2, మే 2012, బుధవారం

పద్య రచన - 14


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. కందుకూరి వారు కల్యాణ వీణల
    మ్రోయ జేసినారు ముదము మీర
    విధిని కొట్ట బడ్డ విధవాడ పడుచుల
    బ్రతుకు లందు నాడు పట్టు బట్టి.

    సంఘ సంస్కరణల సారథియై నిల్చి
    బెదరి పోక నిలచి ముదిమి నైన
    తాను నమ్మి నట్టి దారిని సాగిన
    ధైర్య శాలి వారు ధన్య జీవి.

    రిప్లయితొలగించండి
  2. "శ్రీ కందుకూరి వీరేశలింగము"
    "నామాక్షర పద్యమాలిక"

    శ్రీకరుడై సంఘంబున
    మూకలుగా నిండియున్న మూఢాచారా
    లేకాగ్ర చిత్తధరుడయి
    పోకార్చిన ఘనుడు తాను పుణ్యాత్ముడికన్.

    కంటకతుల్యములై పలు
    తంటాలను తెచ్చుచుండి ధరణీతలమం
    దంటిన బాల్యవివాహా
    లింటింటికి చేయు కీడు నీతడు తెల్పెన్(మాన్పెన్).

    దురితంబుల నెల్లెడలం
    బరిహారము చేయుచుండి పడతుల కిలలో
    సురుచిర జీవనమునకై
    నిరతము శ్రమియించినట్టి నిర్మలుడతడున్.

    కూరిమి తనువున నిండిన
    ధీరుడు వీరేశలింగధీశాలి యికన్
    కారణజన్ముం డాతడు
    వేరెవ్వరు సాటిలేరు విశ్వమునందున్.

    వీరను వారను భేదం
    బారయు నజ్ఞానిజనుల కనవరతంబున్
    కోరుచు నుద్బోధించెను
    మీరిట్టులు చేయదగదు మీరకుడనుచున్.

    రేయింబవలును నిత్యం
    బాలోచన చేసి స్త్రీల కద్భుతరీతిన్
    మేలొనరించెడి విద్యా
    శాలలు స్థాపింప జేయు సజ్జనుడతడున్.

    శతవిధముల యత్నించిన
    గతిలేని వితంతులైన కర్మఠులకిలన్
    హితకారిణి యను సంస్థను
    వెతలం ద్రుంచంగ నిల్పు విజ్ఞు డతండే.

    లింగాకారుని దలచిన
    కంగారై తొలగిపోవు కల్మషమట్లున్
    వంగడములు సుఖదములౌ
    నంగీకృతులౌచు వీరి యనుసరణమునన్.

    గద్యంబున తిక్కనయై
    పద్యంబున ప్రోడ యగుచు బహుకావ్యంబుల్
    హృద్యంబుగ రచియించిన
    విద్యావంతునకు జేతు వినయాంజలులన్.

    మునులను మించినవాడత
    డనవరతము సంఘసేవ కంకితమగుచున్
    తనువుకు ధన్యత గూర్చిన
    ఘనచరితుడు కందుకూరి కవిసత్తముడున్.

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా!
    ఐదవ పద్యం మొదటిపాదాన్ని "రేయింబవలనునిత్యం" గా చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా!
    మన్నించాలి.
    పొరపాటును సరిచేసే యత్నంలో మళ్ళా పొరపాటే జరిగింది.
    "రేలుంబవలనునిత్యం" గా చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________


    బాల విధవలు పుణ్యులౌ - బాట జూపి
    విద్య స్త్రీలదె పొందగా - నుద్యమించి
    మూఢ నమ్మకముల తును - మాడి నిలచి
    కందుకూరి యార్జించె , లో - కైక ఖ్యాతి !

    ___________________________________

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    కందుకూరి ధన్యజీవి అంటున్న మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ నామాక్షర పద్యమాలిక అద్భుతంగా ఉంది. అభినందనలు.
    ‘ఆంధ్రకేసరి’ చిత్రంలో నాకెంతో ఇష్టమైన పాట ‘వేదంలా ఘోషించే గోదావరి...’ లోని
    ‘కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు
    వీరేశలింగ మొకడు మిగిలెను చాలు’ గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘విద్య స్త్రీలదె పొందగా’ను ‘విద్య నతివలు పొందగా’ అంటే బాగుంటుందేమో?
    ‘లోకైక ఖ్యాతి’ అన్నప్పుడు ‘క’ గురువై గణదోషం. ’లోకైక యశము’ అందామా?

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  8. అందిన దాంపత్యమ్మే
    అందని పండైన వేళ నతివల మోమున్
    చిందగ వీరేశంబే
    అందముగా మరల బొట్టు నందగజేసెన్.

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మూర్తి గారూ అద్భుమైన మాలిక. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. సుమతిన్ ధీరుడు కందుకూరి మతి సంక్షోభింప నాడీ సమా
    జములో స్త్రీలకు గల్గు దుస్థితుల గాంచన్ చాల యోచించె వే
    గమె పూనెన్ ధృఢ దీక్ష కార్యరతుడై కావించె సత్కార్యముల్
    సమతే ధ్యేయముగా జనోద్ధరణకై స్థాపించె సంఘమ్ములన్

    అతివలునేని సంఘమున నాదృతి పొందవలెన్ స్వతంత్ర జీ
    వితమును పూనుకోవలెను పెండిలి యాడగవచ్చు నాథుడున్
    క్షితి మృతి నొందెనేనియును చెన్నగు విద్యల నేర్వగాదగున్
    ధృతి నొనరింపవచ్చు పలురీతుల వృత్తులటంచు చాటుచున్

    వీరేశలింగ మావిధి
    నారీసంఘమును బ్రోవ నడుము బిగించెన్
    పూరించెను శంఖమ్మును
    సారోదారమతి జేసె సంస్కరణములన్

    జేజే దీనొద్ధారా!
    జేజే కరుణాంతరంగ! శిష్టాచారా!
    జేజే శుభ సంస్కారా!
    జేజే వేఏరేశలింగ! చిన్మయ దీపా!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! కొన్ని టైపు తప్పులు దొరలుటచేత ఈ క్రింది పద్యమును మళ్ళీ వ్రాయుచున్నాను:

    జేజే దీనోద్ధారా!
    జేజే కరుణాంతరంగ! శిష్టాచారా!
    జేజే శుభ సంస్కారా!
    జేజే వీరేశలింగ! చిన్మయ దీపా!

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    పంతులు గారిని స్తుతిస్తు మీరు వ్రాసిన ఖండకృతి అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి