5, నవంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 26 సమాధానం

ఈ కలహభోజనుడిని ఏమంటారు?
సీ.
కరములతో ముష్టిఘాత యుద్ధం బేది?
రంగస్థలముపై విరాజిలు నెది?
కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె?
భాగ్యనగర మయె నే భామ పేర?
భరియించరానట్టి పద్ధతి నే మందు
రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు?
మంచి దైనట్టి సమాచార మేమంద్రు?
ముక్కన్ను లుండు నే పూజ్యునకును?
తే.గీ.
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన?
నన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరమ్ముల ననుసరింపఁ
గలహభోజనుం డగుఁ దెలుపఁ గలరె మీరు?
వివరణ -
కరములతో ముష్టిఘాత యుద్ధం - బాహాబాహి
రంగస్థలముపై విరాజిల్లేది - నాటకము
కరినిఁ బట్టి కంజాక్షుచేత చచ్చింది - మకరము
భాగ్యనగర మయింది ఈ భామ పేర - భాగమతి
భరియించరానట్టి పద్ధతి - దుర్భరము
ఏ ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు? - వసంతము
మంచి దైనట్టి సమాచారము - శుభవార్త
ముక్కన్నులు ఏ పూజ్యున కుంటాయి? - శివునకు
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన? - పాండురాజు
బాహాబాహి - నాటకము - మకరము - భాగమతి - దుర్భరము - వసంతము - శుభవార్త - శివునకు - పాడురాజు.
పై పదాల రండవ అక్షరాలను చదివితే ...
సమాధానం - హాటకగర్భసంభవుడు.
సరియైన సమాధానం పంపినవారు -
రవీందర్ గారు, చంద్రశేఖర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
ప్రయత్నించినవారు -
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు,
దీపావళి శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి