12, ఆగస్టు 2025, మంగళవారం

సమస్య - 5211

13-8-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా”

(లేదా...)

“కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా”

6 కామెంట్‌లు:

  1. మ.
    కలిత ప్రస్ఫురదాభ వైభవ సముత్కళ్యాణ యజ్ఞావళి
    స్థలియై, మౌనులు పాదధూళులను సంధానింప దివ్యంబుగా
    వెలిగెన్ భారత భూమి శాంతి వనమై, విధ్వంసముల్ రేపు మూ
    కలతో వైరము తప్పదా మనకు సౌఖ్య ప్రాప్తికిన్ మిత్రమా !

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్రం సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ వ్యంగ్యముగా అర్జునునితో..

    కందం
    విలువీడుచు బంధువులని
    కలవరపడి మోహమొంది కాదన రణమున్
    గొలువందుదె? కౌరవ మూ
    కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా?

    మత్తేభవిక్రీడితము
    తలుపుల్ మూయుచు సంధికిన్ జెలఁగగన్ దాయాదులున్ యుద్ధమై
    పిలువన్ సాదిగ వచ్చితిన్, గెలువగన్ వేంచేసి మోహంబుతో
    విలువీడన్ గొలువందుదే? సుఖమె నిర్వృత్తిన్ మనన్? బంధు మూ
    కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!

    రిప్లయితొలగించండి

  3. వలదింద్రోత్సవమనిరని
    యలకను బూనుచు నిడుజడి యటకురిపింపన్
    కలుచను బూనరె యదుమూ
    కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా.


    బరవంతుండ్రగు పాండుపుత్రులను సంభావింపకన్ మూర్ఖుడై
    కలనున్ గోరె సుయోధనుండచట నా కంసారియే చెప్పినన్
    ఖలురౌ మిత్రులమాయలో మునిగె యుగ్రంపశ్యులౌ శత్రుమూ
    కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా.

    రిప్లయితొలగించండి
  4. మలమే భోజనమో మరేమి తినునో మాటల్ వివాదంబులౌ
    పులిసెన్ వానికి, మత్తు జార మిగులున్ మున్నీరు కన్నీరుగన్!
    గెలుకన్ జావరె బుద్ధి హీనులిక! పాకిస్తాను కల్ముచ్చు మూ
    కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!!


    మున్నీరు = అసిం మున్నీరు

    రిప్లయితొలగించండి
  5. చెలిమి చెడె వారి నడుమన
    పొలమున కధిపతి యెవరని పోటీ పడగన్
    నెలవున జరిగెడు యీ యెని
    కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా

    రిప్లయితొలగించండి
  6. వలపులు రేపిన తలపులు
    కలతలు రేపిన తదుపరి కటుతర మగునా
    చెలిమిని విడనాడు కుశం
    కలతో వైరమ్ము దప్పఁ గలదా సఖుఁడా

    నిలువన్ జాలను నిన్నుచూడ కనుచున్ నిత్యంబు వాక్రుచ్చుచున్
    వలపుల్ రేపి వివాహమాడి పిదపన్ వంచించుటే న్యాయమా
    కలతల్ రేపుచు నుంటివేల పొగరా! కాకుండినన్ నీ కుశం
    కలతో వైరము దప్పదా మనకు సౌఖ్యప్రాప్తికిన్ మిత్రమా!

    రిప్లయితొలగించండి