3, మే 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 1

రవీంద్రుని గీతాంజలి - 1
తెనుఁగు సేత
శ్రీ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

1

THOU hast made me endless, such is
thy pleasure. This frail vessel thou
emptiest again and again, and fillest it
ever with fresh life.

This little flute of a reed thou hast
carried over hills and dales, and hast
breathed through it melodies eternally
new.

At the immortal touch of thy hands
my little heart loses its limits in joy
and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only
on these very small hands of mine.
Ages pass, and still thou pourest, and
still there is room to fill.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

న న్ననంతుని గావించినాఁడ వీవ
నీ విలాసమె యిట్టిది దేవదేవ!
పగిలి పోయెడి దుర్బలపాత్ర మిద్ది
సారెసారెకు రిక్తము సలుపు చెపుడు
నీవె పూరించెదవు నవజీవనమున ||

నీవ యీ చిన్ని పిల్లనగ్రోవి గొంచు
గిరుల లోయల వెంబడి తిరిగె దోయి!
నీవె మ్రోయింతువు గదోయి నిత్యనూత్న
గానమధురస్వరమ్ముల దాని నూది ||

ప్రభువ! యుష్మత్కరామృత స్పర్శనమ్ము
గూర్చు నానందమున నాదు కొద్దిపాటి
మానసఁపుహద్దు లన్నియు మాసిపోయి
యొక యనిర్వాచ్యవాణి తా నుద్భవిల్లు ||

వచ్చు లెక్కకు మించి నీ యిచ్చుకాన్క
లందుఁ బిడికెడు పిడికెడె యౌను నావి,
యుగములు గతించు, నించుచునుందు వీవు,
వట్టిగది యచ్చటం గనుపట్టు నింక ||

శ్రీ శ్యామల రావు గారికి షష్ఠిపూర్తి శుభాశీస్సులు


శ్రీ శ్యామల రావు గారికి
నేడు షష్ఠిపూర్తి మహోత్సవము జరుగుతున్న సందర్భమున 
శుభాశీస్సులు

శ్రీరస్తు విశుద్ధ యశ
శ్శ్రీరస్తు చిరాయురస్తు శ్రీకంఠకృపా
సారశ్రీకలిత విశే
షారోగ్య ప్రాప్తిరస్తు శ్యామలరాయా!


ఆదిత్యాది గ్రహమ్ములన్నియును శ్రీరస్తంచు యోగోన్నతుల్
మోదంబొప్పగ గూర్చుగాక! కరుణాంభోరాశు లార్యాశివుల్
వేదస్తుత్యులు సర్వమంగళములన్ వేడ్కన్ ప్రసాదింప నా
హ్లాదంబొప్ప చిరాయురున్నతులతో రాజిల్లుమా మిత్రమా!


అతుల పుణ్యదంపతులయి యలరినట్టి
రంగమణికిని సత్యనారాయణునకు
పుత్రరత్నమవును  కులాంభోధి పూర్ణ
చంద్రుడవగు నీకు శుభాశిషములు గూర్తు


శారద చారుశీల విలసద్గుణ లక్షణరాశి రమ్య సం
సారమునందు పత్నిగ సమస్త సుఖమ్ములు గూర్చుచుండ వి
ద్యారతులైన బిడ్డలు నిరంతరమున్ ప్రమదమ్ము నింపగా
సూరి వరేణ్య!  పృథ్వి బహుశోభలు గాంచుము శ్యామలాహ్వయా!


అరువది వత్సరమ్ములు సమస్త శుభప్రద జీవితాన సం
బరమున సాగె నేర్చితివి బాగుగ విద్యలు యోగరాశులున్
కరము ముదాన పొందితివి ఖ్యాతి గడించితి వీశుసత్కృపన్
బరగుము దీర్ఘకాలమిల వంశవిభూషణమై శుభాశయా!


నేమాని రామజోగి సన్యాసి రావు
విశాఖపట్టణము

సమస్యాపూరణం - 693 (వారకాంతా విమోహమున్)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.

2, మే 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి


రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

    కీర్తిశేషులు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు (1924 - 1967) తమ కళ్యాణరాఘవము, మధురవేదన, స్తోత్రాంజలి రచనల ద్వారా రసికలోకానికి సుపరిచితులు. తేనె లూరించే తమ తేటతెలుగు కవిత్వంతో సహృదయులైన పాఠక హృదయాల్ని చూరగొన్న కవి.

    ఆచార్యులవారు స్వతస్సిద్ధంగా నిరాడంబరజీవి. ఉపనిషద్విజ్ఞానంతో పండిన వారి మేధస్సునకు వైష్ణవ సంప్రదాయసిద్ధమైన భక్తిమార్గం గురుదేవుని గీతాంజలివంటి తాత్త్వికమైన కావ్యాన్ని తెలుగు చేయడంలో వారికి అన్ని హంగులూ సమకూర్చింది. తత్ఫలితంగానే ఎంత సరళమో అంత మధురంగా ఈ కావ్యానువాదం సాగి ఈనాడు రసాస్వాదకులను రంజింపచేస్తున్నది.

    ఈ ఉత్తమరచనను బ్లాగులో ప్రకటించి మీకు కావ్యానందాన్ని కలిగించే కార్యంలో నిమిత్తమాత్రుడినయ్యే సదవకాశం లభించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.
    మొత్తం 103 గీతాలను రేపటినుండి రోజుకొకగీతం చొప్పున ప్రకటించబోతున్నాను.

కవిమిత్రులారా,

    గీతాంజలి ఆంగ్లానువాదాన్ని, దాని క్రింద ఆచార్యుల వారి ఆంధ్రానువాదాన్ని ప్రకటించమంటారా? లేక కేవలం తెలుగు అనువాదాన్ని మాత్రం ప్రకటిస్తే చాలంటారా? మీ సలహాలను ఆహ్వానిసున్నాను.

కళ్యాణ రాఘవము - 14

కళ్యాణ రాఘవము - 14 

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు



తే.గీ.
తరుణశశిరేఖ మెలమెల్లఁ జరమశిఖరి
దరి కరుగుజాడ లారసి మురువుదక్కి
చుక్క లంతంత మిలమిలఁ జూచిచూచి
వెలవెలంబాఱె నాకాశవీథులందు. (192)


తే.గీ.
జనకుఁడును స్నేహగద్గదస్వరనిరుద్ధ
గళము సవరించి, ధైర్యము నిలువరించి
యక్కునన్ వ్రాలు సీతాలతాంగి చుబుక
మెత్తి, మెత్తని పలుకుల నిట్టు లనియె. (193)


సీ.
"అత్తమామలను మీ యమ్మను ననువోలెఁ
        
        గని ప్రీతిసేయుమా కన్నతల్లి!
ప్రాణేశుఁ డెపుడేని పరుసముల్ పల్కిన
        నడ్డాడవలదు సుమా కుమారి!
కష్టసుఖమ్ము లొక్కటిగ నెంచి విభుని
        కర్తవ్యమునఁ దోడుగమ్ము బిడ్డ!
మగనికంటెను దయామయి జానకమ్మ యన్
        పేరందికొనుము బంగారుకూన!
తే.గీ.
భావికులసతు లెల్ల నీ జీవితంపు
టద్దమున నిండుచెలువముల్ దిద్దుకొనఁగ
వసుధఁ బతిదేవతామహత్త్వశిఖరమున
దివ్వటీ యెత్తనిమ్ము నీ దివ్యకీర్తి. (194)

తే.గీ.
విభునకుం బ్రీతిపాత్రవై విమలకీర్తి
నుభయకులముల వెన్నెల లొలుకనిమ్ము
ఆడుబిడ్డల తలిదండ్రు లాత్మలందుఁ
గోరు చిరవాంఛ యిదియ చిన్నారితల్లి!" (195)


తే.గీ.
అనుచు సీతమ్మ మున్నుగా ననుఁగుసుతలఁ
బయన మొనరించునంత సంభ్రాంతమగుచుఁ
గడుపుచుమ్మలు చుట్టెడి కన్నతల్లి
హృదయమై పురమెల్లఁ గ్రక్కదలె నపుడు. (196)


తే.గీ.
కనుమసక బాపి, తన దివ్యకాంతి మంజు
రాగరంజితమై దిశాప్రాంగణములు
ప్రాఁక, నరుణోదయంబైన పగిది గాధి
పట్టి కన్పట్టి రాముతోఁ బలికె నిట్లు. (197)


శా.
నీ కల్యాణము నెంచుకొంటిని సుమా నిండారు వేడ్కం ద్రిలో
కీకల్యాణ మిదే యఁటంచు, నిఁక లక్ష్మీలక్షితోరస్కుఁడౌ
వైకుంఠుంబలె సీతతో మెఱసి, చేవం దీనరక్షావిధి
శ్రీకిం బట్టముకట్టికోఁ గదవె! తండ్రీ! రామచంద్రప్రభూ! (198)


