24, ఫిబ్రవరి 2011, గురువారం

వారాంతపు సమస్యా పూరణం - (హరికి వాణియె)

కవి మిత్రులారా,
శ్రీ చింతా రామకృష్ణారావు గారు పంపిన సమస్య ఇది.
దీనిని తేటగీతిలో కాని, కందంలో కాని, ఉత్పలమాలలో కాని, చంపకమాలలో కాని పూరించ వలసిందిగా వారు కోరారు.
కంద గీత గర్భితమైన ఉత్పలమాల కాని, చంపకమాల కాని వ్రాస్తే వారికి సంతోషం.
అలాంటి పద్యాలతో ఒక శతకమే వ్రాసిన కవిశ్రేష్ఠులు వారు.
కవి మిత్రు లెవరైనా దీని నొక సవాలుగా స్వీకరించి పూరించండి. ఆ సమస్య ఇది ......
హరికి వాణియె భార్య మహాత్ము లెన్న.
శ్రీ చింతా రామకృష్ణారావు గారి సౌజన్యంతో, వారికి ధన్యవాదాలతో .....

18 కామెంట్‌లు:

 1. చం||
  కనుగొనఁ జక్కనౌ సిరియె గాదిలి పత్నియు సింహరూపియై
  ప్రణతుల గాచునా హరికి; వాణియె భార్య మహాత్ములెన్నగా
  ధునివలె యబ్ధికిన్ శతధృతుండు-విరించికి; సాంబమూర్తికి
  న్ననయముఁ గూర్మిగా వపువు నర్ధమై గౌరియుఁ వాసి నొప్పెడిన్.
  గీ||
  సిరియె గాదిలి పత్నియు సింహరూపి
  హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న
  శతధృతుండు విరించికి; సాంబ మూర్తి
  వపువు నర్ధమై గౌరియుఁ వాసి నొప్పె.

  రిప్లయితొలగించండి
 2. కంద గీత గర్భిత చంపకమాల ..............
  మిము దయఁ జూచు నా హరుని మేనియ పొందు నుమాఖ్య దేవి ని
  త్య మిడు సిరుల్ గదా! లలిత, దానవ నాశిని లక్ష్మి జాయ సం
  భ్రమ జయశాలియౌ హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న ని
  క్క మజునకున్ మహా సుకలకంఠము నెక్కెడి శుభ్రి కందురే.

  గర్భిత కందము ................
  దయఁ జూచు నా హరుని మే
  నియ పొందు నుమాఖ్య దేవి నిత్య మిడు సిరుల్
  జయశాలియౌ హరికి; వా
  ణియె భార్య మహాత్ము లెన్న నిక్క మజునకున్.

  గర్భిత తేటగీతి ...............
  హరుని మేనియ పొందు నుమాఖ్య దేవి;
  లలిత, దానవ నాశిని లక్ష్మి జాయ
  హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న
  సుకలకంఠము నెక్కెడి శుభ్రి కందు.

  ఉమాఖ్య = ఉమ అను పేరు గలది - పార్వతి.
  కలకంఠము = కోకిల, హంస.
  శుభ్రి = బ్రహ్మ.

  రిప్లయితొలగించండి
 3. రవి గారి గీత గర్భిత చంపకమాల ప్రశంసనీయంగా ఉంది.
  ఇక నేను కందాన్ని కూడ చేర్చడం వల్ల కాస్త ఇబ్బంది పడి చివరికి ఏదో అయిపోయింది అనిపించాను. మొదటి ప్రయత్నం. నాకే తృప్తికరంగా లేదు.
  చింతా రామకృష్ణారావు గారు ఏమంటారో చూడాలి.

