10, ఫిబ్రవరి 2022, గురువారం

సమస్య - 3988

11-2-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జవహరులాల్ చంపెను గద జాతిపిత నయో”
(లేదా...)
“జవహరులాలు చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై”

24 కామెంట్‌లు:

  1. కందం
    ప్రవరుఁడన స్వేచ్ఛ నొసఁగగ
    స్తవనీయుఁడహింస సత్య ధర్మయుతుండై
    యవగుణుఁడు, వేదనన్ బడ
    జవహరులాల్, చంపెను గద జాతిపిత నయో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ప్రవరుడనంగ మ్లేచ్ఛులను భారతదేశము వీడిపోవఁ దా
      స్తవములనంద స్వేచ్ఛనిడె సత్యమహింసలు నాయుధమ్ములై
      యవగుణుఁడైన గాడ్సె యసహాయుని, చింతిలి విస్తుపోవఁగన్
      జవహరులాలు, చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై!

      తొలగించండి
  2. ఎవరనె వెధవా నీతో

    జవహరు లాల్ చంపెనుగద జాతిపిత,నయో

    గవ, నీచమైన పలుకుల

    నెవరైన పలుకగ వాని నేడ్పును‌ చూతున్


    అయోగవ. = కటినముగ మాటలాడువాడు

    రిప్లయితొలగించండి
  3. నవతకు పథ కము లల్లెను
    జవహరు లాల్ : చంపె జాతి పిత నయో
    యవగుణ గాడ్సే క్రూరత
    నవనియు దుఃఖా నము న్గ హంతకుడగుచున్

    రిప్లయితొలగించండి
  4. అవగతముగానినిమిసము
    యువనేతకుతెచ్చిపెట్టెయుద్ధముగద్దెన్
    సవరణజేసెనుతాతగ
    జవహరులాల్చంపెనుగదజాతిపితనయో

    రిప్లయితొలగించండి

  5. సవిధముఁ గాడ్సెను జూపుచు
    వివరమడిగినట్టి మిత్ర బృందముతో తా
    నవసాదమున వచించెను
    జవహరు లాల్, చంపెనుగద జాతిపితనయో.

    రిప్లయితొలగించండి
  6. సవనముగాదెపోరునటజాతికినేతకుదేశమందునన్
    యువతనుమేలుగొల్పిరహయోగముదాల్చునహింసమార్గమున్
    కువకువలాడహత్యలనుకోపముతోడుతగాడ్సెనేమరన్
    జవహరులాలు’చంపెగదజాతిపితన్గడునిర్దయాత్ముడై

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి

    శాంతి,సత్యమహింస శస్త్రాస్త్రములుగ
    పోరు సల్పెడు నాయకుల్ భోరనంగ
    వగవ //జవహరులాల్ ,చంపెనుగద జాతి
    పితనయో!//గాడ్సె,విధిలీలవింతకాదె.

    రిప్లయితొలగించండి
  8. అవిరల పోరు జేయ జనులందర నైక్యము
    జేసి మ్లేచ్చులన్
    సవినయ గాంధి శాంతియును సత్యము వీడక తర్మివేసిరా
    జవహరులాలు, చంపెగద జాతిపితన్ గడు
    నిర్దయాత్ముడై
    అవినయ గోడుసే కపట హారితుడెల్లరు
    చోద్యమందగన్

    రిప్లయితొలగించండి
  9. సవిధము వ్రీడనమ్మున పచారులు చేసెడు గాడ్సెఁ జూపుచున్

    వివరము గోరులోకులకు వేదన తోడ వచించె నిట్టులన్

    ధవళ తపాయమున్ శిరము దాల్చిన నాయకు డౌ ప్రధాని యా

    జవహరు లాలు, చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై.

    రిప్లయితొలగించండి
  10. నవభారత నిర్మాతయె
    జవహరులాల్ ; చంపెను గద జాతిపిత నయో
    సవినయముగ వందనమిడి
    యవనుల సహకారి యనుచు నలిగిన గాడ్సే

    రిప్లయితొలగించండి
  11. పవలునురేయి జాతిపిత భారతి దాశ్య విమోచనంబుకై
    బవరముసల్పె నాంగ్లదొరపాలనతో తనతోడు నిల్వగా
    జవహరులాలు, చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై
    యవగుణుడైన గాడ్సె జనులందరి శోకము పెచ్చరిల్లగా

    రిప్లయితొలగించండి
  12. అవసరమేమిలేదు యుధి నాయుధముల్ ధరియించి పోర ,శా
    త్రవులను పారఁద్రోలెదము రండని పిల్వగ విస్మయుండయెన్
    జవహరులాలు,చంపెగద జాతిపితన్ గడు నిర్దయాత్ముడై
    యవమతినౌర! “గాడ్సె”జనులశ్రులు రాల్చిరి శోకమగ్నులై.

