28, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4986

29-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్”
(లేదా...)
“కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్”

16 కామెంట్‌లు:

  1. ఎంతో కాలముగ నడుగ ,
    కాంతా ! రమ్మనెను యోగి ; కైవల్యరతిన్
    అంతయు కాకుండినయెడ
    కొంతయయిన దానిని సమకూర్చుట కొరకై

    రిప్లయితొలగించండి
  2. కందం
    చింతల్ వీడుచు మదిలో
    సంతోషమ్మున తపమ్ము సత్ఫలమిడగన్
    సొంతంబంచును ముక్తికి
    కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్

    శార్దూలవిక్రీడితము
    చింతల్ వీడుచు ధ్యానమార్గమదియే సిద్ధించి భక్త్యాత్ముడై
    స్వాంతంబందున దివ్య భావనల దోచన్ సచ్చిదానందమే
    సొంతంబౌచును చేరవచ్చెననుచున్ శోభించు ముక్త్యాళువౌ
    కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

    రిప్లయితొలగించండి

  3. చెంతకు జేరుచు పాదా
    క్రాంతుడనైతిని ఖలాంతకా! కృతి వాసా!
    పంతమ్ము వీడుచు నుమా
    కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్.


    సంతాపమ్మును దీర్చు నామమొకటే సత్కర్మ గా నెంచుచున్
    సంతోషమ్ము జపింతు సంతతము నిష్కామంబు తో నిత్యమున్
    పంతమ్మున్ విడి దాసదాసుడననున్ పాలింపగా హే యుమా
    కాంతా రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్.

    రిప్లయితొలగించండి
  4. కాంతారమ్మున పర్ణశాలకడ నిష్కామమ్ముగా మౌనితా
    చింతల్ వంతలువీడి దివ్యపదముల్ సిద్ధించు యన్వీక్షతో
    స్వాంతంబందున భక్తినిల్పి భవ! పశ్వత్పాలుడా! యో యుమా
    కాంతా! రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

    రిప్లయితొలగించండి
  5. కాంతారమ్మున నన్యఁపు
    చింతల్ విడనాడి మోక్ష సిద్ధికొరకు దా
    స్వాంతమ్మున భక్తిగ శ్రీ
    కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్

    రిప్లయితొలగించండి
  6. సంతానంబును వీడి మౌనమునఁ గాషాయంబు మైదాల్చి వే
    దాంతావాసుని స్త్రోత్రముల్ పలికి యాత్మానంద భావంబునన్
    ప్రాంతమ్ముల్ తరియించి పోవుటెటనన్ ప్రశ్నంబుకున్ బల్కెనా
    కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్!!

    కాంతారమ్ము = అరణ్యము

    రిప్లయితొలగించండి
  7. కాంతను విడనాడితి నే
    కాంతమున తపంబుసల్ప కాంక్షించితి కా
    మాంతా!దయపడు గిరిజా
    కాంతా! రమ్మనెను యోగి కైవల్యరతిన్

    కాంతాప్రీతిని వీడియుంటినిగదా కైవల్యమున్ జేరగా
    సుంతైనన్ హృదయంబునన్ నిలువదే సూక్ష్మాత్మపైదృష్టి యే
    కాంతంబే సరియైన మార్గముగదా గంగాధరా! పార్వతీ
    కాంతా!రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

    రిప్లయితొలగించండి
  8. చింతాక్రాంతుఁడనౌదు రాజనగరున్ జీవింప, భూజానికిన్
    వంతల్దీర్పగఁ జేయుయత్నములతోన్, వర్జింప నా యజ్ఞమున్
    భ్రాంతిన్ వీడి తపంబుఁబట్టవలయున్ మంత్రీ! తగున్ నాకు నా
    కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

    [నాకున్ - ఆ- కాంతారమ్ము -అనె]

    రిప్లయితొలగించండి
  9. శాంతా కారుని రుద్రుని
    స్వాంతము నందున నిలిపియు స్వ చ్ఛ o ద ము గా
    భ్రాంతి ని వీడి జపిo చుచు
    కాంతా రమ్మనెను యోగి కైవల్య రతిన్

    రిప్లయితొలగించండి
  10. కాంతార్థ ఫలాపేక్షల
    భ్రాంతి యొకింతయునులేక భద్రుడనైతిన్
    శాంతేషణమున నేగెద
    కాంతారమ్మనెను యోగి కైవల్యరతిన్

    కాంతారము : అడవి

    రిప్లయితొలగించండి
  11. ఇంతియు ముక్తికి బాటని
    పంతముతో పెండ్లియాడ పడుచును నొకతిన్
    భ్రాంతిన నుండి పిలిచె, నో
    కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్!

    రిప్లయితొలగించండి
  12. కం:కాంతాపుత్రుల బంధ మ
    నంతమ్మే! బ్రహ్మమే యనంత మ్మిక నన్
    శాంతికి పురికొల్పిన దీ
    కాంతార మ్మనెను యోగి కైవల్యరతిన్”
    (కాంతారం అతనికి శాంతి మార్గం గా అనిపించింది.)

    రిప్లయితొలగించండి
  13. శా:కాంతాపుత్రుల బంధముల్ ముగిసె నా కర్తవ్యముల్ దీర్చితిన్
    భ్రాంతుల్ బొందుచు సంతతమ్ము వలదీ పౌత్రాది బంధమ్ము లా
    వంతౌ జీవిత మింక ముక్తి కొరకే అర్పింతు,నా వాస మీ
    కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్”

    రిప్లయితొలగించండి
  14. అంతశ్శత్రుచయ మణఁచి
    దాంతుం డయి వీడి యెల్ల దర్పమ్మును నా
    సంతాపముఁ ద్రుంప రమా
    కాంతా రమ్మనెను యోగి కైవల్య రతిన్


    అంతా మాయ యటంచు నెంచి మది నిత్యానంద చేతస్కులై
    యెంతే నిష్ఠఁ జరించు వారలరు లేవే కోర్కు లెన్నంగ వే
    దాంతజ్ఞానులు సత్తపోధనులు మీ యావాస మెచ్చోటు నాఁ
    గాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

    రిప్లయితొలగించండి