7, ఫిబ్రవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 220 (భార్య పాదంబులకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

40 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి

    భార్య కోపము చల్లార్చ భర్త యొకడు
    భామ యలుకదీర్పగ పట్టె పాదములను
    కృష్ణు కంటెను మనమేమి గొప్ప యనుచు
    భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

    రిప్లయితొలగించండి
  2. ఏగిరొక జంట వల్లభ యోగి కడకు
    కలుగు సంతతి యని మౌని పలికినంత
    భార్యతో గూడి తద్దయు భక్తిఁ వల్లభార్య
    పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

    రిప్లయితొలగించండి
  3. నాల్గు మోముల నావాణి నాలపింప
    దలచి బ్రహ్మ చేగొనె వేదములను, శ్లోక
    పాదములయందు తనసతి పల్లివింప
    భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

    రిప్లయితొలగించండి
  4. ఫణి ప్రసన్న కుమార్ గారూ చక్కని పూరణ నిచ్చారు.

    రిప్లయితొలగించండి
  5. వరుడు తొడిగెను మెట్టెలు వధువు మెరయ,
    భార్య పాదంబులకు; మ్రొక్కి భర్త మురిసె
    సత్య దేవుని వ్రతమును సలిపి భార్య
    తోడ, మ్రోయగా కల్యాణ తూర్య ములును.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు భాషాభిమానికి తెలుగు తల్లి
    బొమ్మ తగని మక్కువ దెచ్చె పూజ సేయ,
    భార్య; పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె
    భారతమ్మను వేడె సౌభ్రాతృ దీప్తి !

    అయ్యలారా మన్నించండి. నేను సమైక్య వాదిని కాదు, ద్విరాష్ట్ర, త్రి రాష్ట్ర వాదిని కాదు. తెలుగు భాషాభిమానిని. ప్రజల మధ్య (మీ అందఱి వలె) సౌభ్రాతృత్వము నెలకొనాలని ఆశించే వాడిని.

    రిప్లయితొలగించండి
  7. భక్తి భావమ్ము మెండగు భర్త యొకఁడు,
    భార్య కవయిత్రి, వ్రాసెను పద్యమొకటి,
    తేట గీతి పాదములను తెచ్చి జూపె
    భార్య, పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె!!

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రి గారూ ! మీ పూరణ బావుంది !
    కాని ఒక భర్తకే పరిమితం చెయ్యడం ?
    అబ్బే !బాలేదు !!!
    భర్త లందరి పరిస్థితీ అదే గదా
    భార్య అలిగి నప్పుడు !!!!!

    ఫణి గారూ !
    మీ పూరణ బాగానే వుంది గాని
    ఎవరు ఎవరికి మొక్కారో ?
    కొంచెం సందిగ్దం నెలకొంది !

    శ్రీపతి గారూ ! బావుంది !
    వాణికి బ్రమ్మేంటి వాడి బాబైనా మ్రొక్క వలసిందే !
    మూడవ పాదంలో "పల్లవింప"గదూ !
    టైపాటనుకుంటా !

    మిస్సన్న మహాశయా !బావుంది!
    భార్య పాదాలకు మెట్టెలు !
    సత్యదేవునికి మ్రొక్కులు !

    మూర్తి గారూ ! బావుంది !
    భారతమ్మకు మ్రొక్కులు !
    అందరం పెట్టి తీరాలి !

    జి ఎస్ జీ !
    తేటగీతి పాదాలకు మ్రొక్కులా !
    భార్యక్కాదా ? బావుంది !

    రిప్లయితొలగించండి
  9. మూర్తిగారూ !
    ఏంటిది ?గో*పి లాగ !
    ఇప్పుడే గదా భారతమ్మకు మ్రొక్కులు పెట్టించారు !
    ఏదో ఒక వాదాన్ని సమర్ధించండి !

    ఇది ప్రజాస్వామ్య దేశం !
    ఎవరి అభిప్రాయాలను వాళ్ళు
    నిర్‌భీతిగా వెల్లడించ వచ్చు !

    ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో శ్రమకోర్చి
    నయాన్నో భయాన్నో ఒప్పించి 500 పై చిలుకు ఉండే సంస్థానాలను
    భారత దేశం లో విలీనం చెయ్యడం జరిగింది !

    దాన్ని మళ్ళీ ఇప్పుడు ముక్కలు చెక్కలూ చెయ్యడం?!
    ఎంతవరకూ సమంజసం ?????

    చిన్న రాష్ట్రాలు ఏర్పాటైతే ఎవరికి లాభం ?
    అతి కొద్దిమంది రాజకీయ నిరుద్యోగులకు తప్ప

    ప్రజల కేమన్నా ఒరుగుతుందా ???

    ప్రజలకు కావలసిన వన్నీ చిన్న రాష్ట్రాలైపోతే
    ఆకాశాన్నుండి జారి పడతాయా !
    వాళ్ళకు కావలసింది
    కూడు , గుడ్డ , నీడ , !!!ఇంతేగదా !
    అవి తీర్చడానికి ప్రయత్నించాలి గాని !


    ఇప్పుడు తెలంగాణా ఇచ్చేస్తే అవన్నీ వచ్చేస్తాయా ?????
    రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా సమస్యలు అలానే ఉంటాయి!
    పైగా ఇంకో పెద్ద ముప్పేమిటంటే -
    అది తెలంగాణా తో ఆగుతుందా ???
    దేశంలో ఎన్నో చోట్ల చిన్న రాష్ట్రాల demand ఉంది.
    అవన్నీ ఇవ్వాలి !
    ఇస్తే భారత దేశ పరిస్థితేంటి ???
    మళ్ళీ 500 పై చిలుకు ముక్కలు ! అంతే గదా !

    సమగ్రత ,సమైఖ్యత లోపిస్తే , దేశ స్వాతంత్ర్యం ఏమౌతుంది ?

    అప్పుడు భారతమ్మకు మ్రొక్కగలరా????????????????????

    రిప్లయితొలగించండి
  10. *సీ*
    భార్య యన్ననెవరు - ప్రాణముల నయిన
    పతిదేవు కర్పించు - పడతి గాదె !

    భార్య యన్న నెవరు - బహు కష్టములనైన
    భర్తను ప్రేమించు - భామ గాదె !

    భార్య యన్న నెవరు - బాధలెన్నిటినైన
    వరియించి భరియించు - వనిత గాదె !

    భార్యయన్న నెవరు - బంధు వర్గము లోన
    నిస్వార్థ ముగనిల్చు - నెలత గాదె !

    తే*గీ
    భార్య యన్నను భర్తకు - భాగ్య లక్ష్మి!
    సంతు నిడి , వంశమునునిల్పు; - సంప దిచ్చు;
    ననుచు తలపోసి , తలవాల్చి, - నాత్మ యందు
    భార్య పాదంబులకు మ్రొక్కి - భర్త మురిసె !

    రిప్లయితొలగించండి
  11. 02)

    *సీ*

    హితము గోరునెపుడు ! - హితమునే జెప్పును !
    వెతలందు సుఖమిచ్చు ! - బెట్టు నిచ్చు !

    కష్ట సుఖము లందు - నష్ట కాలము నందు
    ఇష్ట పూర్వకముగ - నిష్ట పడును !

    రోగమొచ్చిన , యను - రాగము నొలికించు !
    సిరులున్న , లేకున్న - సేవ జేయు !

    ఆకలి దీర్చెడు - నాలియే నిజముగా
    మాత పిమ్మట నంత - మాత సమము !

    తే*గీ

    దుష్టు డైన , జూదరయిన - నిష్ట పడును !
    నష్ట జాతకు డయినను - కష్ట పడదు!
    అట్టి భార్యకు నేనేమి - పెట్ట గలను ?
    భార్య పాదంబులకు మ్రొక్కి - భర్త మురిసె !


    బెట్టు = ధైర్యము

    రిప్లయితొలగించండి
  12. వసంత మహోదయా మీ సీసాలు సమోసాల్లా మాంచి రుచిగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ...ధన్యవాదాలు.ప్రతి భర్తా ఆ ఒక్కడు నేనె అనుకుంటే సరిపొతుంది.ఇక మీరు భార్యకు ఎంత పెద్ద పీట వేసారో.మీరు వ్రాసిన 'భార్య పాదాలు ' చదివితే ఏభర్త ఐనా 'భార్య పాదాలు 'మ్రొక్కవలసిందే.అబినందనలు.
    ప్రసన్న కుమర్, శ్రీపతి,మిస్సన్న, మూర్తి, సత్యనారయణ గార్ల పూరణలు రసస్వత్తరంగాఉన్నావి. అందరికి అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న మహాశయులకు
    శాస్త్రి గార్లకు వందనా సహిత
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి.

    బ్లాగు నందు చదివి కిశోర్ పద్యములను
    'ఆలయాన ' యనెడిపాట నాలకించి
    ఆలి గొప్పతనమునెంచి ఆత్మలోన
    భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

    రిప్లయితొలగించండి
  16. కిశోర్ జీ శంకరాభరణమును వివిధ ప్రాంతాలలోనే కాక వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారు తెలుగు భాష,పద్యకవితలపై గల మమకారముతో సందర్శిస్తారు. మనందఱినీ కలిపేది తెలుగు భాష,తెలుగు సంస్కృతి. అందుచే తెలుగు భారతిని నుతించడము భావ్యమే. కాకపోతే అంతకు మించి చర్చలు జరుపడానికి యిది వేదిక కాదు.విభిన్న అభిప్రాయాలకు స్ఠానము ఉండడము ఒకరి అభిప్రాయాన్ని మరి ఒకరు గౌరవించ గలగడము అవసరమే.. పరాయి దేశములో మనుగడ సాగిస్తున్నాను అంటే దానికి కారణము నా వ్యక్తిగత స్వేఛ్ఛకు భంగము లేకపోవడమే.భిన్నత్వములో ఏకత్వమంటారు, ఆ ఏకత్వానికి మూలము సౌభ్రాతృత్వము. మరి నరసింహ మూర్తిని ' పిల్లి ' అనేసారు ! వసంతా ! తగునా యిది మీకు ?

    రిప్లయితొలగించండి
  17. కిశోర్ జీ మీ పద్యాలు సమోసాలే కాదు చక్కగా వేడి పకోడీల లాగ ఉన్నాయి ( మా కిక్కడ చలి చంపేస్తున్నాది ). నేను చెప్పలేక పోయాను. మీరు చక్కగా చెప్పారు. భేష్! సెహభాష్ !

    రిప్లయితొలగించండి
  18. మరైతే నర*సిం*హం* గారూ !
    ఇటో అటో ఎటో దూకండి ధైర్యంగా !

    రిప్లయితొలగించండి
  19. వసంత కిశోర్ జీ ఒకటైనా,రెండయినా,మూడయినా సామాన్య ప్రజలకు ఒరిగేదీ లేదు,తరిగేదీ లేదు అని నా అభిప్రాయము. నాకు పెట్టుబడులు లేవు, రాజకీయాలు అక్కఱ లేదు. భారత దేశములో ప్రజలు యిఛ్ఛ వచ్చిన చోట బ్రతక గలగాలి అని మాత్రము నమ్ముతా.

    రిప్లయితొలగించండి
  20. నరసింహమూర్తిగారూ ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  21. అయినా కిశోర్ జీ యిటు దూకేసాగా, అక్కడ డాన్సు చేయ లేక !

    రిప్లయితొలగించండి
  22. తాను పట్టిన కుందేలు తలలు రెండు
    యంచు భీష్మించి కూర్చున్న యతివ జేర
    సామ దాన భేదాదులు సాయపడక
    భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.

    రిప్లయితొలగించండి
  23. పెద నాన్న(హనుమఛ్చాస్త్రి) మీ రెండవ పూరణ అదిరింది...................
    మీ
    ఫణి

    రిప్లయితొలగించండి
  24. హరిగారూ.. దండం (దండోపాయం)బదులు దండము సాయపడిందన్నమాట.బాగుంది

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  25. గురువు,గురుభార్య,శిష్యుని కొడుకు వోలె
    ప్రేమగా చూచుకొందురు ప్రీతి; నటులె
    శిష్యు డే కార్యమైనను చేయు గురుని
    భార్య పాదంబులకు మ్రొక్కి- భర్త మురిసె!

    రిప్లయితొలగించండి
  26. గోలి హనుమచ్ఛాస్త్రి.

    మెట్టెలను నెటతొడుగు చేపట్టు వాడు?
    కోర్కెనెట్టుల పరమేశు కోరవలయు?
    ఇంతి గర్భమ్ము దాల్చిన యెవరు మురిసె?
    భార్య పాదంబులకు,మ్రొక్కి,భర్త మురిసె.

    రిప్లయితొలగించండి
  27. కవి మిత్రు లందరికీ వందనం.
    మా మనుమని మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికై వరంగల్ వచ్చి ఉన్నాను.
    నిన్న క్రొత్త సమస్యను పోస్ట్ చేద్దామని నెట్ కేఫ్‌కు వస్తే జిమెయిల్ ఓపెన్ అయింది కాని "శంకరాభరణం" బ్లాగు ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. చివరికి నా అశక్తతను తెలియజేస్తూ వ్యాఖ్య పెట్ట వలసిందిగా కోరుతూ "మిస్సన్న" గారికి మెయిల్ పెట్టాను. వారు దానిని చూడలే దనుకుంటాను.
    ఈరోజు పది నిమిషాల వ్యవధి దొరికితే ఈ నాటి సమస్యను పోస్ట్ చేసాను.
    ఈ సాయంత్రానికి హైదరాబాదు చేరుకుంటాను. అప్పుడు వివరంగా మీ మీ పూరణలను పరిశీలిస్తాను.
    అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. ధ్వన్యలంకారదివ్యకథాయుతఘన
    కావ్యకల్పనాచాతురీగరిమనొప్పుఁ
    గవి కృతినిడఁగ నా కవి కమలభవని
    భార్యపాదంబులకు మ్రొక్కి భర్త ముఱిసె :)

    రిప్లయితొలగించండి
  29. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలలో మొదటిది బాగుంది. రెండవది ఉత్తమం. మూడవది అత్యుత్తమం. అభినందనలు.
    మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది. "కృష్ణు కంటెను తనగొప్ప కేమి కొదవ" అంటే సరి.

    ఫణిప్రసన్న కుమారు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    సనత్ శ్రీపతి గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ అదిరింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు. తెలుగు నేల ఏ ప్రాంతానికి చెందిన వారికైనా "తెలుగుతల్లి" ఒక్కరే, పూజనీయురాలే.

    జిగురు సత్యనారాయణ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. వసంత్ కిశోర్ గారూ,
    మనది తెలుగు పద్యానికి చెందిన బ్లాగు. తెలుగు పద్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరిదీ. ఇక్కడ ప్రాంతీయభేదాలకు తావు లేదు. వేర్పాటు, సమైక్య వాదనల చర్చలకు అవకాశమున్న బ్లాగులు చాలా ఉన్నాయి. వాటిలో పరస్పరం అవమానకరమైన వ్యాఖ్యలు, అశ్లీలమైన వ్యక్తి దూషణలు చూసి బాధపడుతూ ఉంటాను.
    మన బ్లాగును వివాదాలకు అతీతంగా, రాజకీయాలకు తావు లేకుండా కొనసాగిద్దాం.

    రిప్లయితొలగించండి
  32. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు సీస పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
    "సంపదిచ్చు" అనేది "సంపద నిడు", "రోగమొచ్చిన" అనేది "రోగియైనపు డనురాగము" అంటే సరి.

    హరి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    బ్రహ్మాండంగా ఉంది మీ పూరణ. ధన్యవాదాలు.

    రాఘవ గారూ,
    దీర్ఘసమాస విలాసం అలరించింది మీ పూరణలో. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. శంకరార్యా !మన్నించండి !
    మూర్తిగారు ఏదో వ్రాస్తే
    నేను కొంచెం ప్రతిస్పందించాను !

    అసలే బ్లాగులో ఏం జరుగుతుందో
    కూడా నాకు తెలియదు.

    పద్యాల గురించో తెలుగు భాష గురించో
    కనబడితే చదువుతాను.
    లేదంటే
    అక్కడేముందో కూడా చదవను.

    రిప్లయితొలగించండి
  35. వసంత్ కిశోర్ గారూ,
    సంతోషం! మన బ్లాగును వివాదాలకు అతీతంగా కొనసాగిద్దాం. అందుకు సహకరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. తే. గీ.
    అందచందాల రాణి నా యాలి యనుచు
    చదువు సంస్కారమున్నట్టి సతిగనెంచి
    కనక వర్షమ్ము గురిపించు కాంతగాను,
    (భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె!!)

    రిప్లయితొలగించండి
  37. తే. గీ. :
    నిత్యము కొలుచు భగవంతునే యతండు
    పతి ననుసరించు నాతని పత్నిగూడ
    దేవికి, యలంకరణ చేసె దివ్యముగను
    భార్య, పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె

    రిప్లయితొలగించండి