    రిప్లయితొలగించండి
  13. అవిరళ రక్తధారలిట నావిరులౌట నెఱింగి, సజ్జన
    స్తవ నవభారతావనిని దప్పిదముం గని చింతనొంది, వె
    న్తవులుచు గాడ్సె యక్కసమునన్, వ్యధ నొంద ప్రధాన మంత్రియౌ
    జవహరులాలు, చంపె గద జాతిపితన్ గడు నిర్దయాత్ముడై.

    రిప్లయితొలగించండి
  14. కవితావేశము పొంగగ
    వివరము లెరుగక సృజించె విప్లవ చరితన్
    కవనములో చిత్రంబుగ
    జవహరులాల్ చంపెను గద జాతిపిత నయో

    రిప్లయితొలగించండి
  15. అవగుణముల నెలవాతం
    డవనిని గాడ్సే యహింస కవరోధంబై
    యవియగ మనముననెంతో
    జవహరులాల్, చంపెను గద జాతిపిత నయో

    రిప్లయితొలగించండి
  16. అవిరళమైన దీక్షగొని యంతము చేసె పరాయి పాలనన్
    బవరముచేసి శాంతియుత భావన గాంధి, కరమ్ము కక్ష ఫే
    రవుడగు గాడ్సె విజ్ఞుని విరాగిని, దిగ్భ్రమ చెంద మాన్యుడౌ
    జవహరులాలు, చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై!

    రిప్లయితొలగించండి
  17. నవభారతపు ప్ర ధానియె
    జవహర్ లాల్ ,చంపెనుగద జాతిపితనయో
    యవగుణు డాగాడ్సేయే
    యవనింగల ప్రజలు మిగుల యారడిజేయన్

    రిప్లయితొలగించండి
  18. అవనిఁ గొడుకు దుడు కైనం
    దవులును దోషం బతని పిత కమోఘంబౌ
    యవన మొసఁగ లేక యకట
    జవహరులాల్ చంపెను గద జాతిపిత నయో


    కవిసి నమస్కరించి తగఁ గ్రన్ననఁ దీసి నిజాయుధమ్ము న
    స్త్ర వరము వీడి యాత్మ ననురాగము భారత దేశ పౌరుఁడే
    జవమున దేశపాలనము సల్పుచు నుండఁగ జాతిరత్నమౌ
    జవహరులాలు చంపెఁ గద జాతిపితన్ గడు నిర్దయాత్ముఁడై

    రిప్లయితొలగించండి
  19. నవయుగ భారతంబునకు నవ్యతనీయ ప్రధాని యయ్యేగా
    జవహరులాలు, చంపెగద జాతిపితన్ గడునిర్దయాత్ముడై
    యవగుణ సంయుతుండయిన గాడ్సెయె ద్రోహపు బుద్ధితో వెసన్
    గవనము వ్రాయుచుండగను గన్నులనుండియు నీరుగారెసూ

    రిప్లయితొలగించండి
  20. కం:భువి నొక ప్రథాన పాత్రగ
    వ్యవహరము సలుపు గాంధి యంతముకై శా
    త్రవు కుట్రల గమనింపని
    జవహర్లాల్ చంపెను గద జాతిపిత నయో!
    (గాంధీ గారి ప్రాణాలకి గాడ్సే తో ప్రమాదం ఉన్నదని తెలిసినా అతని కుట్రని గమనించి తగిన రక్షణ కల్పించ లేక పోయిన నెహ్రూ గారు గాంధీ గారిని పోగొట్టుకున్నాడు కదా!)

    రిప్లయితొలగించండి
  21. చం:సవినయమూర్తియున్, భరత జాతిని దీర్చెడు మార్గదర్శి యున్
    ప్రవిమల చిత్తుడున్ మనల బాసె నటంచును దుఃఖ మొందగా
    జవహరు లాలు , చంపె గద జాతిపితన్ కడు నిర్దయాత్ముడై
    యువకుడు నాథురాము కడు నుగ్రత దాల్చి వివేకహీనుడై.

    రిప్లయితొలగించండి
  22. అవిరళకృషిచే నేతయె
    జవహరులాల్, చంపెను గద జాతిపిత నయో”*
    నవగుణములతోనిండిన
    నవమతియౌగాడ్సెకరుణనావలనిడుచున్

    రిప్లయితొలగించండి