6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సమస్య - 5374

7-2-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను”
(లేదా...)
“రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సీతఁదెచ్చుట నిందించి, శ్రేయమొనర
    దాశరథి కొసంగుట మేటి ధర్మమనఁగ
    మూడి దుర్భాషలాడుచుఁ బొమ్మనంగ
    రావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెను

    ఉత్పలమాల
    కావరమెక్కువై మదిని కామము మీరగ నీచ భిక్షువై
    పావని జానకిన్ గొనియు బందిగ లంకకుఁ జేర్చుటన్నదే
    దీవరమన్ విభీషణుని దెప్పినయంతట కారుకూతలన్
    రావణుఁ ,డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!

    (రావణుఁడు, + ఏగుదెంచి)

    రిప్లయితొలగించండి
  2. జ్యేష్ఠుడైనను రాముని యెదిరి నిలిచె
    రావణుఁడు ; రామభక్తుఁడై ప్రణతులిడెను
    పిన్న వాడయినట్టి విభీషణుండు,
    అన్న దమ్ముల మధ్యన అంతరమిది

    రిప్లయితొలగించండి

  3. సంలయనమున నావిభీషణుడు గాంచె
    స్వప్నమొక్కటి యందు వాస్తవ మెఱంగి
    దనుజ జాతిని రక్షింప దలచి నట్టి
    రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను.


    ఆ వసతిన్ విభీషణుడు నంతిపురమ్ము శయించు వేళలో
    పావనభక్తుడై కనెను స్వప్నము నొక్కటి యందు రాఘవున్
    చేవనెఱంగి శీఘ్రమున సీతను రామున కప్పగించుచున్
    రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  4. భావములోన నిల్పి గరు
    వంబున లావును గూర్చు వానిగన్
    జేవను గొంచు నమ్మి విభు
    సేవయె జీవన మార్గమంచు సం
    భావిత నిశ్చలాత్మ ధృతి
    బైకొని, మారుతి, భక్తి రక్తి మి
    త్రావణుఁ, డేఁగుదెంచి రఘు
    రామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!


    మిత్ర+అవణుడు=మైత్రితో యొప్పువాడు (అవణు+ఒప్పు)

    రిప్లయితొలగించండి