలగించండి
  9. -
    అణువణున విందు ముప్పోకలాని చెంత
    ప్రణయమున దోచె సుందర ప్రణవ ఘోష
    యె ణిసిధాత్వర్థముల మెరయికల మాటు
    కణము లెల్ల రంగని యీవి గాంచి సకియ



    రిప్లయితొలగించండి
  10. సద్గురుని బోధనము లవశ్యములు సుమ్ము
    ముక్తి మార్గము కనుగొను భక్తులకును
    సంత తాచంచల మయిన సంయమి వరు
    ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవ ఘోష

    [ప్రణయము = ప్రార్థన]


    గుణ మగు భక్తి యెల్లరకుఁ గోరకె మోక్ష మొసంగు భూత స
    ద్గణముల ఱేని పైన నిలఁ దథ్యము తప్పక విశ్వసింపుమా
    ఫణి వర దివ్య భూషణునిపై ననునిత్యము నిందుమౌళిపైఁ
    బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై

    [ప్రణయము = విశ్వాసము]

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వేచి బృందావనమునందు వేణు నాద
    ము సలుపగ రాధ వినినంత మోహ పరవ
    శమున కృష్ణుని చేరగ సంగమంపు
    ప్రణయమునఁ దోచె సుందర ప్రణవ ఘోష.

    రిప్లయితొలగించండి