2, మే 2012, బుధవారం

కళ్యాణ రాఘవము - 14

కళ్యాణ రాఘవము - 14 

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులుతే.గీ.
తరుణశశిరేఖ మెలమెల్లఁ జరమశిఖరి
దరి కరుగుజాడ లారసి మురువుదక్కి
చుక్క లంతంత మిలమిలఁ జూచిచూచి
వెలవెలంబాఱె నాకాశవీథులందు. (192)


తే.గీ.
జనకుఁడును స్నేహగద్గదస్వరనిరుద్ధ
గళము సవరించి, ధైర్యము నిలువరించి
యక్కునన్ వ్రాలు సీతాలతాంగి చుబుక
మెత్తి, మెత్తని పలుకుల నిట్టు లనియె. (193)


సీ.
"అత్తమామలను మీ యమ్మను ననువోలెఁ
        
        గని ప్రీతిసేయుమా కన్నతల్లి!
ప్రాణేశుఁ డెపుడేని పరుసముల్ పల్కిన
        నడ్డాడవలదు సుమా కుమారి!
కష్టసుఖమ్ము లొక్కటిగ నెంచి విభుని
        కర్తవ్యమునఁ దోడుగమ్ము బిడ్డ!
మగనికంటెను దయామయి జానకమ్మ యన్
        పేరందికొనుము బంగారుకూన!
తే.గీ.
భావికులసతు లెల్ల నీ జీవితంపు
టద్దమున నిండుచెలువముల్ దిద్దుకొనఁగ
వసుధఁ బతిదేవతామహత్త్వశిఖరమున
దివ్వటీ యెత్తనిమ్ము నీ దివ్యకీర్తి. (194)

తే.గీ.
విభునకుం బ్రీతిపాత్రవై విమలకీర్తి
నుభయకులముల వెన్నెల లొలుకనిమ్ము
ఆడుబిడ్డల తలిదండ్రు లాత్మలందుఁ
గోరు చిరవాంఛ యిదియ చిన్నారితల్లి!" (195)


తే.గీ.
అనుచు సీతమ్మ మున్నుగా ననుఁగుసుతలఁ
బయన మొనరించునంత సంభ్రాంతమగుచుఁ
గడుపుచుమ్మలు చుట్టెడి కన్నతల్లి
హృదయమై పురమెల్లఁ గ్రక్కదలె నపుడు. (196)


తే.గీ.
కనుమసక బాపి, తన దివ్యకాంతి మంజు
రాగరంజితమై దిశాప్రాంగణములు
ప్రాఁక, నరుణోదయంబైన పగిది గాధి
పట్టి కన్పట్టి రాముతోఁ బలికె నిట్లు. (197)


శా.
నీ కల్యాణము నెంచుకొంటిని సుమా నిండారు వేడ్కం ద్రిలో
కీకల్యాణ మిదే యఁటంచు, నిఁక లక్ష్మీలక్షితోరస్కుఁడౌ
వైకుంఠుంబలె సీతతో మెఱసి, చేవం దీనరక్షావిధి
శ్రీకిం బట్టముకట్టికోఁ గదవె! తండ్రీ! రామచంద్రప్రభూ! (198)


తే.గీ.
కంకణము దాల్చి ధర్మరక్షకుఁ గడంగ
మఱచి, సుడిగొని యర్థకామముల మున్గు
దంపతుల్ లేరె యంకెలు దాఁటిపోవ
ఫల మదేమి? నేల కొకింత బరువు దప్ప. (199)


తే.గీ.
అమలధర్మాధ్వమున గృహస్థాశ్రమ మొక
రమ్యవనవాటి, యెట్టివారలకు నట్టి
సేవగావించి సంతృప్తి జేసినపుడె
సఫలమై యది మిన్నంటఁ జాలునోయి! (200)


ఉ.
నిక్కము నీయెఱుంగనిది నేఁ దెలుపంగల దేమి కల్గు? నీ
రెక్కలనీడఁ జల్లఁగఁ జరించు చమాయకు లెట్టి బాములం
జిక్కమి జూచి తృప్తిపడఁ జిత్తము తత్తరమందునోయి! నా
చక్కనితండ్రి! భాగ్యమున సత్వర మద్ది ఫలించుఁ గావుతన్. (201)


ఉ.
ఆశ్రితరక్షణంబులె మహాద్భుతనిత్యనవీనగాథలై
విశ్రుతి కెక్కి, విశ్వజనహృత్పుటముద్రితకావ్యరాశిగా
నశ్రమనిర్జితారివయి యచ్చపుఁ గీర్తికిఁ బూర్తివై దయా
విశ్రమసీమవై మనుము వేలశరత్తులు జానకీపతీ! (202)


తే.గీ.
వత్స! రాఘవ! నేఁ బోయివత్తునోయి!
మఱవకుము మానుడుల్, మమ్ము మఱవకు" మని
శిరసు మూర్కొని కౌఁగిలించి యిసుమంత
మగిడి, ప్రణతయౌ సీతాకుమారిఁ గాంచి. (203)


తే.గీ.
అవనిజా! వీరపత్నీత్వ మధిగమించి
కర్కశములగు సంసారకంటకముల
నుద్ధరించి త్రిభువనీప్రసిద్ధి గాంచి
కమ్ము నెలఁతల తలమానికమ్ము నీవు." (204)


కం.
అని సీతారాముల చ
క్కని మూర్తులఁ బ్రేమలూరు కన్నులనిండం
గనుఁగొని కనుఁగొని నిర్మల
మజోబ్జమున నిల్పికొని సమాహితుఁ డగుచున్. (205)


కం.
"మునివర! తలఁ దాల్పంబడె
ననఘము నీశాసనం" బఁటంచు శిరమువం
చిన రామాదుల నెల్లం
జనవున దీవించి మరలి, "చల్లని వేళన్- (206)


తే.గీ.
కనులలోఁ బెట్టి యిన్నాళ్లు గాచి యిదిగొ
నీ సుతుల నీకు నప్పగించితి" నటంచు
దశరథుని మ్రొక్కు లంది, యందఱకుఁ జెప్పి
మఱపురానట్టి చుట్టమై యరిగె మౌని. (207)


తే.గీ.
ప్రకృతిగంభీరుఁడైన శ్రీరాము మోము
క్షణము బాష్పపర్యాకులేక్షణము నయ్యె
మేనితో నచ్చటనె నిల్చెఁ గాని యతఁడు
మానసముతోడఁ బరువెత్తె మౌనివెంట. (208)


ఆ.వె.
పురము మోదఖేదముల సమత్వము గాంచె
అల్ల వధువు లెక్కి రందలముల
ననుపువారి కనుల, నామంత్రణము సేయు
వారి కనుల బాష్పవారి గ్రమ్మె. (209)


తే.గీ.
తిమిర మెడలించి నవశోభ దెసల నించి
పొడుపుమలపయి భాలభానుఁడును నిల్చె
నడలు మఱపించి మోద మెల్లెడల నించి
రథముపైఁ బొల్చెఁ గళ్యాణ రాఘవుఁడును. (210)


కం.
ఆ విభుఁడ వీవ, వినునది
యీవ, దయాశ్రీవిలాస మెసఁగ దొసఁగులం
బోవిడి సమాదరింపుము
నా వేలుప! సీత లేఁత నవ్వులలోనన్. (211)                         --* సమాప్తము *--

6 కామెంట్‌లు:

 1. నా వద్ద ఉన్న ‘కళ్యాణరాఘవము’ పుస్తకం చివరి పుట తప్పిపోవడం వలన ఇన్ని రోజులు చివరిభాగాన్ని ప్రకటింపలేక పోయాను. నిన్ననే ఆచార్యులవారి బావమరది శ్రీ ముడుంబై వరదాచార్యులను కలిసి వారి వద్ద ఉన్న పుస్తకంలోని చివరి పద్యాలను వ్రాసుకొనివచ్చి ఈరోజు ప్రకటించాను. వరదాచార్యులకు నా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 2. గురువుగారూ కల్యాణరాఘవం అచ్చుప్రతి ప్రాప్తి స్థానాన్ని తెలియజేస్తారా.

  రిప్లయితొలగించండి
 3. మిస్సన్న గారూ,
  ఆ పుస్తకం అచ్చుప్రతి ఇప్పుడు దొరకదు. దానిని పిడియఫ్ ఫార్మేట్‌లో ప్రకటించాలని ఉంది. ఆ ప్రయతంలో ఉన్నాను.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారూ కల్యాణరాఘవం అచ్చుప్రతి లభ్యం కాకపోవడం శోచనీయం.
  అందమైన కవిత్వంతో అలరారిన అద్భుతమైన కావ్యం ఈ తరం వారికి లేకపోవడం దురదృష్టకరం. ఒక్క పుస్తకం ఉన్నా వదాన్యుల సహకారంతో పునర్ముద్రించే ప్రయత్నం చేస్తే మంచిదని నా అభిప్రాయం.

  కల్యాణము రామునకగు
  కల్యాణము జగతి కెల్ల! కమనీయంబౌ
  కల్యాణ రాఘవంబగు
  కల్యాణము పాఠకులకు కలుముల నొసగున్.

  రిప్లయితొలగించండి
 5. మిస్సన్న గారూ,
  కళ్యాణ రాఘవము ప్రతులు నా వద్ద రెండు ఉన్నాయి. అయితే రెండింటా చివరి పేజీ తప్పిపోయింది. ఆ పేజీలో తప్పిపోయిన రెండుపద్యాలను వ్రాసి ఒక ప్రతి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను. మీ చిరునామా నా మెయిల్్‌కు పంపండి.
  shankarkandi@gmail.com

  రిప్లయితొలగించండి