31, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5291

1-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ”
(లేదా...)
“నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో మాచవోలు శ్రీధరరవు గారి సమస్య)

8 కామెంట్‌లు:

  1. ఒక కవివరుని ఆవేదన:

    తేటగీతి
    తల్లి భారతి దయచేత నుల్లమలర
    పద్యమల్లెడు నైపుణి బడసినాడ
    మెచ్చెడు సభ నీర్ష్య పరుల విచ్చు కనుల
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాడ!

    ఉత్పలమాల
    తప్పులు దిద్దెడున్ గురువు దైవమువోలెను జిక్కినంతటన్
    నప్పెడు శైలి పద్యముల నల్వ సతీమణి దీవనంబనన్
    గుప్పెడు నైపుణిన్ బడయ, గుండెలమండెడు వారి కన్నులన్
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్!

    రిప్లయితొలగించండి
  2. చేత నయినట్లు పనులను జేయు చుండ
    నిచ్చెలము నిప్శులను బోలు నిందలిడగ
    విడక వాటి నెల్ల ననుభవించితి నన
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ”

    రిప్లయితొలగించండి

  3. ప్రేక్షకులు కని మెచ్చెడి విధము నేను
    కనుల విందుగ జేసితి గారడి నట
    యెలుకలను జూపి మార్చితి చిలుకలుగను
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ.


    కప్పము పొంది చూపితిని గారడి వాడను కాన వింతలన్
    కప్పల దెచ్చి మార్చితిని కంకర రాలుగా మంత్ర శక్తితో
    జెప్పుల జాగిలమ్ములుగ జేసితి ప్రేక్షకు లెల్ల మెచ్చగా
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్.

    రిప్లయితొలగించండి
  4. అప్పులను వచియింతురు నిప్పులంచు
    తప్పనరు గాదె చేయక తప్పనపుడు
    అప్పులను రూపుమాపెడు చట్టముండ
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ

    అప్పులు నిప్పులంచు పరిహాసపు మాటలు పల్కుటేలనో
    తప్పనలేరుగా జనులు తప్పకనప్పులఁ జేయు వారితోఁ
    నప్పులు తీర్చలేనపుడు హాయినిఁ గాచెడు చట్టముండగా
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. జప్పున నేర్చి మిక్కిలి పసందుగు గారడి విద్యలెన్నియో
      రప్పున రాళ్ళకుప్పలను రత్నపు రాసులొనర్చి చూపితిన్
      తిప్పలొకింతయున్ పడక తిమ్మిని బమ్మిగ మార్చివేసితిన్
      నిప్పులు జేత బట్టితిని నేర్పున మల్లెలు బంతి పూలగన్

      తొలగించండి
  6. దుష్ట సాంగత్యమును గూడి దురుసుతనఁపు
    చేష్టితము లనునిత్యము జేయుచున్న
    తమ్ముడొనరించు తప్పులఁ దాచియుంచి
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ

    రిప్లయితొలగించండి
  7. తప్పులమీద తప్పులను తమ్ముడు సేయుచునుండ వానికిన్
    జెప్పగ జూచినాడ చలచిత్తపు చేష్టలు మానుమంచు నే
    జెప్పిన మాటలన్ వినని శీనుని గాఁచుచు నిన్నినాళ్ళు నే
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్

    రిప్లయితొలగించండి