26, అక్టోబర్ 2025, ఆదివారం

సమస్య - 5286

27-10-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు”
(లేదా...)
“అమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ముత్యంపేట గౌరీశంకర్ గారి సమస్య)

12 కామెంట్‌లు:

  1. పితర , తాత లిరువురును బిద్ది యుండ,
    ముసలి యామె యొకతె మూల మూల్గు చుండె .
    నామె నన్ని విధంబుల నాదుకొనగ
    నమ్మకుఁ గలదు భార్య ! యేమని పిలుతురు ?

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    భార్య యుద్యోగియై భర్త వంటవండ
    సంకటము వీడె సంతుకు, జనకుని విడి
    జనని సఖియఁగొని సహజీవనమునెంచ
    నమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు?

    ఉత్పలమాల
    అమ్మయె నిత్యమున్ కొలువునందున నుండగ తండ్రివంటలన్
    కమ్మగ సంతుకున్ గడచె కాలము కష్టము లేక, తండ్రినే
    పొమ్మని కూడగన్ సఖిని ముచ్చటగా సహజీవనమ్మునం
    దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్?

    రిప్లయితొలగించండి

  3. పిడికెడు మెతుకుల కొరకు వెట్టి చేయు
    పేద కా యూరి వారలు పెండ్లి సేయ
    పతియె సర్వస్వ మనియెంచు పడతి నాయు
    డమ్మకుఁ గలదు భార్య, యేమని పిలుతురు.

    *(నాయుడమ్మ అని పురుషులకు పేరు పెట్టుకొనుట కొన్ని చోట్ల కలదు.)*


    ఇమ్మహి లోన వాడు కన హీనగుణాత్ముడటంచు లోకులే
    నమ్మిన మూర్ఖుడొక్కడు వినమ్రత జూపుచు నూరు కంతకున్
    నమ్మిన బంటు గా పిలుచు నౌకరతండట యట్టి పేద ద
    ద్దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  4. దిమ్మరి యౌచు దేశములు తిర్గుచు నుండును విందు కెవ్వరున్
    రమ్మని పిల్వకుండిన చలాచలి వెళ్ళి భుజించు తా సదా
    వమ్మగు నట్లుగన్ పనులు పాయక చేయుచు నుండు నట్టి ద
    ద్దమ్మకు గూడ భార్య గల దామెను నేమని పిల్వగా దగున్

    రిప్లయితొలగించండి
  5. అమ్మకు సహోదరిని మేనయత్త యనుచు
    నమ్మకు సహోదరుని మామ యనిపిలుతురు
    వమ్ము కాదు నుడువ యలవర్తి నాయు
    డమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు

    అమ్మకు భర్తయైన మరియాతడు నీకిక తండ్రియౌ గదా
    తమ్ముని కైనఁ దానగును తండ్రియె చెల్లెలి కైనఁ దండ్రియే
    ద్రిమ్మరియౌ నజానికొక లేమలభింపగఁ బెండ్లిచేయ ద
    ద్దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  6. ఇమ్ముగ నొక్కగ్రామమున నీశ్వరరావుకు పైడితల్లి యం
    కమ్మలు పుత్రరత్నములుగా జనియించిరి, పైడితల్లి పై
    డమ్మను బెండ్లియాడె సముదంచితరీతిని, తమ్ముఁడైనయం
    కమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁదగున్!

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:పెండ్లి యయ్యె క్రొత్తగ మాకు వేడ్క లేదు
    భార్య తో నాకు సరసమా?పనిమనిషిగ
    నమ్మకుఁ గలదు భార్య, యేమని పిలుతురు?
    తనయు, కోడలిన్ వేధించు తల్లి నకట?
    (తన భార్యను పనిమనిషిగా చూస్తూ వేధించే తల్లిని గూర్చి.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:కమ్మని పూల వాసనను గాంచడు,చక్కని చీర కట్ట నం
    దమ్మును జూచి మెచ్చ డిక దగ్గర జేరుచు ముద్దొసంగునా?
    అమ్మను గౌగిలించుకొని యాతడు నిద్రకు జారు నిట్టి ద
    ద్దమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్”
    (శృంగారసౌఖ్యం లేని భర్త తో భార్య వేదన)

    రిప్లయితొలగించండి
  9. తే॥ భువినిఁ బరిణయ మొందరె పురుషులటుల
    ముదముఁగని భార్య ముడివడ బ్రదుకు వరలు
    ననుచు నిరుపేద మనువాడి తనర నాయు
    డమ్మకుఁ గలదు భార్య యేమని పిలుతురు

    ఉ॥ ఇమ్మహిఁ బెండ్లి యాడనటు లెల్లరు మక్కువఁ జూపుచుందురే
    నెమ్మిని జీవనమ్ముఁ గన నెయ్యముఁ జూపద పత్నియంచునో
    క్రమ్మిన దైన్యమెంచకను గాంతను తెచ్చె వివాహమాడి రె
    డ్డమ్మకుఁ గూడ భార్య గల దామెను నేమని పిల్వఁగాఁ దగున్

    (రెడ్డమ్మ నాయుడమ్మ పాతకాలంలో అక్కడక్కడ ఉన్న పేర్లేనండి. ముఖ్యంగా గ్రామదేవతకు మొక్కు కున్న పిదప ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఆనవాయితి. నాయుడమ్మ అని ఒక శాస్త్రవేత్త ఉండేవారు. 1985 కనిష్క విమాన ప్రయాణంలో చనిపోయారు.)

    రిప్లయితొలగించండి
  10. అమ్మ యను పేరు చివరన యలరు చుండ
    నాయుధమ్మ యనెడి వాడు నాగమణి ని
    పెండ్లి యాదగ గాంచిన పిల్లలపుడు
    నమ్మ కు గలదు భార్య యేమని పిలుతురు?

    రిప్లయితొలగించండి