20, ఆగస్టు 2025, బుధవారం

సమస్య - 5219

21-8-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా”

(లేదా...)

“సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా”

14 కామెంట్‌లు:

  1. మన్మడు చేసిన పనులకు
    తన్మయమొంది సఖులెల్ల తగులము తోడన్
    ఉన్మాదులగుచు సలిపెడు
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా”

    రిప్లయితొలగించండి
  2. కందం
    తన్మయమొందెడు రీతిగ
    జన్మము మొదలతిశయోక్త స్తవములె శిష్యా!
    విన్మా! పదవీ విరమణ
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా!

    శార్దూలవిక్రీడితము
    జన్మమ్మా దిగ నిన్ను నేటి వరకున్ జంద్రుండు నింద్రుండనన్
    తన్మాత్రమ్ముల ముంచి వారతిశయోక్తమ్మెంచి స్తోత్రంబులం
    దున్మాదమ్మున నింగి కెత్తెదరు నుద్యోగాంతిమంబందునన్
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా! నీవు పోవద్దురా!

    రిప్లయితొలగించండి

  3. తన్మయులగుచును కాదట
    సన్మానము చేయుట ధన సంపాదనకై
    సన్మానము చేసెదరట
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా.



    ఉన్మానమ్మది పెచ్చరిల్లె కనుమా యుక్తంబు కాదన్న నా
    యున్మాదుల్ వినకుండనచ్చటదివో యున్మాదికిన్ బేర్మితో
    సన్మానమ్మును సేయుచుండిరచటన్ జాగ్రత్త నాలించుచున్
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా.

    రిప్లయితొలగించండి
  4. శా.
    హృన్మార్గంబున ద్వేషముట్టి పడుగా హీనుండు తా వానిలో
    నున్మాతంగ మదంబు పోలు గుణముల్ వ్యోమంబునంటుం గదా
    నిన్మిత్రుండని ప్రజ్ఞ మెచ్చి యచటన్ నీకై ఘనంబైన యే
    సన్మానం బొనరించు ? నా సభకు శిష్యా నీవు పోవద్దురా !

    రిప్లయితొలగించండి
  5. తన్మ యు లగుచును జనులిల
    సిన్మా తారలకు సలుపు చిత్రపు గతి గా
    నున్మాద ముతో జేసె డి
    సన్మానము జరుగు సభకు జనవలదు సుమా!

    రిప్లయితొలగించండి

  6. మన్మోహన! వినుమంటిని
    యున్మాదులు తీవ్రవాది నుత్సాహముతో
    సన్మానించెదరట యా
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా.


    సన్మార్గమ్మున సంచరించెదవు నీ జాగ్రత్త యే ముఖ్యమౌ
    యున్మాదమ్మున తీవ్రవాదులట తామున్మాదికిన్ బేర్మితో
    సన్మానమ్మును సేయుచుండిరికదా స్వచ్ఛందజుల్ కూడుచున్
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా.

    రిప్లయితొలగించండి
  7. జన్మస్థానంబయినన్
    సన్మానార్హత కరువగు సభకెందులకో
    సోన్మాదులు తలపెట్టిన
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా

    జన్మస్థానము పైన గౌరవముతో సంపూర్ణమౌ ప్రేమతో
    సన్మానార్హత లేనివాని సభకున్ సాగింతువా పైనమే
    సోన్మాదుల్ తలపెట్టిరీ కెలసమే చోద్యంబుగా నచ్చటన్
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా

    రిప్లయితొలగించండి
  8. ఉన్మాదము గదురుకొనిన
    సన్మానముఁ గోరును మది సముదీర్ణముగా
    జన్మములో సవ్యాజఁపు
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా

    రిప్లయితొలగించండి
  9. విన్మా‌! నిజమని‌ నమ్మకు‌
    తన్మయమొనరించు‌వారి‌ దండిపొగడ్తల్‌
    కన్మొఱఁగు‌కదా! తెలిసిన
    సన్మానము‌ జరుగు‌ సభఁకు‌ జనవలదు‌ సుమా‌!

