7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

సమస్య - 5027

8-2-2015 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నను మనువాడి యతివ మురిసె”
(లేదా...)
“అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ”

18 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    విప్రవరుని వెంట ప్రేమలేఖను బంపి
    వలచితినను వార్త దెలిపివంత
    రథమున హరి వచ్చి రమ్మన, నన్న కా
    దన్నను, మనువాడి యతివ మురిసె!

    ఉత్పలమాల
    వెన్నుని మెచ్చి రుక్మిణియె వేదనదెల్పెడు లేఖతోడుగన్
    మన్నన విప్రునిన్ బనిచి మానసవీణను రాగమొల్కగన్
    దిన్నగఁ దేరుపై గుడికి దేవిని చేకొన రాగ, నన్న కా
    దన్నను, భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ!

    రిప్లయితొలగించండి
  2. కనగ రాక లక్ష్మి కాపురమందున
    శ్రీనివాసుడంత సేఁగినందె
    పద్మరాగ బాగు పావనియామెవేం
    కన్ననుమనువాడియతివమురిసె

    రిప్లయితొలగించండి

  3. ఇనుకులతిలకుండు మునిజన వంద్యుడు
    దశరథ తనయుండు దనుజ వైరి
    విల్లునెత్తినట్టి వీరుడగు రఘురా
    మన్నను మనువాడి యతివ మురిసె.


    మిన్నును బోలు వర్ణమది మేనును కల్గిన బండరాతినే
    యన్నువగా మరల్చెడుమహాత్ముడు తాటకి గూల్చినట్టి యా
    చెన్నగురూపమున్ గలిగి చింతలు బాపు గుణోత్తముండు రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  4. రాముని కథయందు లక్ష్మణ భరతుల
    యన్నను మనువాడి యతివ మురిసె .
    సంకటముల నెన్నొ జవిజూసి చివరకు
    లవ కుశులను బడసి రాణ నొందె

    రిప్లయితొలగించండి
  5. ఆ॥ రాముఁడెంత ఘనుఁడు రాముని మించిన
    తనయుఁడు పతి యన్న ధరణినిఁ గనఁ
    దరమె యనుచు తాను తలఁచి ధరణిజ రా
    మన్నను మనువాడి యతివ మురిసె

    ఉ॥ కన్నియ మెచ్చు రూపసియు క్షాత్రము నందున దిట్ట తానుగా
    వన్నెలు చిందు చుండఁగను వారిజనేత్రులు చూపు నిల్పఁగన్
    మిన్నగు సీతయే తనకు మేదిని జోడని విల్లుఁ ద్రుంచ రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  6. సన్నుత మౌని వాక్కు విని చంపెను రాక్షస దుష్ట తాటకన్
    మన్నున రాయిఁ దాకి ముని మానినిఁ జేసెను సంస్కరించుచున్
    ఛిన్నము సేసి చాపమును సీతను భార్యగ స్వీకరించె రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ!!

    రిప్లయితొలగించండి
  7. ప్రాగ్రసరులు రామలక్ష్మణు లిరువురు
    రాముడగ్రజుండు లక్ష్మణుండ
    నుజుడు వారినిగని కుజ సంతసమ్మొందె
    నన్నను మనువాడి యతివ మురిసె

    ఉన్నతమైన రూపము సమున్నత తేజము తోడ నున్నవా
    డన్నయె చెంతనిల్చి దరహాసము చేసెడివాడు తమ్ముడే!
    అన్నయె రామచంద్రవిభు డాతని తమ్ముడు లక్ష్మణుండు రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  8. కన్నియ సీత నేత్రముల గాంతులు నిండఁగ పూలమాలతో
    చెన్నుగనిల్చె, రాఘవుడు చేతనుబూనగ నీశు చాపమే
    ఛిన్నముగాఁగ నంత తన చేతమునందున నుల్లసిల్లి రా
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:అది ప్రమాద మనుచు నయ్యయు,నమ్మయు,
    నన్న పలుకుచుండ, నడవి బాట
    బట్టి విప్లవమును బట్టిన యడవిలో
    అన్నను మనువాడి యతివ మురిసె”
    (అడవిలో అన్న=నక్సలైటు)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఎన్నడు నాకు నీకు గల యీ ప్రియబంధము నిల్చి యుండ నే
    నెన్నితి మార్గమున్ చెలియ !యెంతయు చక్కని వాడు కాదె మా
    యన్న ,యతండు సాత్వికుడు,నాతని పెండిలి యాడు మందు మా
    యన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ”
    (అని ఒకామె తన స్నేహితురాలి తో అన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  11. విల్లు నెక్కుపెట్టి విరిచిన నాడు రా
    మన్నను మనువాడి యతివ మురిసె
    నటుల,కాననమున నందునదే రీతి
    నుండె వదిన-లక్ష్మణుండు దలచె

    రిప్లయితొలగించండి
  12. విల్లు విరువ లేక వీ గిన దరు ణా న
    దర్ప మలర దాను ధనువు ద్రుంచ
    జనక సుతయు మెచ్చి సంత సంబున ను రా
    మన్న ను మనువాది యతివ మురిse

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:"నిన్ను బ్రేమించి నాతడు నీతి లేని,
    వావి వరసలు లేనట్టి వాడు ,పనియు
    నేది చేయని సోమరి ఇంక వదలు
    మమ్మ!" యన్నను మనువాడి యతివ మురిసె”



    రిప్లయితొలగించండి
  14. శివునివిల్లు విరచి శ్రీరామచంద్రుఁడు
    సీత మనసులోని చింతఁదీర్చె
    సభికులెల్ల జూచి సంతోషపడగ రా
    మన్నను మనువాడి యతివ మురిసె

    రిప్లయితొలగించండి
  15. వైభవమ్ముగఁ దన భవన రాజమ్మున
    వనజ నయన పెద్ద లనుమతింప
    నుచిత రీతి తనదు రుచిరంపుఁ జెలికత్తె
    కన్నను మనువాడి యతివ మురిసె


    తిన్నని నైజ ముండి మది ద్వేష మెఱుంగని వాని నిత్యమున్
    మన్నన సేయు వానిఁ జెడు మానిన వానిని మిక్కుటమ్ముగం
    దన్ను వరించి నట్టి గుణ ధాముని నచ్చిన వాని నెవ్వ రే
    మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    రిప్లయితొలగించండి
  16. అన్నులమిన్నవే యతివ యందము చూడగ స్త్రీలు మెత్తురే
    ఎన్నగ నీదుపెన్మిటియు నేగతి దీటన సుందరాంగిరో
    చిన్నగ చెప్పుచుంటి విను చేరుమ జంటగ లంక రాజు మా
    యన్నను భర్తగాఁ గొనిన, యన్నులమిన్న యదృష్టరాశియౌ”

    (జంటను విడదీసి రాముడిని తాను పొందాలన్న ఆశతో శూర్ఫణఖ సీతతో )

    రిప్లయితొలగించండి