10, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4968

11-12-2024 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె”
(లేదా...)
“కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా”

11 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఉదర పోషనార్థమ్మున నుర్విజనులు
    బహుకృతంబగు వేషాల బయటపడఁగ
    ' ఆ' కు నుత్తర పదమునై యగుపడంగ
    ' కలి' నిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె?

    మత్తేభవిక్రీడితము
    కలిలో నిత్యము పెర్గెడున్ ప్రజలకున్ గల్గింప నుద్యోగముల్
    దలకున్ మించెడు భారమై ప్రభుతయే తప్పించుకో జూడఁగన్
    తలకోదారిని చీల వృత్తులను క్షుద్బాధల్ శమింపంగ నా
    కలి కాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా!

    రిప్లయితొలగించండి
  2. విమల కార్యాలు సతతము నమలు సేయ
    పాప మేరీతి చేకూరు బ్రతుకులోన
    సులభమౌరీతి నార్జించు తలపులున్న
    కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె

    తలపెట్టన్ సరియైన కార్యములిడున్ దన్మాత్రమౌ తృప్తినే
    ఫలమే స్పష్టతరంబగున్ రయమునన్ బాపంబు పుణ్యంబులై
    సులభంబౌ సముపార్జనే గురికదా శోకంబు నిర్జింపగా
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా

    రిప్లయితొలగించండి
  3. తే.గీ.॥
    ఉదర పోషణ కోసమై యుర్వియందు
    పలువిధమ్ముల కార్యముల్ సలుపుకొనుచు
    బ్రతుకు బండిని నడిపించు పామరులకు
    కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె

    మత్తేభము:
    కలికాలంబునఁ గానరాక మదిలో కారుణ్య మేమాత్రమున్
    పలువేషమ్ములు దాల్చి పాపమని సంభావింపకన్ పేదలన్
    కలుషాత్ముల్ గడు మోసపూరితముగా కష్టాల పాల్జేతురే
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా

    రిప్లయితొలగించండి

  4. సత్యవంతువంతులె చూడ జనవిరోధు
    లైరి వదరుబోతులె కన ననఘులైరి
    నీతిపరులోడగ ఖలులు నేతలైన
    కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె


    విలువల్ మారెను మానసమ్మునగనన్ విద్వేషముల్ పెర్గె రూ
    కల ప్రాధాన్యము పెచ్చుమీరెనిల దుష్కార్యమ్ములన్ సల్పెడిన్
    ఖలులేపాలకులైరిస్వార్థపరులా ఖల్ముచ్చు లేలంగ నీ
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా.

    రిప్లయితొలగించండి
  5. రెక్క లాడిన నే నిండు డొక్క లనుచు
    పనులు దొరకక జనులిల పస్తు లుండి
    యార్తి కుందె డు వేళ లో యాకలి యను
    కలిని. బాప పుణ్య ముల లెక్క లు గుదు రు n

    రిప్లయితొలగించండి
  6. కలలో మంచి తలంపుఁ జేయఁ గలుగున్ గాఢంబుగన్ఁ బుణ్యముల్
    కలిలో పాపములంటుఁ గోరి ఖలుడై కౌటిల్యమున్ జూపినన్
    తలపోయందగు ధర్మసూక్ష్మములు వేదంబే ప్రమాణంబుగన్
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా!!

    రిప్లయితొలగించండి
  7. తెలిసెన్నాకును నీతిమంతు
    లిలలో దెప్పర్ల పాలైరి యే
    తెలివిన్ లేని నిరక్షరాస్యులిలలో
    దేజంబుతో నుండ్రి నా
    కలనైనన్ దలపోయలేదెపుడు నే
    గాలాత్ము లీలల్ ధరన్
    కలి కాలమ్మున బాప పుణ్యముల
    లెక్కల్ తారుమారౌగదా!

    రిప్లయితొలగించండి
  8. తే॥ అలవికాని స్వార్థము నిట నావహించఁ
    బాప భీతిఁ గనని వారు పరిఢవిల్ల
    ధర్మ నియతి భాష్యము మార మర్మ మెఱుఁగఁ
    గలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె

    మ॥ ఇలలో ధర్మముఁ గాలచక్ర గతితో నీరీతిగాఁ జొప్పడెన్
    వలచన్ సర్వులు బాహ్య సౌఖ్యములనే పాపాత్ములే మాన్యులై
    తలపన్ సంపద పొందుటే నియతియున్ ధర్మంబుగా మానవుల్
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:దొంగతనము జెసి దొరకిన యొక దొంగ
    సామ్యవాద మిట్లు జరుప సాగె
    కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురు
    నెట్టు లాకలి గొని నట్టి వేళ

    రిప్లయితొలగించండి
  10. మ:తుల జేబట్టిన న్యాయదేవతకు నీతుల్ ముఖ్యమే కాని పే
    దల క్షుద్బాధల నామె యెంచ గలదే? దారిద్ర్యమే రెచ్చ రె
    క్కల కష్టమ్మును జేయ వీలు పడకే కావించితిన్ చౌర్య, మా
    కలికాలమ్మునఁ బాపపుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా”
    ( ఆకలి వేసింది కనుక నేరం చేసాను అని ఒక నేరస్తుని సమర్థన.)

    రిప్లయితొలగించండి
  11. మానవ గణ హత్యా దోష మూనరే గ
    ణింప వీరవరేణ్యులు సంప నడరి
    సాహసమ్మున నిర్దయఁ జంప ధర్మ
    కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె

    [కలి = యుద్ధము]


    అల యింద్రుం డమరావతీ పురినిఁ జోద్యం బంది వీక్షింపగాఁ
    గలలో నైనను గాన రాని గతి సాక్షాత్కారముం జేయఁగా
    విలయాకారము నూని క్షామ మిల గంభీరంపు టుగ్రంపు టాఁ
    కలి కాలమ్మునఁ బాప పుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా

    రిప్లయితొలగించండి