    రిప్లయితొలగించండి
  10. ఉన్మాదమ్మదియేమొ యిజ్జగమునం దోఘమ్ముగా దుర్జనుల్
    సన్మానమ్ముల నొందఁగోరెదరుగా సత్కార్యముల్ సల్పకే
    సన్మానార్హత లేని బాలిశునకున్ సన్మానమున్ బూనుచో
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా

    రిప్లయితొలగించండి
  11. సన్మానముకన్న గుర్తింపు మిన్న)

    కం॥ జన్మ తరించెడు విద్యలు
    సన్మార్గమ్మునఁ బడయుట సమ్మానమిలన్
    దన్మయమొసఁగు నిదియొకటె
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా

    శా॥జన్మంబందున విజ్ఞతా ధృతికి విశ్వంబంత శ్లాఘించెడున్
    సన్మార్గంబును శాస్త్ర శోధనల సంస్కారంపు సద్భాగ్యమే
    సన్మానమ్మగుఁ గాని యన్యమగునే సారించ నున్మాదివై
    సన్మానం బొనరించు నాసభకు శిష్యానీవు పోవద్దురా

    (నేడు మనకున్న సౌలభ్యాలన్నీ శాస్త్రశోధన ద్వారా వచ్చినవే నండి. శాస్త్రజ్ఞుల ఖ్యాతి చిరస్థాయిగా ఉంటుందండి)

    రిప్లయితొలగించండి
  12. కం:నిన్ మాటాడగ నీయక
    నిన్ మెచ్చెడు వారలేమి నేర్వని వారై
    నన్ మాటాడెడు పై పై
    సన్మానము జరుగు సభకుఁ జనవలదు సుమా”
    (ఎవరో మహాకవికి సన్మానం చేస్తారు.ఆ కవికి మాట్లాడే సమయం ఉండదు.అతణ్ని మెచ్చే వాళ్లకి,సన్మాన పత్రాలకి సమయం ఐపోతుంది.పోనీ ఆ మాట్లాడే వాళ్లు ఈ కవి గూర్చి నిజం గా విశ్లేషిస్తారా? అంటే అదీ ఉండదు.ఇలాంటి మొక్కుబడి సన్మానాలకి వెళ్లకు.)

    రిప్లయితొలగించండి
  13. శా:సన్మానమ్ములటంచు పల్కుబడికై సాహిత్య సంసర్గ మీ
    షన్మాత్రమ్మును లేక మ్రొక్కుబడిగా సాగించ నే పెద్దలో
    నిన్ మాటాడగ నీక వేది పయి మందిన్ నింపుటే ముఖ్యమై
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా”
    (ఒక మారు విశ్వనాథ వారి సన్మానం లో ఇలాగే ముఖమాటాలకి అందరికీ మాట్లాడే అవకాశా లిచ్చి చిట్ట చివరికి ఆయన్ని మాట్లాడ మంటే ఇప్పుడు నేను మాట్లాడే దేమిటి? మీరు వినే దేమిటి? అని అసంతృప్తి వ్యక్తం చేసారు.)

    రిప్లయితొలగించండి
  14. తున్మాడ వలయును యశ
    స్తన్మయ చేష్టా నిమగ్న తామస కృతముల్
    విన్మా యెన్నఁడు కైతవ
    సన్మానము జరుగు సభకుఁ జన వలదు సుమా


    ఉన్మాదమ్ము సెలంగఁ గీర్తి కయి యుద్యోగించి వెచ్చింపఁగాఁ
    దన్మోహమ్మున విత్త రాసులను సత్కారార్థ మత్యంతమున్
    విన్మా తత్సభ సంభవించినది సంవీక్షించి యీ సత్యమున్
    సన్మానం బొనరించు నా సభకు శిష్యా నీవు పోవద్దురా

    రిప్లయితొలగించండి