15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 227 (మునికి క్రోధమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

24 కామెంట్‌లు:

  1. అంతకుండైన మేటి నియంత యతడు
    కాలుడాతండు భీకరాకారుడతడు ;
    పాశధరుడైన సమవర్తి వాడె , ఆ య
    మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము!!!

    రిప్లయితొలగించండి
  2. ధర్మచిహ్నమౌ వృషమైనఁ దనకు హాని
    జఱుగఁ గొమ్ము విసరుఁ గాదె జపతపముల
    కంతరాయంబు నెవరైనఁ గలుగజేయ
    మునికిఁ గ్రోధమ్ము భూషణంబనుట నిజము.

    రిప్లయితొలగించండి
  3. కలికి ముత్యమ్ము ,వజ్రమ్ము,కాంచనమ్ము
    హరికి కస్తురి తిలకమ్ము, హరుకు గౌరి
    యతికి శాంతమ్ము,సత్యమ్ము,నీతి,నాయ
    మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము!

    రిప్లయితొలగించండి
  4. రెండు దినములు సెలవిండు రేపు,మాపు

    వెళ్ళ వలయును కలదులే వేడుకొకటి ,
    మళ్ళి వచ్చెద , పూరింతు మనుసు బెట్టి
    ఇదియె నా సెలవు పత్రము .ఇట్లు మంద.
    సంత సించెద గురువులు సరియు ననగ
    అయ్యో
    ఎక్కు వైనవి పాదములేమి సేతు ?

    రిప్లయితొలగించండి
  5. శాంత మాకారమై యొప్పు జానకి పతి
    కృద్ధుడై రావణుని జంపి కీర్తి పొందె.
    రమ్య గుణధామ రఘురామ రాజసత్త
    మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

    రిప్లయితొలగించండి
  6. తాను నటియించు చిత్రముల్ కనుల విందు
    తాను రాజకీయము సేయ దడిసె ఢిల్లి
    అతడు తెలుగు జాతికి అన్న; అట్టి ఉత్త
    మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

    రిప్లయితొలగించండి
  7. డా. విష్ణు నందన్ గారూ,
    చక్కని పూరణ. ధన్యవాదాలు.

    రాఘవ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "హరుకు గౌరి" అనడం కంటె "హరునకు నుమ" అంటే బాగుంటుంది.

    చింతా రామకృష్ణారావు గారూ,
    మనోహరమైన పూరణ నిచ్చి ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.

    హరి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    మీదు సెలవు పత్ర మిదె యామోద మందె,
    వెడలి వేడుకఁ బాల్గొని వేగ వచ్చి
    నూతనోత్సాహ మొప్పఁగఁ గైత లిచ్చి
    మాకు మోదంబు గూర్తురు మంద వారు!
    పాద మెక్కువ యైన లోపమ్ము లేదు,
    పంచ షట్ సప్త పాదుల వ్రాయవచ్చు.
    "సరియు ననఁగ"కు సరి రూపు "సరె యనంగ".

    రిప్లయితొలగించండి
  9. రామ బంటుకు, సీతా లలామ శోక
    హరునకు , కపికి, లంకా దహనునకు, ఘన
    నుత చరితునకు, భక్త హనుమకు, శివ స
    మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి.

    క్రొత్త కవిమిత్రులు చింతా వారికి స్వాగతం.వివిధ విధములుగా ఫూరణలు చేసిన మిత్రులందరికి అభినందనలు.
    ----------------------------------------

    పరగ వేదపఠన ప్రీతి బ్రాహ్మణునకు,
    సతికి ధవసేవ సతతము,శత్రువు నట
    సమర మందున నెదిరించు సైనికోత్త
    మునికి క్రోధమ్ము, భూషణమ్మనుట నిజము.

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "పఠానప్రీతి" అన్నప్పుడు "న" గురువై గణదోష మౌతుంది. "పఠనా రతి" అందాం.
    అన్నట్టు ... చింతా వారు మన బ్లాగుకు పాతకాపులే. అసలు నేను మొదట్లో వారి "ఆంధ్రామృతం" బ్లాగులో వారిచ్చే సమస్యలను పూరిస్తూ ఉండేవాణ్ణి. "శంకరాభరణం" బ్లాగుకు వారు, డా. ఆచార్య ఫణీంద్ర గారలు మార్గదర్శకులు. వారికి సదా కృతజ్ఞుణ్ణి.

    రిప్లయితొలగించండి
  12. ఈరోజు వసంత్ కిశోర్ గారూ, మిస్సన్న గారు మరికొందరు కవిమిత్రులు "ఆబ్సెంట్" అయ్యారు. ఎందుకో?

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారూ.. మీరు సూచించిన సవరణకు,అబినందనలకు కృతజ్ఞుడను.'వైదికాచారమ్ము ' అంటే ఎలా ఉంటుంది.పరిశీలించగలరు.నేను మీ పద్యశాలలో క్రొత్తగా చేరుటవలన పాత మిత్రుల విషయములు తెలియదు.మీరు తెలియజేసినందులకు ధన్యవాదములు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.

    ఉదయం నుండీ కరెంటు లేక
    మిత్రుల దర్శనానికి దూర మయ్యాను !

    01)
    ______________________________________

    తండ్రి నూరక జంపిన - ధరణి పతుల
    నిరువ దొక్కమార్లు తిరిగి - నిలను;నరికె
    పాపుల వెదకి; పుణ్యుండు; - పరశు రామ
    మునికి క్రోధమ్ము , భూషణ - మ్మనుట నిజము !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  15. భుజగ శయనంబు హరికిని భూషణంబు
    వెండి కొండను శివుడుండు మెండుగాను
    హంస వాహను డుండగ యా సొరగమందు.
    మునికి క్రోధమ్ము భూషణమ్మనుట నిజము

    రిప్లయితొలగించండి
  16. 02)
    _______________________________________

    సృష్టి కంతకు ప్రతిసృష్టి - సేయ గలుగు !
    పుడమి గాయత్రి మంత్రము - ప్రోది సేసి
    వినుతి, కెక్కిన బ్రహ్మర్షి - విశ్వ మిత్ర
    మునికి క్రోధమ్ము , భూషణ - మ్మనుట నిజము !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  17. 03)
    ________________________________________

    తపము నందున్న సమయమ్ము - తండ్రి మెడను
    పరమ నేహ్యము గలిగించు - బాము శవము
    నిడిన రాజుకు , శాపమ్ము - నిచ్చె ! శృంగి !
    మునికి క్రోధమ్ము , భూషణ - మ్మనుట నిజము !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  18. 04)
    _________________________________________

    వేద వేద్యుని నిలయందు - వెంకటేశ్వ
    రునిగ ,కలియుగాన నిలుపు - రూఢి జేత
    వెన్ను దన్నెను; గోపించి- వేది భృగువు !
    మునికి క్రోధమ్ము , భూషణ - మ్మనుట నిజము !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  19. అంబరీషుని వృత్తాంత మవధరింప
    నవగతంబగు నొక్కటి హాని చేయు
    మునికి క్రోథము, భూషణ మ్మనుట నిజము
    తాపసుల కిల శాంతము తరచి చూడ.

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న మహాశయా !శుభోదయం !
    మీ దారిలోకేవస్తున్నాను.చూడండి.

    చిన్న సవరణతో :

    05)

    ____________________________________________


    సకల మతముల సారము - సంగ్రహించి
    కామ క్రోధ లోభము , లోను - గాక , మోహ
    మందు మునుగని వాడెబో - మౌని యన్న !
    మునికి క్రోధమ్ము , భూషణ - మ్మనుట నిజమె ?
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సవరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ ఐదు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. నిన్న మీరు ఆబ్సెంట్ అయ్యారనుకున్నాను. లేట్ కమర్ అన్న మాట!
    ఐదవ పూరణలో "కామ క్రోధ" అన్నప్పుడు "మ" గురు వవుతుంది. "వైరి షడ్వర్గమునకు లోఁబడక" అందాం.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    "యా సొరగమందు" అనేదే పానకంలో పుడకలా ఉంది.

    మిస్సన్న గారూ,
    ఆలస్యంగా నైనా మంచి పూరణ పంపారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి