10, నవంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 29 సమాధానం

ఎవరీ మూర్ఖ విద్యార్థులు?
సీ.
గోవింద రాజులు కొలువున్న నగరేది?
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు?
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు?
శివ వాహనము పేరి క్షేత్ర మేది?
ధరణికి నీటిని దాన మొసఁగు నేది?
యితరుల కొనరించు హిత మదేది?
వెనుకటి గాంధర విద్యాలయం బేది?
మానవుం డన వేఱు మాట యేది?
తే.గీ.
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె?
నన్నిఁటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు క్రమముగా మూడవ యక్షరములఁ
జదువ నొక గురువును జేరి చదువఁ గోరి
నట్టి మూర్ఖ విద్యార్థుల నరయుఁ డిపుడు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి వివరణ ...
గోవింద రాజులు కొలువున్న నగరేది? - తిరుపతి
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు? - ముకురము
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు? - వనమాలి
శివ వాహనము పేరి క్షేత్ర మేది? - మహానంది
ధరణికి నీటిని దాన మొసఁగు నేది? - అంబుదము?
ఇతరుల కొనరించు హిత మదేది? - సాహాయ్యము
వెనుకటి గాంధర విద్యాలయం బేది? - తక్షశిల
మానవుం డన వేఱు మాట యేది? - మనుష్యుడు
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె? - వలలుడు
తిరుపతి - ముకురము - వనమాలి - మహానంది - అంబుదము - సాహాయ్యము - తక్షశిల - మనుష్యుడు - వలలుడు
పై పదాల మూడవ అక్షరాలను చదివితే ...
సమాధానం - పరమానందయ్య శిష్యులు.
సమాధానాలు పంపిన వారు ...
నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంద పీతాంబర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి