2, నవంబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 23 సమాధానం

ఇది ఏమిటి?
సీ.
ఎలుకలు నివసించు కలుగు నేమందురు?
కలిగినవాఁ డేమి కలిగియుండు?
గడచిపోయినదానికై యే పదం బున్న
దన్నార్థు లగుదు మే మున్న వేళ?
గంగాళమున కున్న ఘనమైన పేరేది?
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె?
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది?
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది?
తే.గీ.
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁ
డన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లగు; ద్వితీయాక్షరముల నరసి చూడఁ
దెలుఁగుతో నొక ప్రాంగణం బలరె; నేడు
పేరు మార్పుతో జరిగెను పెద్ద గొడవ.
వివరణ -
ఎలుకలు నివసించు కలుగు నేమందురు? - బిలము
కలిగినవాఁ డేమి కలిగియుండు? - కలిమి
గడచిపోయినదానికై యే పదం బున్నది? - గతము
అన్నార్థు లగుదు మే మున్న వేళ? - ఆకలి
గంగాళమున కున్న ఘనమైన పేరేది? - కళాయి
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె? - హితోక్తి
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది? - క్షీరము
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది? - బాణము
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁడు? - భీముడు.
బిలము - కలిమి - గతము - ఆకలి - కళాయి - హితోక్తి - క్షీరము - బాణము - భీముడు
రెండవ అక్షరాలను చదివితే ......
సమాధానం .... లలితకళాతోరణము.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, మందాకిని గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంద పీతాంబర్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి