3, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4961

4-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్”
(లేదా...)
“దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్”
(ఆశావాది ప్రకాశరావు గారి అష్టావధాన సమస్య)

12 కామెంట్‌లు:

  1. నిర్వ్యాపారమ్మదియే
    నిర్వ్యాజ్యపు బ్రతుకులంచు నీచులు వారే
    దుర్వ్యసనములు కలిగిన
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్.


    ఈ ర్వ్యాప్రాసము కష్టసాధ్యమది నేనేరీతి పూరింపనో
    నిర్వ్యాజ్యమ్మగు జీవితమ్మనిన నేనీచుండు కాంక్షింపకన్
    నిర్వ్యాపారము కన్నమేలని యిలన్ నిర్గ్రంధుడే చెప్పెనే
    దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్.

    రిప్లయితొలగించండి
  2. దుర్వ్యసనములకు లోనయి
    నిర్వ్యథనమ్మున బ్రతుకును నెరపుట తగునా
    నిర్వ్యాజమ్ముగ కొందరు
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్

    రిప్లయితొలగించండి
  3. చిర్వ్యాపారుల పుడపుడు
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్
    దుర్వ్యసన మౌనది వడిగ
    నిర్వ్యాజమగు పని జేయ నేర్పరి యనెదర్

    రిప్లయితొలగించండి
  4. నిర్వ్యాజమ్ముగ నీభువిన్ జనులలో నెక్కొన్న నిర్లక్ష్యమే
    నిర్వ్యాపార పరాయణమ్మనెడు మున్నీటన్ బడంద్రోయుగా
    దుర్వ్యాపారముసేయ పాల్పడుటయున్ దోషంబు, కాదెన్నడున్
    దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్

    రిప్లయితొలగించండి
  5. నిర్వ్యాజ మైనది విడిచి
    దుర్వ్యాపారము సలుపుట దోచుట కొరకే
    దుర్వ్యసనమ్ములపాలై
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్

    దుర్వ్యాఖ్యానము చేయబోకు మెపుడున్ దుర్బుద్ధినే వీడుమా
    నిర్వ్యూఢంబగు కృత్యముల్ నయమగున్ నీకేలరా సోదరా
    దుర్వ్యాపారము? లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్
    నిర్వ్యాజంబగు వృత్తి తృప్తికరమై నీజన్మ ధన్యంబగున్

    రిప్లయితొలగించండి
  6. ఉర్వ్యాధారముగన్ ప్రజాళి కనరే యున్నంతలోనున్నతిన్
    దర్వ్యాభాతి నివాసమౌను ఖలుడై తప్పంగ ధర్మంబులన్
    స్వర్వ్యాపిన్ మునగంగ వీడి చనునే పాపమ్ములేరీతిగన్
    దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్!!

    దర్వ్యాభాతి నివాసము = పాము పడగ నీడలో ఉండుట

    రిప్లయితొలగించండి
  7. కందం
    నిర్వ్యాజమ్మునఁ జేసిన
    సర్వ్యాపిని మునిగనంత సత్ఫలితమిడున్
    నిర్వ్యాపారులఘమనన్
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్

    శార్దూలవిక్రీడితము
    నిర్వ్యాజమ్మునఁ జేయగాఁ దగునయా! నీరాజనాలందగన్
    సర్వ్యాపిన్ దలముంచినంత ఫలమున్ సాధింఛినట్లౌనయా
    నిర్వ్యాపారులు దుష్ట సంగతినహో! నిర్వర్తనందెట్లగున్
    దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్?

    రిప్లయితొలగించండి
  8. కం:ఉర్వ్యవశేష విహీనత
    నిర్వ్యవసాయునిగ మారె నిన్నటి రైతే
    నిర్వ్యాపారులు కొడుకులు
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్”
    (ఉర్వ్యవశేషవిహీనత=భూమి మిగలక పోవటం.భూమి లేని రైతు నిర్వ్యవసాయు డయ్యాడు.అతని కొడుకులు పనీ పాట లేని వాళ్లై చెడ్డ పనులకు దిగారు.)

    రిప్లయితొలగించండి
  9. శా:ఉర్వ్యాధారుడు రైతు భూరహితుడై యోడన్ కృషిన్ దుఃఖి యై
    నిర్వ్యాపారత నుండ మిత్రు డనియెన్ "నే డెంచగా సాగరాం
    తర్వ్యాపారము మద్య మొక్కటియె చింతన్ వీడుమా !అట్టిదౌ
    దుర్వ్యాపారము, లాభదాయకము సంతోషమ్మునన్ జేసినన్”
    (రైతు వ్యవసాయం లో నష్టపడి భూమినే కోల్పోయాడు.మిత్రుడు దీని బదులు మద్యం అనే దుర్వ్యాపారం చెయ్య మన్నాడు.సముద్రాంతర స్థాయి వ్యాపారం అదే అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. దు ర్వ్య సనంబు ల కొఱ కై
    నిర్వ్యా పారులు పుడమిని నిర్భయ పరులై
    ని ర్వ్యా జ మ్ము న కొందరు
    దు ర్వ్యా పారమ్ము జేయుదురు మోదము నన్

    రిప్లయితొలగించండి
  11. దుర్వ్యసనమ్ముల నూనక
    దుర్వ్యయములు లేని వృత్తి దుర్భర మైనన్
    నిర్వ్యథన సుదూరీకృత
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్


    దుర్వ్యాసంగము లెన్న కెన్నఁడును సంతుష్టాంత రంగమ్మునన్
    దోర్వ్యాపారము నెద్ది యైన నిలలో దుస్సాధ్యమం చెంచినన్
    నిర్వ్యాపారము కన్న నుత్తమ మగున్ నిక్కంబుగా నాఁపినన్
    దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునం జేసినన్

    రిప్లయితొలగించండి
  12. నిర్వ్యాపారత నొందగ
    నిర్వ్యాజన రక్తితోడ నీచపు మతులై
    దుర్వ్యసన చిత్త శీలురు
    దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్”

    రిప్లయితొలగించండి