24, డిసెంబర్ 2024, మంగళవారం

సమస్య - 4982

25-12-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ”
(లేదా...)
“చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ”

25 కామెంట్‌లు:


  1. తుట్టియె వచ్చిన వేళను
    కట్టెల గొట్టుకు బ్రతుకుము కల్పంబున నీ
    వెట్టివిధి యప్పు కొరకై
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ.


    తుట్టియె వచ్చి వర్తకము దుర్నుని గానిను మార్చనేమిరా
    కట్టెల గొట్టి యమ్ముకొని కాసుల పొందుట మేలు గాని నీ
    వెట్టి పరిస్థితిన్ నెనరునెచ్చుగ చూపెదరంచు నప్పుకై
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ.

    రిప్లయితొలగించండి
  2. కందం
    దిట్టయని కర్ణుఁ గుంతీ
    పట్టిని గొని రాజరాజు ఫలమందెనొకో?
    గుట్టుగ వైరిని గృపఁగను
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ!

    ఉత్పలమాల
    పట్టియటంచుఁ గుంతికను వాస్తవమెర్గుక రాజరాజహో
    దిట్టగనెంచి కర్ణుని విధేయునిగన్ గొని సేమమందెనే?
    గుట్టుగ పాండవేయులకుఁ గోరిన సాయమొనర్చె! వైరితో
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ!

    రిప్లయితొలగించండి
  3. పట్టింపులెరుగ నప్పుడు
    జట్టుగ మెలగుచు బతుకును సాగించిననున్
    గిట్టనిచోట జగడమున
    చుట్టఱికంబున్న యెడకుఁ జొరరాదు సుమీ

    రిప్లయితొలగించండి
  4. చుట్టరికమన్న కూరిమి
    చట్టము లేర్పడినవిగద సంఘము కొరకే
    చట్టము మీఱి శరణమని
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ

    చుట్టములన్న బంధువులు చూపుచు నుందురు ప్రేమభావమున్
    జట్టము మేలుగూర్చునని సభ్యులు చేతురు కొల్వుకూటమిన్
    జట్టము మీఱుచున్ మెలగి సంకటముల్ దొలగింప గోరుచున్
    జుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ

    రిప్లయితొలగించండి
  5. గుట్టుగ సంసార మ్మును
    కట్టడి గా నడుపు కొంచు గడుపుచు నుండన్
    పెట్టు మని కో రు కొనుట కు
    చుట్ట రి కం బున్న యెడకు జొర రాదు సుమీ

    రిప్లయితొలగించండి
  6. బిట్టుదనంబు, డాంబికము, భృత్యుల యందు నసహ్యభావమున్,
    బట్టిన పట్టువీడనను పంత, మవిద్యయు, నర్థికిన్ దలన్
    గొట్టెడు వక్రభాషణము, గ్రూరత, మౌఢ్యము లిట్టివాటికిన్
    జుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ!

    రిప్లయితొలగించండి
  7. పెట్టిన వేళ గొప్పనుచు పేరిమిఁ జూపుచునుండు బంధువుల్
    పెట్టని వేళ లోభియని పేదరికమ్మును గేలిసేయరే
    గుట్టుగ నుండ వచ్చు మరి కూడక దూర నివాసముండినన్
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ!!

    రిప్లయితొలగించండి
  8. ఎట్టి పరిస్థితులందున
    నెట్టన పుట్టిల్లు జేరు నెలఁతలు వినుడీ
    తట్టము కలిగిన దినముల
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ

    రిప్లయితొలగించండి
  9. నెట్టన పుట్టినింటికిని నెల్తుకలేగుట సాజమెన్నడున్
    చుట్టపు చూపుగా నొరుల జూడఁగ బోవుట కూడ సాజమే
    తట్టములెన్ని గల్గినను ధారుణి యంగన లెన్నడేనియున్
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ

    రిప్లయితొలగించండి
  10. కం॥ దిట్టగ నెయ్యపు పూతలు
    పట్టకఁ గష్ట సమయమునఁ బరుగిడు గుణమున్
    గట్టుకు చేర్చు సఖులఁ గనఁ
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ

    ఉ॥ దిట్టగ నీవు వృద్ధిఁగనఁ దీరుచు బారులు వచ్చు వారలై
    పట్టుగ నీకు సన్నుతులు పాడుచు నెయ్యముఁ జూపు వారలై
    చుట్టఁగఁ గష్టనష్టములుఁ జూడని వారలు బంధువుల్ గదా!
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ

    రిప్లయితొలగించండి
  11. కం:చుట్టరికము జూపించుచు
    గుట్టుగ తమ చెడ్డ పనుల గోతుల నిన్నున్
    బెట్టెద రమాత్య వర్యా!
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ”
    ( ఒక నిజాయతీ గల సెక్రెటరీ మంత్రికి ఇలా సలహా ఇస్తాడు. )

    రిప్లయితొలగించండి
  12. ఉ:పట్టుక క్లిష్టకార్యమును వచ్చితి హైదరబాదు నేను కా
    ల్వెట్టిన బంధు గేహమున వీరలు లేపరు నిద్ర నుండి టీ
    పెట్టరు వేళకున్ పనుల వేళకు సోదిని పెట్టు చుందు రీ
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ”
    (ఏ ఊరైనా ముఖ్య మైన పని మీద వెళ్లినప్పుడు చుట్టాల ఇళ్లకి వెడితే చాలా డెలికసీ ఉంటుంది.లాడ్జింగ్ లో ఉండటమే మంచిది.ప్రేమ ఉంటే పని అయ్యాక చుట్టరికాలు చూసుకోవాలి అనేది నా పాలసీ.)

    రిప్లయితొలగించండి
  13. ఉ:పెట్టెను గూఢచర్య మను భీషణ కార్యమునన్ బ్రభుత్వ మె
    ప్పట్టున నీ రహస్యముల బాహ్య మొనర్చకు,స్త్రీల నెయ్యమున్
    బట్టకు,తల్లి దండ్రులను బంధము దేశము కంటె స్వల్పమే
    చుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేగుట కీడగున్ సుమీ”
    (సైనికుల త్యాగం మనకి తెలిసినదే.కానీ సైనికులు కానీ ఇతరులు కానీ గూఢచారి కార్యకలాపాలలో ఉంటే అది యుద్ధం కంటే తీవ్ర మైన కష్టం.ఒక గూఢచారిని అతని పై ఆఫీసర్ ఇలా హెచ్చరించి కర్తవ్యబోధ చేసాడు.జై జవాన్.)

    రిప్లయితొలగించండి
  14. వాట్సప్ పూరణలను ఇక్కడ సమీక్షించలేదని మిత్రులు గమనించగలరు. (సమయాభావం వల్ల)

    రిప్లయితొలగించండి
  15. బెట్టిదముగ బీద యయిన
    గుట్టుగఁ గాపురము సేయ గుణ మగుఁ జుమి యె
    ప్పట్టున నట్టి నర వరుఁడు
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ


    పట్టిన పట్టు వీడకనె పంతము తోడుత వేళ సిక్కఁగా
    దిట్టతనమ్మునం గడిఁది తెంపున హాని నొసంగఁ జూతురే
    తట్టినఁ దట్ట కున్న నెద దాయలు మెత్తని దాయ లెన్నఁగాఁ
    జుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేఁగుట కీడగుం జుమీ

    రిప్లయితొలగించండి
  16. చుట్టము లనబడు వారలు
    చుట్టంబు లవలెనుగాక చోరుని దలపన్
    ముట్టీ ముట్టగ నుండగ
    చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ”

    రిప్లయితొలగించండి