13, జూన్ 2026, శనివారం

సమస్య - 5497

14-6-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బూతులం బల్కువారలే పుణ్యజనులు”

(లేదా...)

“బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే”

4 కామెంట్‌లు:

  1. చట్టమగు సుంత లోననె శంకవలదు ,
    చట్టసభలందు దప్పక చక్కనైన
    బూతులం బల్కువారలే పుణ్యజనులు
    పలుకనగు నటుల నికపై ప్రకటితముగ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    నీతినియమముల్ వీడుచు నేతననెడు
    గర్వమున వైరిపక్షముఁ గర్కశముగ
    నిందలాడ గద్దెన్ దించి నెట్టిరి ప్రజ
    బూతులం బల్కువార లే పుణ్యజనులు?


    ఉత్పలమాల
    నైతిక ధర్మమున్ విడచి నాలుకఁ ద్రిప్పుచు వైరిపక్షమున్
    రీతిని దప్పి నాకెదురు లేదను భంగివిమర్శలెంచఁగన్
    నేతను సైతురే ప్రజలు నెట్టుచు వెన్కకు గద్దెదించరే
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే?

    రిప్లయితొలగించండి
  3. నేతల సరళి గమనింప నెయ్యమేడ?
    కోతులన్ బురుడించుచు గోచరింత్రు
    నేతల పలుకులఁ దొరలు బూతులెపుడు
    బూతులం బల్కువారలే పుణ్యజనులు

    నేతల పోకడల్ గనిన నెయ్యపు బల్కులు మాయమయ్యెలే
    కోతుల కంటె హీనులుగ గోచరమై చెలరేగుచుందురే
    నేతలు పల్కుచుందురిట నేర్పరురై పలు బూతుమాటలన్
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే

    రిప్లయితొలగించండి

  4. దుర్మతులు వాడు మాటలు దొరల కుండ
    నెదుటి వారిని మన్నించి యింపు గాను
    పలకరించుచు వీడుచు పలుకు లందు
    బూతులం, బల్కువారలే పుణ్యజనులు.


    ఖ్యాతి గడింతు రోయి మరియాదను వీడక సాటి వారికిన్
    బ్రీతిని గూర్చ నెంచుచును విజ్ఞత తో వచియించు వారలే,
    నీతియె లేని దుర్జనుల నెయ్యము తోనల వర్చు కొన్న యా
    బూతులఁ బల్కువారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే?

    రిప్లయితొలగించండి