  రిప్లయితొలగించండి
 4. ధర నియమంబుతో వెలయ, తా ప్రియ భావన వెల్లి గొల్పు శ్రీ
  కర విధియే కదా! కమల గర్భుఁడు సృష్టికి కారణంబుగా!
  వర ప్రియ పుత్రుడా హరికి, వాణియె భార్య మహాత్ము లెన్న నే
  ర్పరి విధికిన్! పునీత నయ భావన స్రష్టకు తప్పు కాదుగా!

  నియమంబుతో వెలయ తా
  ప్రియ భావన వెల్లి గొల్పు శ్రీకర విధియే
  ప్రియ పుత్రుడా హరికి, వా
  ణియె భార్య మహాత్ము లెన్న! నేర్పరి విధికిన్!

  వెలయ తా ప్రియ భావన వెల్లి గొల్పు
  కమల గర్భుఁడు సృష్టికి కారణంబు
  హరికి వాణియె భార్య మహాత్ము లెన్న
  తనయ భావన స్రష్టకు తప్పు కాదు.

  రిప్లయితొలగించండి
 5. శంకరార్యా! చిరంజీవి రవీ, పూజ్యులైన మీరు మీ పూరణలతో నా అసాధారణమైన ఆశ నెరవేర్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది.
  మీ ఇద్దరికీ నా అభినందనలు. మీకు నా ప్రత్యేక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. రవీ!నీకు నా అభినందనలు. నీ పూరణలో నాలుగవ పాదంలో అర్థమై అనడానికి బదులు అర్థము అని అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 7. చింతా రామకృష్ణారావు గారూ,
  ధన్యవాదాలు.
  అద్భుతంగా ఉంది మీ గర్భకవిత్వం. ఎక్కడా తొట్రుపడని ధార, చక్కని శైలి, సముచిత పదవిన్యాసం అనన్యసామాన్యాలు. నా బ్లాగు ధన్యతను పొందింది.

  రిప్లయితొలగించండి
 8. చింతా వారు మా అదృష్టం కొద్దీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి రాలేదు. లేకపోతే మూడు ప్రోగ్రాములు ఒక దెబ్బలో వ్రాసి పడేసేవారు. ఈ విషయం ఆయనతో ఫోనాఫోనీ గా అదివరలో లో ప్రస్తావించాను. మీ పూరణ అత్యద్భుతం రామకృష్ణ గారూ! తేలిక పదజాలంతో నడిపించిన తీరు నన్ను పులకితుడ్ని చేసింది.

  రిప్లయితొలగించండి
 9. అనిర్వచనీయమైన అనుభూతిని మూడు ముక్కల్లోచెప్పాలనుకునాను.
  ఏక క్రియా ద్వర్ధ కరీ...కాదు... ఏక క్రియా త్ర్యర్ధ కరీ.
  ఒకే దెబ్బకు రండు పిట్టలు ... కాదు... ఒకే దెబ్బకు మూడు పిట్టలు.
  త్రీ ఇన్ వన్ మాత్రమే ...కాదు... వన్ ఇన్ త్రీ కూడ (ఒకే సమస్యకు పూరణ కనుక)

  అద్భుతమైన పూరణ ప్ర యోగములు చేసిన చింతా వారికి,శంకరం మాస్టారు గారికి,రవి గారికి (కవి త్రయానికి) అభినందనలు.


  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 10. చంద్రశేఖర్ గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ......................... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. చిత్ర విచిత్ర మైన కవితా విన్యాసాలు చెయ్యడంలో విద్వాంసులైన శ్రీ గురువుగారూ, శ్రీ చింతా రామకృష్ణారావు గారూ తమ పద్యాలతో తోటి కవి మిత్రులను, శిష్య గణాన్ని సమ్మోహితులను జేశారు. రవి గారు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు.
  ఇంతటి ఉద్దండ పండితుల సరసన ఓనమాలు దిద్దుకుంటున్న నాబోటి వాడు ఆ స్థాయిలో పద్యాలు వ్రాయగలగడం అసంభవం.
  అయితే జిహ్వ చాపల్యం కొద్దీ ఎప్పటి లాగానే మామూలుగా రెండు పద్యాలను వ్రాశాను కానీ నాకే సంతృప్తిగా లేదు.
  సమస్య పాదం చాలా క్లిష్టంగా కనుపిస్తోంది. హరి, హరికి భార్య వాణి, మహాత్ములెన్నడం...ఇలా..
  అయినా పండితులు చేసే గుణ దోష పరిశీలన నన్ను మెరుగు పరచు కోవడానికి ఉపకరిస్తుందని భావిస్తూ నా పద్యాలనూ ఉంచే సాహసం చేస్తున్నాను.

