23, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4981

24-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు”
(లేదా...)
“భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్”

14 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    వేడ్కగాంచుచుండ ప్రేక్షకలోకమ్ము
    నాశువుగ కవిత్వమలరఁ బలుక
    రసహృదయుఁడగుచు నలంకారమొలికింప
    భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు!

    శార్దూలవిక్రీడితము
    చింతాక్రాంత వరూధినీలలన తా శృంగార వాంఛాళువై
    కంతుండై ప్రవరుండు నూహలను దాకన్ నోపనిస్త్రాణయై
    పంతంబందున కూడదన్న వరునిన్ ప్రార్థింప,వర్ణింపఁగన్
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్

    రిప్లయితొలగించండి
  2. మూర్ఖుడనగ దానె ముఖ్యుడననుకొని
    భ్రాంతిఁ జెందువాఁడె ; పండితుండు
    దనను మించు వారు దందడిగ తలచు
    పరుల గొప్పతనము బరిగణించి

    రిప్లయితొలగించండి


  3. పేదవారిపట్ల పేరిమినే కల్గి
    యాదరించి నేర్పి యక్షరముల
    బడుగు జనుల సేవ పరమాత్మ సేవంచు
    భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు.


    శాంతిన్ నిల్పుట కోసమై సతము తా శక్త్యాను సారమ్ముగా
    చింతాక్రాంతుల జేరదీసి తగు సంశ్రేయమ్ము నేగూర్చగా
    ప్రాంతమ్మందున భేదముండినను సద్భావంబు నావారనే
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్.

    రిప్లయితొలగించండి
  4. ఇంతింతై తపమింతయై హరుని వీక్షింపన్ మతంబౌట ధీ
    మంతుండౌ గురుసన్నిధిన్ వరలుటై మాయాంతమై రూఢి వే
    దాంతంబెల్ల నెఱింగి నేరిఁగన నౌరౌరా! పరంబ్రహ్మగాన్
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్

    రిప్లయితొలగించండి
  5. ఇంతిన్ జూడగ చంద్ర బింబముగఁ గృష్ణేందిందిరంబౌ కురుల్
    దంతాచ్ఛాదముఁ జూడ దొండ ఫలమౌ దానిమ్మలౌ దంతముల్
    వింతల్ గాగ వచించు కావ్యమున నుత్ప్రేక్షించి స్వాంతంబునన్
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్!!

    దంతాచ్ఛాదము = పెదవి

    రిప్లయితొలగించండి
  6. అంతరంగమందు వింతైన తలపుల
    కల్పనాజగతిని శిల్పియగుచు
    కావ్య సృష్టిసలుప కావ్యంపు పాత్రగా
    భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు

    స్వాంతంబొప్ప రచించుచుండు నెపుడున్ సత్కావ్యముల్ చూడనా
    సాంతంబే రసరంజితంబులగు నిస్సందేహమౌ రీతినిన్
    వింతేమున్నది యంతరంగమునఁ దా విస్పష్టమౌ పాత్రగా
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్

    రిప్లయితొలగించండి
  7. తే.గె:ఎంతొ విద్య నేర్చి ఎన్నొ భాషణ లిచ్చి
    నిగ్రహ మ్మనంగ నిర్వచించి
    బిరుదు పొంద వచ్చు విఖ్యాతి ఘన మని
    భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు?

    రిప్లయితొలగించండి
  8. భ్రాంతిం జెందును తోయజాక్షి ముఖమున్ భాసంతుగానెంచి దా
    భ్రాంతిం జెందును భామ నేత్రముగనన్ వైసారిణమ్మంచు వి
    భ్రాంతిం జెందును మేనిలోని మెరుపుల్ పర్జన్యు భాసంబుగా
    భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుండగున్

    రిప్లయితొలగించండి
  9. మోముఁజూచి చందమామగా భ్రమియించు
    కనుల బోల్చుచుండు కలువలనుచు
    మేనిమెరుపుఁజూచి మెరుపుతీగనుకొను
    భ్రాంతిఁ జెందువాఁడె పండితుండు

    రిప్లయితొలగించండి