1, నవంబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 22 సమాధానం

ఎవరీ వ్యక్తి?
సీ.
ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు?
పోతన రాజైన ఖ్యాతి యేది?
విద్యతో పాటేది విధిగ నుండవలెను?
సరస మాడెడివాని సంజ్ఞ యేది?
స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది?
అన్ని ప్రాణుల కేది యవసరమ్ము?
అలసిన డెందము లానందపడు నెట?
శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పద నర్తనమున
క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు?
వివరణ -
ఫల్గుణుని ధ్వజముపై నుండే రాజు - కపిరాజు
పోతన రాజైన ఖ్యాతి - కవిరాజు
విద్యతో పాటు విధిగ నుండవలసింది - వినయము
సరస మాడెడివాని సంజ్ఞ - సరసుడు
స్తంభోద్భవుండైన శౌరి రూపము - నృసింహుడు
అన్ని ప్రాణులకు అవసరమైనది - ఆహారము
అలసిన డెందము లానందపడు చోటు - ఆరామము
శాంతి చిహ్నఁపు పక్షి జాడ - పావురము
కపిరాజు - కవిరాజు - వినయము - సరసుడు - నృసింహుడు - ఆహారము - ఆరామము - పావురము
పై పదాల రెండవ అక్షరాలను చదివితే ....
సమాధానం - పి వి నరసింహారావు.
సమాధానాలు పంపినవారు ...
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మైథిలీరం గారు, అనఘ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.

1 కామెంట్‌:

  1. నేను పంపిన ప్రహేళికకు సుందర మైన రూపకల్పన చేసి సహృదయముతో

    ప్రకటించిన శ్రీ శంకరయ్య గారికి,పాల్గొన్న మిత్రులందరికీ కృతఙ్ఞతలు,ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి