22, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 234 (చెడు గుణములతోడ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెడు గుణములతోడ శిష్టుఁ డలరె.

30 కామెంట్‌లు:

 1. సర్వజనులయందు సారస్యములనుఁ గాం
  చెడు నడువడిఁ గలిగి జెలిమిచేతఁ
  గలిపికొనుచుఁ బండితుల మనంబులను దో
  చెడు గుణములతోడ శిష్టుఁ డలరె

  రిప్లయితొలగించండి
 2. రాఘవ గారూ,
  వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "కలిగి" తరువాత సరళాదేశం రాదు. "కలిగి చెలిమి" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్యగారూ, "చ" టంకించబోయి "జ" టంకింటాను. టైపాటును మన్నించఁగలరు.

  రిప్లయితొలగించండి
 4. దరికిఁ జేరు శిష్య వరభావ సంపత్తి
  గురువు కోరు. నాదు దరికి చేరి
  విద్య నభ్యసించెఁ బ్రీతి. నను మురిపిం
  చెడు గుణములతోడ శిష్టుఁ డలరె.

  రిప్లయితొలగించండి
 5. మానవాళి సేవ మాధవసేవయే
  భూత దయను మించి నీతి లేదు
  అనియె గాంధి ; సకల జనులకు ప్రేమ పం
  చెడు గుణములతోడ శిష్టుఁ డలరె !!!

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు

  రాఘవ గారూ !
  మనసు దోచేసేరు !

  చింతావారు , బహు
  చక్కగా మురిపించారు !

  విష్ణు నందనా ! సుందరా !
  ప్రేమ పంచుటలో మీకు మీరే సాటి !

  _________________________________________

  01)

  శంకరా భరణము - శంకరయ్య , దినము
  విధిగ దలచి , క్రమము - విడువ కుండ
  ఇక్కట్లు కలిగినను - ఇంటి వెలుపలున్న
  తెలుగు భాష దీప్తి - ధ్యేయ మంచు

  02)

  కవిత లల్లు కొఱకు - కైపదములనిచ్చు !
  సభ్యు లైన వారి - సాన బట్టు !
  వెలుగు నట్లు తెలుగు - వివిధ దేశంబుల
  శిష్యులందరికిని - శిక్షణిచ్చు !

  03)

  పదియు నారు కోట్ల - ప్రజలు మాట్లాడెడి
  భాష కేమొ ముప్పు - వచ్చె నంట !
  అంతరించ బోవు- అన్య భాషల తోడ
  చేరె నంట తెలుగు - చిత్ర మిదియె !

  04)

  క్రమము దప్ప కుండ - శ్రమ యని ,యనకుండ
  తెలుగు, తేజ రిల్ల - ధరణి యందు
  విశ్వ మందు నున్న - వేలాది లక్షల
  తెలుగు జనులు; కీడు - దీర్చు కొఱకు
  05)

  తెలుగు త్రాగ వలయు - తెలుగునే, తినవలె
  పీల్చ వలయు; తెలుగు - పేరు గాంచ !
  కార్య , కర్మ ములను - కార్యాలయ ములను
  పనులు తెలుగు నందె - పార వలయు !

  06)

  కన్న తల్లి వలెనె - కన్న భాషను గూడ
  గార వించ వలెను - గర్వము గను !
  తెలుగు నాదు కోండి - తెలుగునే వ్రాయండి
  తెలుగు చదువు కోండి- తెలుగు లార !

  07)

  పూర్వ జన్మ మందు - పుణ్యంబు వల్లనే
  జన్మ కలిగె తెలుగు - జగతి యందు
  అనుచు తలచి ప్రతి - ఆంధ్రుడు తనవంతు
  సేవ, తెలుగు కొఱకు - సేయ వలెను !

  08)

  కమ్మగాను జెప్పు - కైతల నాతండు !
  పట్టు వదల నట్టి - పరమ గురుడు !
  దీన జనుల దిక్కు - దేవుడే యందురు !
  తెలుగు భాష దిక్కు - త్రిపుర వైరి !

  09)

  తెల్ల వారు వెంట - దిన కరు తోడనే
  శంకరయ్య వెలుగు - శం*భ మందు(నందు)
  పార జేయు నెన్నొ - పద్యముల, నలరిం
  చెడు గుణముల తోడ - శిష్టుఁ డలరె.

  _________________________________________

  త్రిపురవైరి = శంకరుడు
  పారు = ప్రవహించు
  శం*భ = శం కరా భ రణము
  __________________________________________

  రిప్లయితొలగించండి
 7. చెడు గుణములు వీడు, చేటు పనులకెల్ల
  దూర ముండు మనిన , దుష్టు డలిగె !
  గురువు బాట జూప, గుర్తించి ముదము బెం
  చెడు గుణముల తోడ శిష్టు డలరె!

  (ముదము బెంచెడు గుణములు = మంచి మార్కులు.
  చెడు, మంచిమార్గముల బట్టిన విద్యార్థులకు గల తేడా . )

  రిప్లయితొలగించండి
 8. రాఘవ రసమయ కవిత, య
  మోఘము విష్ణుని కవిత. ప్రమోదమగు కిశోర్
  శ్లాఘింప దగిన కవితయు
  మాఘాదులఁ గుర్తు చేసె మధురములగుచున్

  రిప్లయితొలగించండి
 9. పీతాంబరుండువ్రాసిన
  వ్రాతను కనుగొనగ కవిత ప్రస్ఫుటమయ్యెన్.
  ప్రీతిని గొలిపెను. గన వి
  ఖ్యాతిని కలిగించు నిజము కందిసుధీశా!

  రిప్లయితొలగించండి
 10. ఆంధ్రామృతం లో ఇవ్వఁ బడిన సమస్యను కూడా పూరింప సామర్ధ్యము గలవారు మీరంతా్యత్నిస్తారేమోననే భావనతో వివరిస్తున్నాను.
  http://andhraamrutham.blogspot.com

  రిప్లయితొలగించండి
 11. చింతా రామకృష్ణారావు గారూ,
  మురిపించెడు గుణాల మీ పూరణ బాగుంది. మీ ప్రశంసా పద్యాలకు పాత్రులైన కవి మిత్రులు ధన్యులు. మీకు నా పక్షాన, కవి మిత్రుల పక్షాన ధన్యవాదాలు.

  చింతాన్వయ భూషణ! పరి
  కించితి పద్యముల; రామకృష్ణా రావూ!
  ఎంతయొ మీ కృప; నాకున్
  చింతా కంతైన చాలుఁ జేర్చు హితమ్మున్.

  రిప్లయితొలగించండి
 12. డా. విష్ణు నందన్ గారూ,
  ప్రేమ పంచెడు గుణాలతో మీ పూరణ మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

  వసంత్ కిశోర్ గారూ,
  నవ రత్నాలతో నన్ను అలంకరించారు. సంతోషం! ధన్యవాదాలు. ప్రస్తుతం ఆ పద్యాల దోషాన్వేషణ చేయడం లేదు. అయినా మెచ్చుకొండం మీ అందరి వంతు, తప్పులు చూపి మిమ్మల్ని నొప్పించడం నా వంతు అవుతున్నది. `పితరు భాష` ఎంతటి చర్చకు దారితీసిందో చూసారు కదా. ఈ విషయంలో డా. విష్ణు నందన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
  ఎంతైనా మీవి "అలరించెడు గుణాలు" అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మంద పీతాంబర్ గారూ,
  ముదము పెంచెడు గుణాల మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. నా పూరణ ...........

  దూషణముల నందె దుష్టుండు పీడించు
  చెడు గుణములతోడ; శిష్టుఁ డలరె
  దైవభక్తి సత్ప్రవర్తన దయ లను
  సద్గుణములతోడ సంతసమున.

  రిప్లయితొలగించండి
 15. చింతా వారికి ధన్యవాదములు !

  శంకరార్యా !
  ఇందులో మీరు బాధ పెట్టేదీ,మేం నొచ్చుకునేదీ ఏం వుంది !
  నిజానికి మీరు వ్యాఖ్యలు పెట్టకుండా
  తప్పులు దిద్దకుండా వున్న రోజే మాకు నిజంగా బాధ కలిగేది !
  వెనుక ఎన్నొ పూరణలు మీ వ్యాఖ్యలు లేకుండా మిగిలి పోయినవి !
  నేను చాలా రోజుల నుండీ అనుకొంటున్నాను
  "మీరు రోజూ కొత్త దానితో పాటూ కనీసం ఒక్కటైనా
  పాతది చూస్తే బాగుండునని"
  ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తుంటాను కూడా !
  మీరొక వారం రోజులు వ్యాఖ్యలు పెట్టడం మానేస్తే ఈ
  బ్లాగులో ఒక్క పురుగు కూడా మిగలదు !
  లేదా
  మీరు తప్పులు దిద్దకుండా అందరీకీ చాలా బావుంది
  అనే వ్యాఖ్య మాత్రమే పెట్టి చూడండి !
  అప్పుడూ అదే పరిస్థితి!
  చింతా వారి లాంటి ఒకరిద్దరు తప్ప ఇక్కడున్న వాళ్ళంతా ఎవరు ???
  ఇంజనీర్లు ,డాక్టర్లు,తదితరాల వాళ్ళే గాని
  తెలుగు భాషలో పండితులు గాని, అధ్యాపకులు గాని
  విధ్యార్థులు గాని--భాషా వృత్తిలో వున్న వాళ్ళొక్కరు కూడా లేరు !
  తెలుగు భాషాధ్యయనం చేసే వాళ్ళు ఎవరూ ఇక్కడ కనుపించరు
  కనిపించే వాళ్ళంతా హైస్కూలు తోనే తెలుగును విడిచిన వాళ్ళే !
  మేమంతా మిమ్మల్ని గురువుగా భావించి మిమ్మల్ని అనుసరిస్తున్నాము !
  గురువన్నాక అవసరమైనపుడు తిట్టాలి కొట్టాలి
  అప్పుడే గదా మేమూ మా చదువూ బాగు పడేది !

  మీకన్నా ముందు ఎన్నో సమస్యా పూరణం site లు ఉన్నాయి !
  మీరు కూడా పూరించేవారు !అవన్నీ ఏమైనవి ?ఎందుకైనవి ?

  బహుశా నేను పైన చెప్పిన కారణాల వల్లనే అనుకుంటున్నాను !

  చర్చ విషయానికొస్తే -ఆరోగ్య కరమైన చర్చలేగదా అవి !
  మాకు అవసరం కూడానూ !
  ఒకరి విఙ్ఞానం -అందరం పంచుకుంటున్నాము !

  నవ రత్నాలలో-(2) చూడండి అందులో
  "సాన బట్టు - శిక్షణిచ్చు" అన్న పదాల్ని వ్యర్థ పదాలు చెయ్యకండి !

  మా చిన్నప్పుడు మేమే స్వయంగా వెళ్ళి ఈత చెట్ల వద్ద
  ఆకులు కోసి తీసుకెళ్ళి మాష్టారు కిచ్చి ,వాటితోనే కొట్టించుకునే వాళ్ళం !

  ఈ రోజు ఈమాత్రం వ్రాయ గలుగు తున్నా మంటే -
  ఆ మాష్టర్లు ---వారిచ్చిన శిక్షణ-- ఈతబెత్తాలే ---కారణం !
  అందుచేత మీరు మీ post mortem ఇంకా
  ఉధృతం చెయ్యాలని నా మనవి !

  వినూత్నమైన మీ పూరణ
  మాకు మార్గ దర్శకంగా ఉంది !

  రిప్లయితొలగించండి
 16. వసతకిశోర్ గారు మీ మాటలలోని ప్రతి అక్షరమూ సత్యం.

  రిప్లయితొలగించండి
 17. కవి పండితుల పూరణల మధ్య నా పూరణలు ఉండడమే గౌరవంగా భావించే నాకు,కవి పండితులైన శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి పద్య రూపక ప్రశంస ఏంతో ఉత్సాహాన్ని కలుగజేసింది .చాలా సంతోషం వేసింది వారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు .

  శ్రీ వసంత కిశోర్ గారన్నట్లు కేవలం హైస్కూల్ వరకు మాత్రమే తెలుగు చిదవి,వదిలేసి మళ్లీ శంకరాభరణం బ్లాగు చలువ వల్ల, భాషా పరమైన ఎన్నో పరిమితులకు లోబడి వ్రాస్తున్న మాకు గురువుగారి వ్యాఖ్యానాలు లేని దినము ఏదో వెలితి గానే ఉంటుంది, మేము చేసే తప్పులేవో తెలియకుండా పోతుంది ,అవే ఒప్పులనుకొనే ప్రమాదం కూడా ఉంది . ఈ మధ్య చోటు చేసుకొంటున్న చర్చలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి

  రిప్లయితొలగించండి
 18. రామ కృష్ణారావు గారి ప్రశంసా పద్యాలు కడుంగడు ప్రశంసనీయంగా ఉన్నాయి.
  రాఘవ,రామకృష్ణా రావు, పీతాంబర్, గురువు గార్ల పూరణలు అద్భుతంగా ఉన్నాయి.
  వసంత మహోదయుల నవ రత్నాలు చక్కగా ప్రకాశిస్తున్నాయి.
  విష్ణు నందను గారి పూరణ షరా మామూలుగా సుందరంగా ఉంది.
  ఆ పూరణలోని భావాన్ని చౌర్యం చేస్తూ నా పూరణ:

  నరుని సేవ యొకటి నారాయణుని సేవ
  దయయె మనిషికి గల దైవ శక్తి
  యనుచు పలికె పరమ హంస! తా నాచరిం-
  చెడు గుణములతోడ శిష్టుఁ డలరె!

  (రేపు శ్రీ రామ కృష్ణ పరమ హంస జయంతి)

  రిప్లయితొలగించండి
 19. ఈ రోజు ఉదయం విద్యుత్ ప్రసారంలో అంతరాయం వలన ఆపై కార్యాలయ పని వత్తిడి వలన మన "కవన విజయం" (చిన్న భువన విజయం లాటిదే మన 'శంకరాభరణం 'అని అలా అన్నాను )సమావేశంలో పాలు పంచుకోలేకపోయాను.మిత్రుల అందరి పూరణలు అలరించు చున్నవి.అరోగ్యకరమైన చర్చలు మాబోటి వారలకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. కవి మిత్రులకు అభినందనలు.ఓర్పుతో సమన్వయించుచున్న శంకరం మాస్తారు గారికి ధన్యవాదములు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 20. ఎట్టి వారికైన నించుక కూడని
  కోప తాపములును కూడి వచ్చె
  గాధి సుతునకు ఋషి గావెలయ,ఘనుడా
  చెడు గుణములతోడ శిష్టుఁ డలరె.

  రిప్లయితొలగించండి
 21. సహజ పండితులు నిష్ణాతులైన వారు పూరణలు చేయాలని, కొనసాగించాలని మనవి. వారు చేసే పూరణలనుంచి, చెప్పకనే చెప్పే యెన్నో పాఠాలు మేము నేర్చుకొంటున్నాము. వారికి శతధా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. బహు చక్కని పూరణలు పెద్దలు,గురువులు,మిత్రులు చేసారు.
  గురువుగారూ మీరు చెప్పడము వలన చాలా విషయాలు తెలుసుకొంటున్నాము. తప్పులు చూపిస్తారనే యిక్కద వ్రాస్తున్నాము.
  తెలుగు ఉపాధ్యాయులు తప్పులు చూపించి మార్కులు విరివిగా వేయాలని నా సూచన. అలా చేస్తే విద్యార్ధులు బుద్ధిగా తెలుగు చదువుతారు, మార్కుల కోసము వచ్చీ రాని మరో భాష లోకి దూకరు.


  భావ భేద ముండు బ్రహ్మాదులకు నైన
  భావ మొక్క రీతి ప్రజల కేల
  భావ రీతు లెఱిగి పరులను గౌరవిం
  చెడు గుణముల తోడ శిష్టుఁ డలరె !

  రిప్లయితొలగించండి
 23. నమస్కారములు.
  మీ అందరి రచనలు , పూరణలు , ప్రసంసలు , చదువు తుంటే నేనెక్కడ ఉన్నానొ అనిపిస్తుంది. ఒకరిని మించి మరొకరు ఉద్దండ పండితులు. ఇంతటి ఆణి ముత్యాలను ఏరుకొని మది నిపుకోవడం ఎంతటి భాగ్యమొ కదా ? ఇది నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం. పైగా మీ అందరికి " అక్కగా ,అమ్మగా "
  అవును గురువు గారూ ! మీరు తప్పొప్పులు సరి జేయకపోతె చాలా కష్టం. ఎవరికి రాయ బుద్ధి కాదు. నేర్చు కోవడం కుదరదు. మీరు నేర్పడం వలననే నా బోటిది తప్పులు తడకలతొ నాలుగు లైన్లు రాయ గలదు అమ్మో ! అంత పని చేయకండి. మీరు గురువులు మాకు నేర్పాలి. " పూరణల , ప్రసంసల వర్షం అను నిత్యం కురియాలి .అవి శంకరా భరణాలు కావాలి అంతె."

  రిప్లయితొలగించండి
 24. గురువు బమ్మ యనుచు గురువే విష్ణుండని
  దైవ మనగ తల్లి దండ్రి గాక .
  వెలుగు బాట జూపు వేలుపేయని పూజిం
  చెడు గుణముల తోడ శిష్టు డలరె !

  రిప్లయితొలగించండి
 25. మిత్రు లందరికీ వందనాలు.
  ఏదో సరదాగా వసంత్ కిశోర్ గారితో అన్న మాటకు మీ రింతగా ప్రతిస్పందిస్తారనుకోలేదు. నా ప్రశంస ఉన్నందున కేవల వారి "నవరత్నాల" గుణదోష విచారణ చెయ్యనన్నాను. అంతే. కవి మిత్రుల పూరణలను పరిశీలించడం, సవరణలను సూచించడం కొనసాగుతుంది.
  మీరు కూడా మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ, చర్చల్లో పాల్గొంటూ బ్లాగుకు నిండతనాన్ని తేవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 26. గోలి హనుమచ్ఛాస్త్రి.


  ప్రహ్లాదుని భక్తి గురించి.

  చక్రి యెచ్చటైన చక్కగా జూచిన
  కాన గలము అనుచు ఘనుడు తెలిపె
  అసుర పుత్రుడయ్యు హరి పాదముల భజిం
  చెడు గుణముల తోడ శిష్టుడలరె.

  రిప్లయితొలగించండి
 27. వసంత్ కిశోర్ గారూ,
  హన్నా! ఎదో సరదాకి అన్న మాటకు ఎంత పెద్ద వ్యాఖ్య పెట్టారు! నన్ను ప్రశంసించిన పద్యాలు కదా అని వాటి జోలికి పోలేదు. అంతే. ఈ విషయంలో మిమ్మల్ని బాధిస్తే మన్నించండి.

  మిస్సన్న గారూ,
  పరమహంస ఆచరించెడు గుణాలతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  గాధేయుని చెడు గుణాలను మెచ్చుకున్నారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  పరులను గౌరవించెడు గుణాల మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో "గురువే" అన్నచోట "వె" అని హ్రస్వం చేస్తే గణదోషం పోతుంది.
  మూడవ పాదం చివర "పూజిం" బదులు "భజిం" అంటే గణదోషం పోతుంది.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  హరి పాదములను భజించెడు గుణములతో మీ పూరణ అలరారింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. అందరికీ శకునాలు పలికే బల్లి తాను కుడితిలో పడిందట! అలా అయింది నా పరిస్థితి.
  నిన్న "చింతా" వారిని సంబోధిస్తూ నేను వ్రాసిన పద్యంలో ప్రాస తప్పింది. ఇది నా సవరణ ....

  చింతాన్వయ భూషణ! తిల
  కింతును మీ కృతుల; రామకృష్ణా రావూ!
  ఎంతయొ మీ కృప; నాకున్
  చింతా కంతైన చాలుఁ జేర్చు హితమ్మున్.

  రిప్లయితొలగించండి
 29. గురువు గారూ మీరొకసారి చెప్పినట్లు ప్రమాదో ధీమతామపి.
  మీలో ఉండే ఆ నిగర్వము మీ పట్ల మాకు పూజ్య భావాన్నికలిగిస్తోంది.

  రిప్లయితొలగించండి