15, జూన్ 2024, శనివారం

సమస్య - 4792

16-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”
(లేదా...)
“అసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో”

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    బంటన నడుచు వెంట 'రాబర్టు కుక్కు'
    పిలుచు 'కుక్క' గ యజమాని, పలుకు బంటు!
    భావి సూచన విన్నట్టి ప్రభువు సెప్పె,
    "కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క! గొడుగు"

    చంపకమాల
    మసలును 'జేమ్సు కుక్కు' యజమానికి బంటుగ మేటి నమ్రతన్
    విసుగది చూపకే సతము వెంట పరిభ్రమణమ్ము సల్పెడున్
    దిసలను వానరాకడకుఁ దెల్పగ సూచన పల్కె శంకతో,
    "నసదృశరీతిఁ గుక్క! గొడు కక్కరవచ్చును కుంభవృష్టిలో!"


    ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

    రిప్లయితొలగించండి

  2. కడు సమర్థుడు సారథిగాను లేక
    విగ్రహమున కేగుటెటుల పేడి సూతు
    డైన నేమిచేతు నికను కానగ నిక
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు.


    పసగల వాడు సారథిగ వచ్చిన మేలగు భండనమ్ములో
    యసహనులన్ వధించి విజయమ్మును పొందగ వచ్చు పేడి పు
    ల్కసుడగు వాడు సూతుడయె కాదన లేనిక నేమిచేతురా
    అసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో.

    రిప్లయితొలగించండి
  3. ముసిరెనుమబ్బురాముహృదిమోయగసీతవియోగబాధనే
    పసజెడివానరంబులనుభావనఁజేసెగమిత్రులంచునున్
    విశదమునయ్యెకార్యమునువేగమరావణుసంహరించెగా
    అసదృశరీతికుక్కగొడుగక్కరవచ్చునుకుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  4. విపణికేగ లేకుంటిని విస్తృతమగు
    కుంభవృష్టిలోఁ ; గావలెఁ గుక్కగొడుగు
    కూర చేసుకొని తినుచు కుక్షినింప ,
    పెరటిలోనికి గమనించి వెదుక , దొరికె

    రిప్లయితొలగించండి
  5. గట్టికార్యంబుతలపెట్టికావుమనుచు
    కాళ్లుపట్టెనుగాడిదకంసుబావ
    తప్పదీతఱితనదైనతాల్మిఁజూప
    కుంభవృష్టిలోగావలెకుక్కగొడుగు

    రిప్లయితొలగించండి
  6. నేల కొరిగెను పంటలు నిక్క ముగను
    కుంభ వృష్టికి :: గావలె కుక్క గొడుగు
    కూర వండగ నని గోరి కువ ల యాక్షి
    మగని గాంచియు దెమ్మ నె మక్కువ గను

    రిప్లయితొలగించండి
  7. తే॥ తలవని తలంపుగా వాన తారస పడి
    ఘనము కాఁగ తడవకను గదులటకటు
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు
    పేరున లభించు ఛత్రము విషయమరయ

    చం॥ మసలఁగ వాన యందటుల మక్కువ యందరికిం గనంగనౌ
    నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
    ముసరఁగ మేఘమాలలటు మోదము నొందుచుఁ గ్రీడ సల్పఁగన్
    వసమగు ఛత్రనామమది వాసియు ఖ్యాతినిఁ గాంచి యొప్పెడిన్

    ఛత్ర గొడుగు పుట్టగొడుగు రెండూనండి. నేను గొడుగు తీసుకున్నానండి

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    వేపకాయంత వానికి వెర్రి ముదిరి
    వదరు నీరీతి నోటికి వచ్చునటుల
    నేతిబీరలో శ్రేష్ఠమౌ నేయి గలదు
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు

    రిప్లయితొలగించండి
  9. చంపకమాల:
    కిసకిస నవ్వునొక్కపరి కిన్క వహించు నకారణమ్ముగా
    పొసగని రీతిగా బలుకు బుద్ధి విహీనునివోలె నిట్టులన్
    పసగల నేయి లభ్యమగు పన్నుగ జూచిన నేతిబీరలో
    నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  10. వాన లేతెంచు కాలమే వర్షఋతువు
    వాన కురియగ తడిసెను ప్రాణులెల్ల
    విశదమాయెను వానలో మశకమునకు
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు

    పసగలవారు వండెదరు వంటలనన్నియు రుచ్యరీతినిన్
    విసుగును వీడనాడ నెఱవేర్చుట వీలగు నభ్యసమ్మునన్
    వసుధను సర్వభక్ష్యములు ప్రక్రమమేగద వంటయింటిలో
    నసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  11. సందె చీకటిలో దృష్టి మందగించ
    శునకమే కనులగు కృంగ దినకరుండు
    దారి దప్పక తడవక దరికి జేర
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్క, గొడుగు

    కంటి చూపు ఆనక కుక్క సహాయంతో నడచు వానికి వర్షంలో వెళ్ళడానికి కుక్క మరియు గొడుగు రెండూ అవసరం .

    రిప్లయితొలగించండి
  12. ముసురులు బట్టి వాన కడుభోరుననాగక నూరు ముంచు వే
    ళ సరకుజేయకేగిన యలౌక్యుని చేతుల పొట్లమాదులే
    పిసరును చెమ్మ జూడకనె వీటికి జేర్చగనవ్వి దాచగా
    నసదృశ రీతిఁ గుక్క గొడుగునక్కర వచ్చు గుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  13. పాక శాస్త్ర ప్రవీణులు భద్రగతిని
    వేఁగఁ జేసి వండింతురు వెక్కసముగ
    వెచ్చగా నంజికొన సురం బ్రీతిఁ గొంచుఁ
    గుంభ వృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు


    ముసరెను మబ్బు లెల్లెడల ముంచు జగమ్మును వర్ష మిత్తఱిం
    గసరక యాత్మ రక్షణము గార్యము తత్క్షణ మెంచి చూడుమా
    విసువక విన్మ చెప్పినది వేగమ ఛత్రముఁ గొన్మ వాగ కి
    ట్లసదృశ రీతిఁ గుక్క! గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:వర్షమున కుక్కతో తాను బయట కరుగు
    బాలు డిట్లనె" గొడుగు లో పట్టు టెట్లు
    కుక్కయును, నేను,మరి యొక గొడుగు వలయు
    కుంభవృష్టిలోఁ గావలెఁ గుక్కగొడుగు”
    (ఇక్కడ కుక్క గొడుగు అంటే కుక్క కోసం గొడుగు. )

    రిప్లయితొలగించండి
  15. చినిగి పోయెను బూర్తిగఁజేతి గొడుగు
    కుంభవృష్టిలోఁ ,గావలెఁ గుక్కగొడుగు
    మూత్ర వ్యాధిని వారించ పూర్తిగాను
    దీసికొనిరమ్ము వెంటనే కాసులమ్మ!

    రిప్లయితొలగించండి
  16. 'ముసరగమేఘమాలికలుభోరునవర్షముకుమ్మరించగా
    పసగలకూరగామనకు పండుగ రోజున వంటకానికై
    యసదృశరీతిఁ గుక్కగొడు గక్కరవచ్చును ,కుంభవృష్టిలో”
    బసరములెన్నియో తడిసి పారుచు దిక్కులవెంబడించెనే

    రిప్లయితొలగించండి
  17. చం:విసుగు వహించనేల నిక వీడదు వర్ష మటంచు?మాను నీ
    నస, మథు పాత్ర నందెదము, నా కదె మోదము కార్య మున్నచో
    వెస నొక ఛత్రమున్ గొనుము వేగమె పోదము చింత యేలయా!
    అసదృశరీతిఁ గుక్క, గొడు గక్కరవచ్చును కుంభవృష్టిలో
    (గుక్క=మద్యపు గుక్క. వర్షాకాలం లో మద్యపు గుక్క, గొడుగు రెండూ పనికొస్తాయి అని. )

    రిప్లయితొలగించండి