తే.గీ.
కంకణము దాల్చి ధర్మరక్షకుఁ గడంగ
మఱచి, సుడిగొని యర్థకామముల మున్గు
దంపతుల్ లేరె యంకెలు దాఁటిపోవ
ఫల మదేమి? నేల కొకింత బరువు దప్ప. (199)


తే.గీ.
అమలధర్మాధ్వమున గృహస్థాశ్రమ మొక
రమ్యవనవాటి, యెట్టివారలకు నట్టి
సేవగావించి సంతృప్తి జేసినపుడె
సఫలమై యది మిన్నంటఁ జాలునోయి! (200)


ఉ.
నిక్కము నీయెఱుంగనిది నేఁ దెలుపంగల దేమి కల్గు? నీ
రెక్కలనీడఁ జల్లఁగఁ జరించు చమాయకు లెట్టి బాములం
జిక్కమి జూచి తృప్తిపడఁ జిత్తము తత్తరమందునోయి! నా
చక్కనితండ్రి! భాగ్యమున సత్వర మద్ది ఫలించుఁ గావుతన్. (201)


ఉ.
ఆశ్రితరక్షణంబులె మహాద్భుతనిత్యనవీనగాథలై
విశ్రుతి కెక్కి, విశ్వజనహృత్పుటముద్రితకావ్యరాశిగా
నశ్రమనిర్జితారివయి యచ్చపుఁ గీర్తికిఁ బూర్తివై దయా
విశ్రమసీమవై మనుము వేలశరత్తులు జానకీపతీ! (202)


తే.గీ.
వత్స! రాఘవ! నేఁ బోయివత్తునోయి!
మఱవకుము మానుడుల్, మమ్ము మఱవకు" మని
శిరసు మూర్కొని కౌఁగిలించి యిసుమంత
మగిడి, ప్రణతయౌ సీతాకుమారిఁ గాంచి. (203)


తే.గీ.
అవనిజా! వీరపత్నీత్వ మధిగమించి
కర్కశములగు సంసారకంటకముల
నుద్ధరించి త్రిభువనీప్రసిద్ధి గాంచి
కమ్ము నెలఁతల తలమానికమ్ము నీవు." (204)


కం.
అని సీతారాముల చ
క్కని మూర్తులఁ బ్రేమలూరు కన్నులనిండం
గనుఁగొని కనుఁగొని నిర్మల
మజోబ్జమున నిల్పికొని సమాహితుఁ డగుచున్. (205)


కం.
"మునివర! తలఁ దాల్పంబడె
ననఘము నీశాసనం" బఁటంచు శిరమువం
చిన రామాదుల నెల్లం
జనవున దీవించి మరలి, "చల్లని వేళన్- (206)


తే.గీ.
కనులలోఁ బెట్టి యిన్నాళ్లు గాచి యిదిగొ
నీ సుతుల నీకు నప్పగించితి" నటంచు
దశరథుని మ్రొక్కు లంది, యందఱకుఁ జెప్పి
మఱపురానట్టి చుట్టమై యరిగె మౌని. (207)


తే.గీ.
ప్రకృతిగంభీరుఁడైన శ్రీరాము మోము
క్షణము బాష్పపర్యాకులేక్షణము నయ్యె
మేనితో నచ్చటనె నిల్చెఁ గాని యతఁడు
మానసముతోడఁ బరువెత్తె మౌనివెంట. (208)


ఆ.వె.
పురము మోదఖేదముల సమత్వము గాంచె
అల్ల వధువు లెక్కి రందలముల
ననుపువారి కనుల, నామంత్రణము సేయు
వారి కనుల బాష్పవారి గ్రమ్మె. (209)


తే.గీ.
తిమిర మెడలించి నవశోభ దెసల నించి
పొడుపుమలపయి భాలభానుఁడును నిల్చె
నడలు మఱపించి మోద మెల్లెడల నించి
రథముపైఁ బొల్చెఁ గళ్యాణ రాఘవుఁడును. (210)


కం.
ఆ విభుఁడ వీవ, వినునది
యీవ, దయాశ్రీవిలాస మెసఁగ దొసఁగులం
బోవిడి సమాదరింపుము
నా వేలుప! సీత లేఁత నవ్వులలోనన్. (211)



                         --* సమాప్తము *--

పద్య రచన - 14


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

సమస్యాపూరణం - 692 (బుద్ధిహీనులు మ్రొక్కిరి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.

1, మే 2012, మంగళవారం

చమత్కార (చాటు) పద్యాలు - 194

శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్రము 
(ఈ స్తోత్రాన్ని భారతుల పేరయ్య శాస్త్రి రచించాడు. ఈయనకు శ్రీరంగకవి అని నామాంతరం. కర్నూలు మండలం అన్నసముద్ర గ్రామవాసి. కాలం పందొమ్మిదవ శతాబ్దం)


                                   చూర్ణిక
    శ్రీమ త్కదంబతరు విడంబిత లస దంబురుహచర ద్వలమాన మానసౌక గరుత్పవమాన ప్లవమాన భాసమాన కంకేళీవన కేళీ సంజాత శ్రమబిందు కందళిత ముఖారవిందే! సంతతానందే! సర్వ సర్వంసహాఖర్వ ధూర్వహ దర్వీకర గర్వ నిర్వాపణ చణ దోర్వల్లీ సమారోపిత మౌర్వీ నిర్భర నిర్ఘోష నిర్భిద్యమాన పుర్వామర గుర్విణ్యుదర దరీ కుడుంగే! శౌర్యానుషంగే! శుంభ దంభా మఖారంభ సమయ సముజ్జృంభిత దిక్కుంభి ప్రకటకట స్రవద్దానాసవ పానోదిత గానాధిక నానా మధుపానీకకులీనాంచిత వినీల పతత్రప్రభా భాసమానాసమానాలకాభిరామే! మరకతశ్యామే! రంగదభంగ రణరంగ కళాభిషంగ చండముండాసురప్రకాండ ఖండ నోద్దం డాఖండల వేదండ తుండాయమాన భుజాదండ మండిత మండలాగ్ర రోచిః ప్రకీర్ణ బ్రహ్మాండ కరండే! చాముండే! యుగవిగమావసర సముద్భూత ప్రవాత సంఘాత జీమూత మధ్య ధగద్ధగాయమాన సౌదామినీ ద్యుతి వినిర్మితి కోమల సంహనన విశేషే! అపహృత దోషే! అసమసమయ వికసిత కుసుమ కిసలయ మసృణ ఘుసృణ విసరణ చరణాలంకరణ నిపుణ నూపుర కుహురావ లయ యుత కలకంఠ కంఠ కలరవానుకూల పంచమస్వర గ్రామానుకరణ విపంచికా వల్లరీ నినాదామోదిత సకల దిశావకాశే! సుప్రకాశే! తారాకర తారాధిప తారాద్రి సమీరాశన క్షీరాబ్ధి పటీరాంబుజ హీరాబ్జ సుధాధారా నిభ గౌరద్యుతి విద్యోతమాన యశోవిశాలే! శ్రీబాలే! చిదగ్ని కుండికార్ణవ సంజాత భువనమోహినీ గేహినీ సమస్త కుళ కౌళీ నిగర్భ రహస్యాతి రహస్య పరాపర రహస్య యోగినీ శ్రీమ త్కౌమార గిరీంద్ర సౌవర్ణ ప్రాకార మధ్య విటంక విన్యస్త నిస్తుల ప్రశస్త మణిగణ వ్యాకీర్ణ మండపాభ్యంతర వితర్దికారంగ వలభికాయంత్ర పాంచాలికాయమాన ప్రమథగణ సేవిత శ్రీ త్రిపురాంతకేశ్వరోత్సంగ నివాసే! విశదహాసే! సకల సుకవి వర్ణిత మృదుమధుర కవితా రచనాధురీణ భారతులాన్వయాంభోధి తుహినకర రంగయాభిధా నాంగ నాదెమాంబికా గర్భశుక్తి మౌక్తికాయమాన శ్రీరంగకవి విరచిత గద్యపద్యానుమోద మానసాంభోజే! నత సురసమాజే! శ్రీ త్రిపురాంబికాభిధే యావతీర్ణ జగదంబే! అధరజితబింబే! పులిన నితంబే! శ్రీశ్రీ త్రిపురాంబే! సదామాం పాహి, మాం పాహి.
 
                              (శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)

పద్య రచన - 13


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

సమస్యాపూరణం - 691 (జారగుణంబు గల్గు సతి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

జారగుణంబు గల్గు సతి సాధ్వి యటంచు నుతించి రెల్లరున్.