5, ఆగస్టు 2025, మంగళవారం

సమస్య - 5204

6-8-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె”

(లేదా...)

“ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)


13 కామెంట్‌లు:

  1. ప్రవరుడను విప్రవరుఁగాంచి స్వర్గవధువు
    యలరువిలుతుని శరముల నటమటించి
    వలచి వచ్చిన వనితను వలదటన్న
    ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె

    రిప్లయితొలగించండి
  2. ప్రవరుండా హిమశైల సానువులలో బన్నమ్మునంజిక్కి స్వ
    ర్గవధూటింగని త్రోవఁజూపుమనఁగా కందర్పు బాణాహతిన్
    వివశత్వమ్మున జేరబోవ దరికిన్ విప్రుండు రోధించనా
    ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్

    రిప్లయితొలగించండి

  3. సారథిగ నుత్తరుడు తేరు జవము నడుప
    రథిగ గాంఢీవమున్ బట్టి రణము సేయ
    వచ్చు చుండిన వీరుండు పాండు సుతుడు
    ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె



    భువికేతెంచిన యుష్ణరశ్మివలె నా పోరాటమున్ జేయగా
    జవమందుత్తరుడే రథమ్ము నడుపన్ సాక్షాత్తు భీభత్సుడే
    బవరమ్మందున శత్రుమూకలను తా పాలార్చగా వచ్చెడిన్
    ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్.

    *(ప్రవరుడు= శ్రేష్ఠుడు, వరూధిని= సేన.)*

    రిప్లయితొలగించండి
  4. నవకవి యొకండు పెద్దన 
    కవి రచన తుదను చదువక కావ్యము నందున్
    ప్రవచించె నిటుల , మాయా
    ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె

    రిప్లయితొలగించండి
  5. మ.
    దివిషన్నమ్య మహోజ్జ్వల ప్రకట సద్దివ్యాఖ్య రూపంబునే
    వివశత్వంబున చిత్త వీథిని సదా విస్ఫార శృంగార వాం
    ఛ విహారంబులు సేసె, నిప్డు మహిమల్ సంధిల్లి శోకంబులా
    ప్రవరుం గాంచి వరూథినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్ !

    రిప్లయితొలగించండి
  6. ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె
    ననుట సత్యదూరముగదా ఘన కృతమతి
    నాతి కోర్కెల కారణభూత మతడు
    ప్రవరుఁ గని వరూధిని మోము వివశమగును

    క్రమాలంకారములో...
    'ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్?
    జవరాలెవ్విధి చిత్తగించ దగునో సందేహమున్ దీర్చుమా!'
    'వివరంబేల వరూధినీ వదనమే విప్పారుగా రూడిగా
    సవరించున్ గద శయ్య కోరినపుడే సౌఖ్యంబు సంప్రాప్తమౌ'

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. జవరాండ్రందరు మోహనాంగుఁగనరేచందంబు విర్హాగ్నులై
    భవదీయుండటయవ్వనంబుననుసంపన్నుండు నందంబులో
    నవగాంధర్వునిలీలచే మధుర విన్నాణంపు మాయామయున్
    ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  9. అంద చందపు ప్రవరుని పొంద గోరి
    తెలుపగ దిర స్క రించిన దీన ముగను
    ప్రవ రు గని వ రూ ధిని మోము ధ్వ o స మ య్యె
    నను చు వచియించె మిత్రుతో నచ్చె రువుగ

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:బ్రహ్మ వర్చస్సు నిండిన బ్రాహ్మణుడని
    వికసన మ్మొందె పద్మమ్ము విచ్చినట్లు
    ప్రవరుఁ గని వరూధిని మోము, ధ్వంసమయ్యె
    తాను దేవకాంత ననెడు దర్ప మెల్ల.
    (నిజానికి వరూధిని దేవ కాంత.ప్రవరుడు మానవుడు.కానీ అతని బ్రహ్మతేజస్సుని చూసి తాను దేవకాంత ననే దర్పం పోయి ప్రేమలో పడింది.ప్రేమించిన అమ్మాయి తన అగ్రవర్ణాధిక్యతని మరచినట్లే.)

    రిప్లయితొలగించండి
  11. మ:స్తవనీయమ్మగు నిత్య యౌవనము,నందమ్మున్ కడున్ గల్గి యా
    ప్రవరున్ గోరగ బెట్టు జేయ నతడున్ రక్తమ్మునే చిందదే
    ప్రవరుం గాంచి వరూధినీ ముఖము? విధ్వంసంబు గాకేమగున్
    భువినే మెచ్చని దేవ దర్ప మొక విప్రున్ నైష్టికత్వమ్ము చేన్.
    (తనను తిరస్కరించిన ప్రవరుణ్ని చూసి వరూధిని ముఖం కోపం తో రక్తం చిందింది.భూమినే లెక్క చెయ్యని దేవకాంత యొక్క అహం ఒక విప్రుని నైష్టికత ముందు విధ్వంస మై పోయింది కదా!)

    రిప్లయితొలగించండి
  12. తా వలచిన స్త్రీ కోర నితరుని నెడఁద
    కాలకుండ నుండునె కడుఁ గామ తప్తుఁ
    డొక్క గంధర్వుఁ డచ్చోట నుండ నట్లు
    ప్రవరుఁ గని వరూధిని, మోము ధ్వంస మయ్యె


    అవనీదేవుఁడు నిర్జితేంద్రియుఁడు నిత్యాగ్నిప్రదీప్తుండు గౌ
    రవ వంశోద్భవుఁ డుండ నిర్మల మతిం బ్రార్ధించుచున్ నమ్రుఁడై
    యువతీ రత్నము తీక్ష్ణ సంజనిత కామోగ్రాగ్ని దగ్ధాత్మ కాఁ
    బ్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గా కేమగున్

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    సోయగము సింది నాట్యాన చూపు కలిపి
    భువికి స్వర్గమ్ము దించెడున్ మోహమొలుక
    వివశమే లేక సన్నిధి వీడనెంచు
    ప్రవరుఁ గని వరూధిని మోము ధ్వంసమయ్యె!


    మత్తేభవిక్రీడితము
    నవలావణ్యము సిందుసోయగముతో నాట్యాన రంజించుచున్
    భువికిన్స్వర్గము దించు కౌగిళికిఁ దా మోహంబునన్బిల్చినన్
    వివశత్వంబునఁ దేలు వాంఛ కరువై వేదమ్ము వల్లించెడున్
    ప్రవరుం గాంచి వరూధినీ ముఖము విధ్వంసంబు గాకేమగున్?

    రిప్లయితొలగించండి