18, అక్టోబర్ 2011, మంగళవారం

యడాగమం _ 2

యడాగమం _ 2
3) ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
ఏమి, మఱి, కి(షష్ఠి), అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి అనేవి ఏమ్యాదులు (ఏమి + ఆదులు -‘ఏమి’ మొదలైనవి). ఈ పదాల చివర ఉన్న ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి వైకల్పికం (జరుగవచ్చు లేదా జరుగకపోవచ్చు).
ఉదా ...
ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి.
మఱి + ఏమి = మఱేమి, మఱి యేమి.
అది + ఎక్కడ = అదెక్కడ, అది యెక్కడ.
అవి + ఎవరివి = అవెవరివి, అవి యెవరివి.
ఇది + ఏమిటి = ఇదేమిటి, ఇది యేమిటి.
ఇవి + అతనివి = ఇవతనివి, ఇవి యతనివి.
ఏది + ఎక్కడ = ఏదెక్కడ, ఏది యెక్కడ.
ఏవి + అవి = ఏవవి, ఏవి యవి.
‘కిషష్ఠి’ అంటే షష్ఠీవిభక్తి ప్రత్యయం ‘కిన్’. ఇది ద్రుతప్రకృతికం. అంటే నకారం అంతమందు కలది. ‘హరికిన్ + ఇచ్చె’ అన్నప్పుడు సంధి జరుగకుంటే ‘హరికి నిచ్చె’ అవుతుంది. ద్రుతం (న్) లోపించినపుడు ‘హరికి + ఇచ్చె = హరి కిచ్చె’ అవుతుంది. ఇక్కడ యడాగమం రాదు.
ఇత్తునకు (హ్రస్వ ఇకారానికి) అనడంవల్ల దీర్ఘమైన ఇకారం (ఈ) కు ఇక్కడ సంధి జరుగక యడాగమమే వస్తుంది. ఉదా ... ‘ఏమీ + అంటివి = ఏమీ యంటివి’.
4) క్రియాపదములం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.
క్రియాపదాలలో ఇత్తుకు (హ్రస్వ ఇకారానికి) అచ్చు పరమైనపుడు సంధి జరుగవచ్చు లేదా జరుగక యడాగమం రావచ్చు. ఇది ప్రథమపురుష, ఉత్తమపురుష బహువచన క్రియారూపాలకే వర్తిస్తుంది.
ప్రథమపురుషకు ఉదా ...
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు, వచ్చిరి యప్పుడు.
ఉత్తమపురుషకు ఉదా ...
వచ్చితిమి + ఇప్పుడు = వచ్చితిమిప్పుడు, వచ్చితిమి యిప్పుడు.
‘మధ్యమపురుష క్రియలం దిత్తునకు సంధి యగును’ అనే సూత్రం చేత ‘ఏలితివి + అప్పుడు = ఏలితివప్పుడు; ఏలితిరి + ఇప్పుడు = ఏలితిరిప్పుడు’ అని సంధి జరుగుతుందే కాని ‘ఏలితివి యప్పుడు, ఏలితిరి యిప్పుడు’ అని యడాగమం రాదు.
5) క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.
భూతకాలాన్ని తెలిపే అసమాపకక్రియ క్త్వార్థం. ఒకే వ్యక్తి వెంటవెంట చేసిన రెండు పనులను ఒకే వాక్యంలో చెప్పినప్పుడు మొదటి క్రియాపదం అసమాపకంగా ఉంటుంది. ‘చూచి వచ్చెను’ అన్నప్పుడు మొదటి క్రియాపదం ‘చూచి’ అనేది అసమాపకం. ఇటువంటి క్రియాపదాల చివర ఇత్తు (హ్రస్వ ఇకారం) ఉన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది.
‘వచ్చి + ఇచ్చెను’ అన్నప్పుడు ‘వచ్చి’ అనేది క్త్వార్థం. దీని చివర ఉన్న హ్రస్వ ఇకారానికి (ఇత్తుకు) ‘ఇ’ అనే అచ్చు పరమైనపుడు సంధి జరుగక యడాగమం వచ్చి ‘వచ్చి + య్ + ఇచ్చెను = వచ్చి యిచ్చెను’ అవుతుంది.
ఇదే విధంగా క్రిందివి ...
చూచి + ఏడ్చెను = చూచి యేడ్చెను.
పోయి + ఉండెను = పోయి యుండెను.
తిని + ఏమనెను = తిని యేమనెను.
‘అచ్చున కామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱుచుగ నగు’ అనే సూత్రం వల్ల ‘ఔర + ఔర = ఔరౌర; ఆహా + ఆహా = ఆహాహా’ మొదలైన సంధులు జరిగి ‘తఱుచుగా’ అనడం వల్ల సంధి వైకల్పికంగా వచ్చి ‘ఏమి + ఏమి = ఏమేమి, ఏమి యేమి’ అవుతుంది. కాని ‘ఏగి + ఏగి’ అన్నప్పుడు ‘ఏగి’ అనేది క్త్వార్థం కాబట్టి సంధి జరుగక ‘ఏగి యేగి’ అని యడాగమం వస్తుంది.
‘అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగా నగు’ అనే సూత్రం వల్ల అది, అవి శబ్దముల హ్రస్వ అకారమునకు సమాసంలో లోపం వస్తుంది. బహుళంగా అనడం వల్ల లోపించక పోవచ్చు. ‘నా + అది’ అన్నప్పుడు ‘అ’ లోపించి ‘నా + ది = నాది’ అనీ, ‘అ’ లోపించకుంటే ‘నా + అది = నా యది’ అనీ అవుతుంది. అలాగే ‘నా + అవి = నావి, నా యవి’ అనేది.
ప్రస్తుతానికి ఇంతే!
మిత్రులారా,
యడాగమానికి సంబంధించిన మీకు తెలిసిన విశేషాలను, సందేహాలను వ్యాఖ్యలుగా పెట్టండి.

8 కామెంట్‌లు:

 1. శంకరార్యా ! శ్రమ దీసుకొని చక్కని పాఠాలిస్తున్నందులకు
  ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 2. > కాని ‘ఏగి + ఏగి’ అన్నప్పుడు ‘ఏగి’ అనేది క్త్వార్థం కాబట్టి సంధి జరుగక ‘ఏమి యేమి’ అని యడాగమం వస్తుంది.
  ఏగి యేగి.

  రిప్లయితొలగించండి
 3. ‘శ్యామలీయం’ గారూ,
  అది టైపాటు. ధన్యవాదాలు. సవరించాను.

  రిప్లయితొలగించండి
 4. గురువు గారు యడాగమము పై మీ పాఠాలకు ధన్య వాదాలు .మా బుర్రల కెక్కడానికి ఎంతకాలం పడుతుందో చూడాలి .

  రిప్లయితొలగించండి
 5. నేనందామనుకున్న మాట మందా పీతాంబర్ గారు చెప్పేశారు..

  గురువు గారూ ..,
  ఐతే హరికి నిచ్చె, హరికిచ్చె రెండూ సాదు రూపాలేనా అండీ?
  ద్రుతం లోపింపచేయలేని కట్టుబాట్లు కూడా ఉన్నాయా..

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 6. ఊకదంపుడు గారూ,
  ఆ రెండు సాధురూపాలు అనే కదా చెప్పింది.
  ద్రుతం లోపింపచేయలేని కట్టుబాట్ల గురించి నా తరువాతి పాఠం ‘ద్రుతకార్యాలు’లో చూడండి.

  రిప్లయితొలగించండి