31, అక్టోబర్ 2025, శుక్రవారం

సమస్య - 5291

1-11-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ”
(లేదా...)
“నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో మాచవోలు శ్రీధరరవు గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. ఒక కవివరుని ఆవేదన:

    తేటగీతి
    తల్లి భారతి దయచేత నుల్లమలర
    పద్యమల్లెడు నైపుణి బడసినాడ
    మెచ్చెడు సభ నీర్ష్య పరుల విచ్చు కనుల
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాడ!

    ఉత్పలమాల
    తప్పులు దిద్దెడున్ గురువు దైవమువోలెను జిక్కినంతటన్
    నప్పెడు శైలి పద్యముల నల్వ సతీమణి దీవనంబనన్
    గుప్పెడు నైపుణిన్ బడయ, గుండెలమండెడు వారి కన్నులన్
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్!

    రిప్లయితొలగించండి
  2. చేత నయినట్లు పనులను జేయు చుండ
    నిచ్చెలము నిప్శులను బోలు నిందలిడగ
    విడక వాటి నెల్ల ననుభవించితి నన
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ”

    రిప్లయితొలగించండి

  3. ప్రేక్షకులు కని మెచ్చెడి విధము నేను
    కనుల విందుగ జేసితి గారడి నట
    యెలుకలను జూపి మార్చితి చిలుకలుగను
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ.


    కప్పము పొంది చూపితిని గారడి వాడను కాన వింతలన్
    కప్పల దెచ్చి మార్చితిని కంకర రాలుగా మంత్ర శక్తితో
    జెప్పుల జాగిలమ్ములుగ జేసితి ప్రేక్షకు లెల్ల మెచ్చగా
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్.

    రిప్లయితొలగించండి
  4. అప్పులను వచియింతురు నిప్పులంచు
    తప్పనరు గాదె చేయక తప్పనపుడు
    అప్పులను రూపుమాపెడు చట్టముండ
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ

    అప్పులు నిప్పులంచు పరిహాసపు మాటలు పల్కుటేలనో
    తప్పనలేరుగా జనులు తప్పకనప్పులఁ జేయు వారితోఁ
    నప్పులు తీర్చలేనపుడు హాయినిఁ గాచెడు చట్టముండగా
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. జప్పున నేర్చి మిక్కిలి పసందుగు గారడి విద్యలెన్నియో
      రప్పున రాళ్ళకుప్పలను రత్నపు రాసులొనర్చి చూపితిన్
      తిప్పలొకింతయున్ పడక తిమ్మిని బమ్మిగ మార్చివేసితిన్
      నిప్పులు జేత బట్టితిని నేర్పున మల్లెలు బంతి పూలగన్

      తొలగించండి
  6. దుష్ట సాంగత్యమును గూడి దురుసుతనఁపు
    చేష్టితము లనునిత్యము జేయుచున్న
    తమ్ముడొనరించు తప్పులఁ దాచియుంచి
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ

    రిప్లయితొలగించండి
  7. తప్పులమీద తప్పులను తమ్ముడు సేయుచునుండ వానికిన్
    జెప్పగ జూచినాడ చలచిత్తపు చేష్టలు మానుమంచు నే
    జెప్పిన మాటలన్ వినని శీనుని గాఁచుచు నిన్నినాళ్ళు నే
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్

    రిప్లయితొలగించండి
  8. తే॥ బ్రదుకు పూలబాట యగునె బవరమిలను
    గష్టనష్టములటు సైఁచి కదలుచుంటి
    భయము వీడి ధైర్య మొదవి బాధలనెడు
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ

    ఉ॥ ఒప్పక జీవితమ్మెపుడు నోర్పును బరీక్షఁ జేయుచుండెడిన్
    ముప్పున ధైర్యముంచుచును బోరును వీడక భంగ మొందకనన్
    దిప్పలు సైఁచి నిల్చితిని దీటుగ డీకొని బాధలందురా
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్

    భంగము ఓటమి డీకొను ఎదుర్కొను

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:హస్తసాముద్రికము జూచి నంత యొకడు
    "విప్లవపు బుద్ధి నీలోన వెలిగె" ననుచు
    బలికె నది సత్యమే విప్ల వమ్ము లనెడు
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ
    (సాముద్రికం గా అతనిలో విప్లవ లక్షణా లున్నాయి.అతను ఆ నిప్పులని చేత బట్టి నిలబడ్డాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:గొప్పగ మిత్రులందరును గూడగ పండుగ నాడు గొప్పలన్
    జెప్పుచు జిచ్చు బుడ్ల గొని చేతుల ద్రిప్పితి, బిల్ల వాండ్ర తో
    మెప్పును బొంద సంతసము మీర మతాబుల రవ్వ లానితిన్
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతిపూలుగన్”

    రిప్లయితొలగించండి
  11. (3)తే.గీ: పేరు గొప్పకు గాక నా విప్లవాగ్ని
    బ్రోది జేసి వ్రాసితి నగ్గి పూలు,గుండె
    మంటలన్ నేడు నీ సభా మండపమున
    నిప్పులం బూలవలెఁ జేత నిలిపినాఁడ
    (నే నేదో పాపులారిటీ కోసం రాసుకునే రచయితను కాను.విప్లవం కోసం "అగ్గి పూలు" "గుండె మంటలు" అనే విప్లవ గ్రంథాలు వ్రాసి ఈ మండపం లో నిలబడ్డాను అని ఒక రచయిత గ్రంథ పరిచయం చేసాడు.ఆ రెండు పుస్తకాల పేర్లలో నిప్పులే ఉన్నాయి.)

    రిప్లయితొలగించండి
  12. చేయరా దెగతాళి కొంచె మయిన నిను
    భస్మ మొనరించుఁ గోపము వడసె నేని
    యెవ్వ రనుకొంటి వీ యోగి నెడఁద నీవు
    నిప్పులం బూల వలెఁ జేత నిలిపినాఁడ

    [నిలిపిన వాడు+అ = నిలిపినాడ; నిలిపి నట్టి వాఁడె ]


    ఒప్పుగ నేఁ దపో మహిమ నుర్వినిఁ జేసితి వింత లెన్నియో
    త్రిప్పితి భూమి చక్రమును దీవ్ర రయమ్మున నీటి కుప్పలో
    నప్పుల నొక్క గ్రుక్క వెస నానితిఁ గొండలఁ బిండి సేసితిన్
    నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతి పూలుగన్

    రిప్లయితొలగించండి
  13. గారడి వాని ఉవాచ--=
    చెన్ను మీర గ గారడి న్ జేయు వాడ
    మధుర ఫలముల న్ రాళ్ళు గా మార్చ గలను
    రాళ్ళ నన్నిటి ఫలములై రహిగ మార్చి
    నిప్పుల o బూల వలె చేత నిలుపు వాడ

    రిప్లయితొలగించండి
  14. ఇప్పుడు చెప్పెదన్ వినుడు నిల్లును కట్టుటయన్న కష్టమే
    తిప్పల నెన్నియో బడితి తెచ్చితి పైకము నెల్లచోట్లనే
    నప్పులు చేసికట్టితిని హాయిగ నుండుడుపుత్రులార నే
    నిప్పుల చేత బట్టి తిని నేర్పున మల్లెలు బంతిపూలు గన్

    దివ్య దీపావళీ పర్వదినము నందు
    *నిప్పులను బూల వలె జేత నిలిపినాడ*
    తారలవలెవెల్గుచుధగధగమెరయగ
    బాణాసంచయు హెచ్చె సంబరము మదికి

    రిప్లయితొలగించండి