  ౧. లోకములన్ సృజించు పనిలో కడు నేర్పరి యొక్క సూను,డా
  లోకములన్ రమించు పనిలో పడవేయు మరొక్కడున్! నమో
  వాకము లట్టి శ్రీ హరికి! వాణియె భార్య మహాత్ము లెన్న సు-
  శ్లోకుడు స్రష్టకున్, రతియె శోభిలు తోడుగ పుష్పధన్వికిన్.

  ౨. విరి జనియించి విశ్వమును వెల్లడి చేయు సుతుండు బ్రహ్మయే!
  వరలెడు వాక్సుధారసపు వాహిని నాల్కల జేయు సత్కవీ-
  శ్వరులకు, కోడలై హరికి, వాణియె! భార్య, మహాత్ములెన్న, తా-
  నురమున నుండి లోకులకు నున్నతి జేయు శుభేక్షణమ్ములన్!

  ౩. దురిత హారిణి యా గంగ దుహిత! నాభి-
  కమల సంభవు డజు డేమొ కన్న కొడుకు
  హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న-
  సృష్టి కర్తకు విద్యల సృష్టి కర్త్రి!

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారూ,
  చాలా గొప్పగా ఉంది మీ మొదటి పద్యభావం.
  గొప్పపుత్రులనుఁ గన్న తండ్రిని మెచ్చుకుంటూ, కోడళ్ళనూ ప్రస్తావించారు

  రిప్లయితొలగించండి
 13. మిస్సన్న గారూ,
  నిజం చెప్తున్నాను. మీరు బొగ్గుముక్క లనుకొన్న మీ పద్యలు నాకు జాతిరత్నాలు. న్యూనతాభవాన్ని వదలండి. నేనేదో ఛందస్సుతో గారడి చేసాను కాని నా పద్యంలో భావసౌకుమార్యం లేదు. దానికంటె మీ పద్యాలు ఎన్నోరెట్లు మేలు.

  రిప్లయితొలగించండి
 14. గురువు గారూ మీ ప్రశంసలకు ధన్యుడను. అవి నాలో ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయు. మీ పద్యంలో భావ సౌకుమార్యం చక్కగా ఉన్నది. శ్రీ మహా లక్ష్మీ మహా కాళీ మహా సరస్వతీ రూపాత్మికయైన లలితా పరమేశ్వరిని కడు చక్కగా ఉపాసించారు. కృతజ్ఞతలు.

  మందాకిని గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. రవిగారు,గురువర్యులు,శ్రీ చింతా రామకృష్ణారావు గారు మిస్సన్నగారూ చాలా చక్కని పద్యాలు చెప్పారు. చాలా సార్లు చదివాను, ఆనందించాను.మీ అందఱికీ కృతజ్ఞతాభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. చంద్రశేఖర్ గారు సరిగ్గా చెప్పారు. అపూర్వమైన పాండిత్యప్రతిభ గురువులు చింతా వారిది. ఆయన జాలంలోనికి రావడం మనబోంట్ల అదృష్టం అంతే.
  మిస్సన్న గారి పద్యాలు రసాలూరుతున్నాయి. గురువులు కంది శంకరయ్యగారి పద్యాలు కూడా చాలా ప్రతిభాయుతంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 17. నరసింహ మూర్తి గారూ, రవి గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి