9, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4967

10-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా”
(లేదా...)
“జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్”

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      ప్రీతిగ సత్యమహింసలె
      జేతిని నాయుధములనఁగ స్వేచ్ఛగడించన్
      జాతిపితగఁ‌ గొనియాడెడు
      జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా!

      ఉత్పలమాల
      ప్రీతి నహింస సత్యముల విజ్ఙత దాల్చగ నాయుధమ్ములై
      జాతికొసంగ స్వేచ్ఛ కడు సంతసమొందుచు గాంధితాతనే
      జాతి పితాయటంచు భువి సాహసవంతుని మెచ్చుచుండ నా
      జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్!

      తొలగించండి
  2. ఆతనిని పెండ్లి యాడగ
    కౌతుకముగ నత్తవారి కాననమందున్
    నాతికట సలుపుచుండెడి
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా

    రిప్లయితొలగించండి
  3. మోతను మోయు గర్భమున పుత్రులకై నవ మాసముల్ గదా
    జోతలు సేయ తక్కువె ప్రసూతి వెతల్ సహియించు వేళలో
    మాతకు మారు గల్గునె! త్రిమాతలనొక్కరిఁ జేయ తల్లియౌ!
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్!!

    రిప్లయితొలగించండి
  4. సీతమ్మ జాడ వెదుకగ
    భీతిల్లక వాయుసుతుడు ప్రేరిత్వమునే
    వేతనము గోరి దాటెన?
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా!


    దూతగ నంజనా సుతుడు దుర్భర కార్యమటంచు నెంచకన్
    మాత యయోనిజన్వెదుక మంధిరమున్ దరి యించి నందుకై
    వేతనమెంత పొందెనొ కపీశుడు, భక్తిగ జేయు కార్యమే
    జీతము లేని కొల్వు , గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్.

    రిప్లయితొలగించండి
  5. ఆతత సేవా గుణమున
    ప్రీతిగ జనులకు సతతము పెన్నిధి వోలె న్
    నేత గ తోడై నిలి చెడి
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా!

    రిప్లయితొలగించండి
  6. ప్రీతిగ నింటిలిపాదికి
    చేతమునందలుపులేక జేయుచు సేవల్
    మాతలు మన్ననలందిరి
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా

    చేతలయందు సీద్యమును చేరగనీయక క్షాంతితోడుతన్
    బ్రీతిగ గీమునందు పలు పేరిమిఁ సేవలుచేయునట్టియా
    మాతలు ధాత్రిపైన పరమాత్మునిదూతలు వారు సల్పునా
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  7. కోతులలోశ్రేష్ఠుడనెను
    సీతను నేవెదికెదనని శ్రీరామునితో
    యాతనలే భరియించెను
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా

    సీతను నేకనుంగొనెద శ్రీరఘురామ యటంచు పల్కెనా
    కోతులలో మహత్తరుడు కోవిదుడే కృతనిశ్చయంబునన్
    యాతనలేభరించి తన యత్నము నెక్కొనజేసె నాతడే
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ వేతన మొప్పార మిగుల
    చేతన మొందఁగ నిహమున శ్రేయము విరియన్
    జ్యోతి వెలుఁగఁ బరముఁ బడయ
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా

    ఉ॥ వేతనమొంది బాధ్యతలఁ బేరిమి మీరఁగఁ దీర్చ యోగ్యఁడై
    చేతనమొంది సంతతియు శ్రేయముఁ గాంచఁగఁ దృప్తి నిండఁగన్
    యాతన సంపదల్ వడయ నాతుర యేలని సంఘసేవకై
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  9. కం:జీతమును,మిమ్ము వదలక
    చేతికి విశ్రాంతి లేక చేయుట కంటెన్
    మీ తల్లిగ మిగిలిన నా
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా!
    (ఇంటి పని,ఆఫీస్ పని తో విసిగిన ఒక తల్లి బిడ్డల తో అన్న మాట.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:జీతము నిచ్చె రా జనుచు చేతులు కట్టుక నిల్వ నెవ్వడో
    చేతులు త్రిప్పి కొండెముల జెప్పిన నా తల తీసి వేయు, నా
    తాత లొసంగ వేదమును దణ్నము,దక్షిణ బొందు చుండ నీ
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్”
    (ఒక బ్రాహ్మణుడు రాజు కొలువులో జీతం వస్తుందని కక్కూర్తి పడితే ఆ రాజు కొలువులో ప్రమాదాలు ఇలా ఉంటాయి.దాని బదులు జీతాలు లేకున్నా పౌరోహిత్యం మీద బతకటమే నయం అనుకున్నట్లు.పౌరోహిత్యం లో డబ్బులు ఇచ్చిన వాడే దణ్నం పెడతాడు.)

    రిప్లయితొలగించండి
  11. ఆతతమౌ యాదరణ స
    మేతము నధికార ముండ మితి హీనముగా
    నే తఱిఁ గన నల్పముగా
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా


    ప్రీతిని గూర్ప నిత్యము వివేకము తోడుత బిడ్డ లుండఁగా
    జీతము ముట్టి నంతటనె చేతి కొసంగెడు నాథుఁ డుండఁగా
    నాతికి సంతసమ్మున ఘనమ్ముగఁ జేయఁగ భర్త కింపుగా
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  12. *జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్*
    ఈ సమస్యకు నాపూరణ.

    నీతి నిజాయితిన్ కలిగి నీమము తోడుత నుండి నెప్పుడున్
    జాతికి నేతయై సతము చక్కటి పాలన నంద జేయుచున్
    ఖ్యాతి గడించు వానికిల కాసుల కోరిక లేని వానికిన్
    జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్

    ఆర్కే శర్మ

    రిప్లయితొలగించండి
  13. నీతి కథలు వినిపించుచు
    ఊతముగాకర్రపట్టి యొప్పుగ వృద్ధుల్
    చేతమునందు తలంతురు
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్టమ్ము గదా

    నాతియు నిత్యమున్ విడక నాథుని సేవల నాచరించుచున్
    ప్రీతిగ పెంచి బిడ్డల నుపెద్దగ చేయును తాను తల్లిగా
    చేతము నందుభక్తినిడి శ్రీహరి నామము తల్చుతల్లిదే
    జీతము లేని కొల్వు కడు శ్రేష్టము గాదె తలంచి చూచినన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మాతయె సంసారమునకు
    ప్రీతిగ సేవలను చేసి ప్రేమను పంచన్
    నాతికి మెట్టిన యింటను
    జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా!

    రిప్లయితొలగించండి