31, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రహేళిక - 21 సమాధానం

ఈ దేవుడు ఎవరు?
ఆ.వె.
నలుమొగములవాని చెలువ యత్త కొడుకు
పగతు భార్య తండ్రి వైరి తనయు
బావ దాయఁ జంపువాని తండ్రి సుతుని
ప్రభువు మీ కొసంగు విభవములను.

సమాధానం - ఆ దేవుడు రాముడు.
వివరణ -
శ్రీ కోడీహళ్ళి మురళీ మోహన్ గారొక్కరే సరియైన వివరణతో సమాధానం చెప్పారు. వారి వ్యాఖ్యనే ఇక్కడ ప్రచురిస్తున్నాను. వారికి అభినందనలు. ధన్యవాదాలు.
నలుమొగములవాడు బ్రహ్మ
వాని చెలువ సరస్వతి
ఆమె అత్త లక్ష్మి
ఆమె కొడుకు మన్మథుడు
అతని పగతుడు శివుడు
అతనిభార్య పార్వతి.
ఆమె తండ్రి పర్వతుడు
అతని వైరి ఇంద్రుడు.
ఆతని తనయుడు అర్జునుడు.
అతని బావ కృష్ణుడు.
అతని దాయ(శత్రువు) జరాసంధుడు
అతని జంపువాడు భీముడు.
వాని తండ్రి వాయుదేవుడు.
అతని సుతుడు ఆంజనేయుడు.
అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.
ప్రహేళికను పరిష్కరించే ప్రయత్నం చేసినవారు .....
మందాకిని గారు, నారాయణ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

1 కామెంట్‌:

 1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, అక్టోబర్ 31, 2010 9:24:00 AM

  గురువు గారూ,
  సమధానం కనుక్కోవడం క్లిష్టమే అయినా, చాలా బాగుంది.
  కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ, అభినందనలు.

  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి