16, ఫిబ్రవరి 2026, సోమవారం

సమస్య - 5383

17-2-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు”
(లేదా...)
“దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ధరణి మానవ సేవ మాధవుని సేవ
    సతము త్రికరణ శుద్ధితో సాగుమనిరి
    లోకమున హానినెంచెడు పోకడఁగొని
    దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు

    ఉత్పలమాల
    సేవ పరోపకారములు సేయుటె మాధవసేవయంచనన్
    భావము భాష్య కర్మలను వర్తిల నొక్కటె రీతినిత్యమున్
    దైవమె కాచెడున్సతము ధన్యతనొంద, జగంపు హానికై
    దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్

    రిప్లయితొలగించండి
  2. తనకు సంపద కలిగించ, దాని యందు
    కొంత భాగము నీకిడు కొనెద ననుచు
    ముందుగనె బేరమాడిన మొక్కు తోడ
    దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు”

    రిప్లయితొలగించండి

  3. స్వంత లాభమ్ము నాశించి ప్రత్యగాత్మ
    గొలిచిన గొలువగను వచ్చు నిలను గాని
    పరుల నాశనమును గోరి నరుడు తాను
    దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు.


    దేవుడు శక్తివంతుడని దీనుల బ్రోచునటంచు నమ్ముచున్
    గోవెల కేగ మానవుడు కోర్కెల గోరుట కోసమంచు తా
    నీ వసుధాతలమ్మున సహేతుకమే, పర నాశనమ్ము కై
    దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  4. దైవము పయిఁ భారమునుంచి దాసులుండ
    క్షుద్ర పూజలు సల్పగ రుద్ర భూమిఁ
    జేరి మొదలుపెట్టిన కార్య సిద్ధికోరి
    దైవమును గొల్వరాదంద్రు ధర్మవిదులు

    దైవముపైన భారమిడి దాసులు పూజలనెన్ని జేసినన్
    జీవుల చావు కోరుకొని చీకటి మాటున రుద్రభూమికిన్
    బోవుచు క్షుద్ర శక్తులకు పూజలు సల్పుచు కార్యసిద్ధికై
    దైవముఁ గొల్వరాదనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్

    రిప్లయితొలగించండి