27, జనవరి 2011, గురువారం

ప్రహేళిక - 42 సమాధానం.

పేరు చెప్పండి.
సీ.
మృగలాంఛనుండుగ మింటనుండు నెవండు?
ఘనసార మను పేరు గలది యేది?
పుట్టలపైఁ జూడఁ బుట్టెడి గొడు గేది?
పాపడికై తల్లి పాడు నేది?
యవనీతనూజుఁడౌ హరివైరి యెవ్వఁడు?
పక్షులు చరియించు పథ మదేది?
రసము లూరించు భారతదేశ ఫలమేది?
యచ్చువేసెడి కార్య మనఁగ నేది?
తే.గీ.
యన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
కాకతీయ సామ్రాజ్యపు ఘనతఁ గన్న
ముఖ్యపట్టణమై వెల్గు పుర మదేది?
వివరణ -
మృగలాంఛనుడుగా మింట నుండు వాడు - ఏణాంకుడు.
ఘనసార మను పేరు గలది - కర్పూరము.
పుట్టలపై పుట్టెడి గొడుగు - శిలీంధ్రము.
పాపడికై తల్లి పాడునది - లాలిపాట.
అవనీతనూజుడగు హరి వైరి - నరకుడు.
పక్షులు చరియించు పథము - గగనము.
రసము లూరించు భారతదేశ ఫలము - రసాలము.
అచ్చువేసెడి కార్య మనగా - ముద్రణము.
ఏణాంకుడు - కర్పూరము - శిలీంధ్రము - లాలిపాట - నరకుడు - గగనము - రసాలము - ముద్రణము.
పై పదల మొదటి అక్షరాలను చదివితే తెలిసే కాకతీయుల రాజధాని ...
ఏకశిలానగరము.
వివరణతో సరియైన సమాధానాలు పంపిన వారు ...
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
మంత్రిప్రగడ బలసుబ్రహ్మణ్యం గారు.

అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి