12, జూన్ 2024, బుధవారం

సమస్య - 4789

13-6-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్”
(లేదా...)
“జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై”

17 కామెంట్‌లు:

  1. కందం
    చేతల స్పర్ధను జూపియు
    యాతనల ధనము గడించి యలసిన వృద్ధుల్
    రీతిగ సమాజ సేవల
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్!

    ఉత్పలమాల
    చేతల స్పర్ధతోఁ గొలువు సేసియు విత్తపు టార్జనన్ దగన్
    యాతనలందు జిక్కి ధనమందుచు చాలిన యంత వృద్ధులై
    రీతిగ సంఘసేవలను బ్రీతిని బొంది పరోపకారులై
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై!

    రిప్లయితొలగించండి
  2. చేతనునకెడరు కలుగగ
    నాతరుణమునందు వాని నాదుకొనవలెన్
    యాతన పొగొట్టుటకై
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్

    రిప్లయితొలగించండి

  3. ఖ్యాతిగడించిన రాముని
    ప్రీతిని సేవించినట్టి భీమబలుండౌ
    వాతాత్మజుంగనంగను
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్.


    సీతను వీడి బెగ్గడిలు శ్రీరఘురాముని బాధ తీర్చగా
    వాతసుతుండు భారమను భావన సేయక లంక కేగగన్
    వేతన మెంత పొందె? మురిపెమ్మును జూపుచు ఖ్యాతి పొందెగా
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై.

    రిప్లయితొలగించండి
  4. కం॥ నీతిని విడిచిన కొందరు
    నేతలు ఘన రాజకీయ నియమమటంచున్
    బ్రీతిగ దోఁచరె ధనమును
    జీతము లేనట్టి కొలువె శ్రేంష్ఠంబుర్విన్

    ఉ॥ నీతిని వీడి వర్తిలుచు నేమముఁ దప్పుచు స్వార్థబుద్ధితో
    నేతలు రాజకీయమున నిత్యము కొందరు విత్తలాలసన్
    బ్రీతిగ దోఁచ సంపదలు భీతినిఁ గానకఁ దోఁచెనిట్టులన్
    జీతము లేనికొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  5. నాతులు పెళ్ళి చేసుకొని న్యాయము
    గా తన గేహమందునన్
    రీతిని తప్పకన్ బనులు రేబవలున్
    నొనరింత్రు నిత్యమున్
    చేతనమొప్ప జేయుదురు జీతము
    నడ్గరు నిక్కమే గదా
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము
    సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  6. సీతాపతి భృత్యుండై
    సీతాన్వేషణ పనిగొని చిందులు వేసెన్
    ఖ్యాతిని పొందిన మారుతి
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్

    సీతను రామభూవరుని చెంతకు చేర్చిన కష్టజీవిగా
    ఖ్యాతిని పొందినాడతడు యాతన లన్నియు లెక్కసేయకే!
    ఆతడు వాయునందనుడు హాయిని దూకొనె రామభృత్యుడై
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  7. ప్రీతిగ సేవ లొనర్చు చు
    నే తరుణము నందు నైన నింపగు రీతి న్
    చేతను డై సాయ ప డె డు
    జీతము లేనట్టి కొలువె శ్రే ష్ఠ o బుర్విన్

    రిప్లయితొలగించండి
  8. నేతలు చేసెడి సేవకు
    జీతము నాశించరెపుఁడు చిత్తమునందున్
    భ్రాతిగ ప్రజ శ్రేయముకై
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్

    రిప్లయితొలగించండి
  9. నేత యనంగ నెన్నడును నీమముతో దనవారి శ్రేయమం
    దాతురపాటు నొంది సముదంచితమౌవిధి వారి సేవలన్
    నీతముగానొనర్చు నవనీత మనస్కుడు నట్టి నేతకున్
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  10. ఏ తఱి లాభమ్ములు సం
    జాతమ్ములు గా భృశము నిజవ్యాపారం
    బాతతముగ వర్ధిల్లఁగ
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్


    రోత యొసంగ నట్టి పని క్రూరుఁడు గాని విభుండు మెండుగా
    వేతన మున్న మేలగును వృద్ధి నొసంగ నిరంతరమ్మునుం
    గోతల తోడ వేడ్కలకుఁ గూఁటికి గుడ్డకుఁ జాల నట్టిదౌ
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  11. కం:నీ తోడే నా స్వర్గము,
    నీ తలపే నాకు ముక్తి,నీ దాసుడ నా
    వ్రాత యె నీది ప్రియా! యీ
    జీతము లేనట్టి కొలువె శ్రేష్ఠం బుర్విన్”
    (అని ప్రియుడు ప్రియురాలి తో అంటున్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:నూతన మార్గ మెక్కువని ,న్యూనత నొంది గృహస్థ రీతి లో,
    జీతమె జీవితమ్మనుచు, చేర దలంచకు మెట్టి కొల్వునన్
    జీతము భర్త తెచ్చు కద!సేమము బిడ్డల కీయ జాలు, నీ
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై”
    (ఏదో ఒక ఉద్యోగం లో చేరాలి అనుకునే గృహిణికి నాబోటి వా డిచ్చే సలహా!)

    రిప్లయితొలగించండి
  13. ఉ:జీతము తక్కువౌనని వచించుచు నీ కరిణీకమున్ విడన్
    జూతువు గాని యే పదవి శోభనొసంగును దీని కంటె,నీ
    ఖ్యాతిని బెంచు,తక్కువయె ఆస్తియు నీకును? నిట్టి హెచ్చుదౌ
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై
    (కరిణీకాలకి జీతాలు చాలా తక్కువ.కానీ కొందరు ఆస్తిపరులు కేవలం ఆ హోదా కోసం వదులుకో లేక పోవటం, వదలవద్దని పిల్లలకి చెప్పటం జరిగింది. )

    రిప్లయితొలగించండి
  14. జీతము బత్తెముం గొనక జీవితమంతయు భర్తసేవలో
    చేతమునందు నెన్నడును చింతను బొందని ధర్మపత్నికిన్
    జీతము జీవితాంతమును శ్రేయము గూర్చెడు భర్త ప్రేమయే
    జీతము లేని కొల్వు గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై

    రిప్లయితొలగించండి
  15. మరొక పూరణ అండి

    ఉ॥ జీతము లేని కొల్వునిడి సేవలఁ జేయఁగఁ బేదవారికిన్
    జేతనమై సమాజమును శ్రేయముఁ గాంచుచు భాసిలున్ గనన్
    వేతన నష్టమొందఁగను వేరొక జీవి యెటుల్ నిజమ్మగున్
    “జీతము లేని కొల్వుఁ గన శ్రేష్ఠము సౌఖ్యదమౌను భూమిపై”

    2019లో 4 మాసాలపాటు నేనొక విద్యాలయంలో జీతము తీసుకోక పనిచేసినపుడు (వసతి భోజన సదుపాయాలిచ్చారండి) ఒకరిద్దరు పై విధంగా ప్రశ్నించారండి. మీరు పనిచేయడము వలన ఒక నిరుద్యోగికి ఉద్యోగావకాశ హరణ జరిగింది కదా అని. అటు పిమ్మట మానేశాను.

    రిప్లయితొలగించండి