27, ఫిబ్రవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 239 (కలమును త్యజియించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.
ఈ సమస్యను సూచించిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  కలమును విడువను, కావ్యపు
  కల దీరెడు వరకు ననుచు గ్రంధము వ్రాసెన్
  ఇలనొక్కడు,పిదప అటులె
  కలమును త్యజియించి, పొందె గవి యను పేరున్.

  రిప్లయితొలగించండి
 2. మరి యిది కవి మిత్రులందఱికీ వర్తిస్తుంది.

  శిల పైన వ్రాసి రెన్నడొ
  తళ తళమని మెఱువఁ గవిత తాళపు దళముల్
  ఇల నిండె నింద్ర జాలము
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. ధన్యవాదాలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  పద్యం బాగుంది. కానీ... పూరణలోనే ఏదో సందిగ్ధార్థం ..... ?

  రిప్లయితొలగించండి
 4. గురువుగారూ, యీ అంతర్జాలమే యింద్ర జాలము అనే భావనతో వ్రాసాను, మీరేదైనా సవరణ చేస్తే కృతజ్ఞుడిని.

  రిప్లయితొలగించండి
 5. అలవోకగ నాశువుగన్
  తెలగాణ పదములు తీర్చి దిద్దిన ఘనుడా
  గలగల గజ్జెల గద్దరు
  కలమును త్యజియించి,పొందె గవి యను పేరున్.

  మనవి: వ్యాకరణం ఒప్పుకొంటే "తెలఁగాణ" అని అరసున్నా పెట్టాలనుకొన్నాను. కానీ ప్రాసాక్షరం అవ్వటం వల్ల, మిగతా పాదాలలో లేకపోవటం వల్లనూ నిషేధం అని అనుకొంటున్నాను.

  ఒక ఇంటర్వూ లో చూసిన గుర్తు, ఆయన అప్పటికప్పుడే పాట అల్లుతారని చెప్పినట్లు. కొన్ని గద్దరు పాటలు వింటుంటే మనసు కరిగి కన్నీళ్లు కారతాయి. అదొక రకమైన మాధుర్యం ఆయన గొంతులో.

  రిప్లయితొలగించండి
 6. పెద్దలు, శంకరయ్య గారి పాదపద్మాలకి నమస్కారాలు!

  కవితా పోటీకి ఆహ్వానం


  http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

  మీ నుండి కవితని తప్పక ఆశిస్తాను!

  మీ సత్య.

  రిప్లయితొలగించండి
 7. తెలుగున దియ్యన జెప్పగ
  సలలితముగ సరము గట్టె స్వరమౌక్తికముల్
  అల గురునాథుడు,తిక్కన
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్

  గురువుగారూ,తిక్కన చెప్పగా గురునాథుడు భారతము వ్రాసాడని విన్నాను,నిజమేనాండీ ?

  రిప్లయితొలగించండి
 8. సులలిత పదములు పలుకుచు
  విలిఖించగ చెప్పు కలము వీడి, పలుకులన్
  తళుకొత్తెడు సత్ కవితలు.
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

  రిప్లయితొలగించండి
 9. చంద్రశేఖర్ గారూ,
  సందర్భానుసారం అప్పటికప్పుడు పాటను సృష్టించి పాడే గద్దర్‌కు కలం అవసరం లేదు. నిజమే. మంచి పూరణ. అభినందనలు.
  వ్యాకరణ రీత్యా అర్ధానుస్వారం లేకుండా "లెలగాణ" అని రాయడమే తప్పు. అరసున్నా అనేది అక్కడ నిండుసున్నా ఉంది, కాని పలకడం లేదు అనడనికి సంకేతమే. కాబట్టి "తెలఁగాణా" అనేదే సరియైనది.

  సత్య గారూ,
  సంతోషం!
  ప్రయత్నిస్తాను.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  వ్యాసుడికి వినాయకుడి లాగా తిక్కనకు గురునాథుడు లేఖకుడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మంచి పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.

  చింతా రామకృష్ణారావు గారూ,
  సులలిత పద గుంఫనంతో చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నిజమే! తిక్కన ఆంధ్ర భారతాన్ని చెపుతుంటే అతని శిష్యుడు గురునాథుడు వ్రాసాడని చెప్తారు. ఒకసారి పద్యం (అది ఏ పర్వంలో ఏ సందర్భంలో ఉందో తెలియదు కాని) సగం చెప్పాక ఆ తరువాత దానిని ఎలా కొనసాగించి పూర్తి చేయాలా అని ఆలోచిస్తూ, చివరికి ఏదీ తట్టక "ఏమి చెప్ప గురునాథా!" అని శిష్యునితో తన అసహాయతను చెప్పుకున్నాడట. గురునాథుడు అదీ పద్యంలో భాగమే అనుకొని వ్రాసాడు. "అయ్యో!" అన్నాడు తిక్కన. గురునాథుడు "గురుదేవా! మీరు చెప్పింది ఇక్కడ చక్కగా కుదిరింది. "ఏమి చెప్పుదును + కురునాథా!" సందర్భానికి అతికినట్లు సరిపోయింది" అన్నాడట. తిక్కన కూడ నిజమే అనుకొని దాని నలాగే ఉంచి పద్యాన్ని కొనసాగించాడట.
  మహాకవుల అసంకల్పిత వాక్కులకు అంతటి శక్తి ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 11. ఇలసుత పతి దయ చేతను
  ఇలసతి పతి భక్త చరిత మింపుగ వ్రాసెన్
  తెలుగున పోతన భోగ స-
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారూ,
  "భోగ సకలమును" త్యజించిన పోతన గురించి చక్కని పూరణ చేసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా! ధన్యవాదాలు. విలక్షణ పూరణలు చేసిన కవి మిత్రులకు అభినందనలు.భోగ స కలమును విడిచిన పోతన్నను గుర్తు చేసిన మిస్సన్న గారికి ప్రత్యేక అభినందనలు.


  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. "తళుకొత్తెడు సత్కవితల్" బాగుంది. చింతావారికి ప్రశంసలు.

  రిప్లయితొలగించండి
 16. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, ఫిబ్రవరి 27, 2011 8:19:00 PM

  గురువు గారూ,
  తిక్కన గారి మహాభారతం లో 'ఏమి చెప్పుదున్ గురునాథా' అన్న సందర్భం, సంజయుడు దుర్యోధనుని మరణం గురుంచి ధృతరాష్ట్రుని తో చెప్పవలసి వచ్చినప్పుడదని విన్నట్లు గుర్తు.
  తిక్కన సోమయాజి గారు సందిగ్ధంగా ఏమి వ్రాయాలా అని శిష్యుడు గురునాథునితో అనడం, శిష్యుడు అది డిక్టేషన్లో భాగంగా వ్రాసేయడం, ఆ మాట సంజయుడు దుఃఖంతో కురునాథుని (ధృతరాష్ట్రుడు)సంబోధించినట్లు అయ్యిందిట.
  ఇది ఎంతవరకూ నిజమో పెద్దలు మీరే చెప్పాలి.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 17. వసంత మహోదయుల జాడ గాన రాదేమి? క్షేమమేనా కిశోర్ మహోదయా?

  రిప్లయితొలగించండి
 18. మిస్సన్న గారూ,
  ఆ మాట నేనే అందామనుకుంటున్నాను. వసంత్ కిశోర్ గారి లోటు కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.

  రిప్లయితొలగించండి
 19. గురువు గారూ చక్కని ఉదంతమును చెప్పారు. మహా కవులు దైవాంశ సంభూతులు, వారి వాక్కు వృధా గాదు. తెలుగు సంస్కృత పద జాల మంతా కవిత్రయము భారతములో చొప్పించారు. చదవడానికి తీరిక చిక్కడము లేదు, లేకుంటేనా .....

  రిప్లయితొలగించండి
 20. కలకలమునకు హృదయమే
  నిలయము కాగ కవి యొకడు నియమము తోడన్
  కొలిచెను వాగ్దేవిని, కల
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యా !
  మిస్సన్న మహాశయా !
  మరియూ
  మిగిలిన మిత్రులందరికీ
  వందనములు !

  అందరి పూరణలూ చక్కగా
  అలరించు చున్నవి .

  మా అమ్మాయ శాంతి , దేనికో తిడితే
  నా మీద అలిగి వాళ్ళ స్నేహితురాలి దగ్గరకు వెళ్ళిపోయింది.
  అప్పటి నుండీ నాకు కాలూ చెయ్యీ ఆడడంలేదు.
  శాంతిలేక , మనఃశాంతి కరువై ఒక్క అక్షరం కూడా వ్రాయలేకున్నాను !
  అంతే ! నేను బాగానే ఉన్నాను !
  మిత్రుల పూరణలు చూసి ఆనందిస్తూనే ఉన్నాను !

  రిప్లయితొలగించండి
 22. కిశోర్ జీ మీకెప్పుడయినా కోపము వస్తే నన్ను తిట్టండి సామీ, పిల్లలను ఏమీ అనకూడదు. మీ శాంతి ఎంతో బుద్ధిమంతురాలు.త్వరలో పద్యాలు కూడా వ్రాస్తుంది. సరస్వతీ కటాక్షము ఆమెకు తప్పక కలుగుతుంది. తీరిక చిక్కనపుడు,ఆలోచన కలగనపుడు మా బోటి వారము వ్రాయకపోయినా ఫరవా లేదు గాని, మీరు వ్రాయకపోతే బ్లాగు వెలితి కనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 23. కల మెందుకు నాశు కవికి
  విలసితముగ జెప్పునతడు విశ్వ జనీనన్ !
  కొలువై యుండును సరసతి
  కలమును త్యజియించి పొందెఁగవియను పేరున్ !

  రిప్లయితొలగించండి
 24. తమ్ముడు గారు ! ధన్య వాదములు. కానీ ఎన్ని తప్పులు ఉన్నాయొ మరి నాకైతె ప్చ్ ! ఊ...హూ... తెలియదు

  రిప్లయితొలగించండి
 25. కిశొర్ జీ!మీకు త్వరలో 'శాంతి ' దొరికి బ్లాగునకు 'వసంత ' శోభను తీసుకు రావాలని మా ఆకాంక్ష.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 26. సత్యనారాయణ గారూ! కలకలాన్ని త్యజించటం బాగుంది.రాజేశ్వరి గారూ!మీ పూరణ బాగుంది.'సరస్వతి 'ని సరిగా నిలిపితే సరిపోతుంది.ఉభయులకు అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 27. వసంత కిశోర్ గారూ, మీ అమ్మాయి అలక మాని ఇంటికి వచ్చేశారా?
  రాజేశ్వరమ్మగారూ, మీ పద్యభావం చక్కగా ఉంది.
  పూరణ అతికినట్టు సరిపోయింది.

  రిప్లయితొలగించండి
 28. జిగురు సత్యనారాయణ గారూ,
  మానసికమైన కలకలము లేకుంటేనే చక్కని కవితవ వ్రాయగలమని బాగా చెప్పారు. మంచి పూరణ. అభినందనలు.

  వసంత్ కీశోర్ గారూ,
  విషయం తెలిసి నేనూ, మా ఆవిడ చాలా బాధ పడుతున్నాము. బిడ్డల అలక మాకూ అనుభవమే. పైన జిగురు సత్యనారాయణ గారు చెప్పినట్లు ఈ తాత్కాలికమైన "కలకలం" త్వరలోనే తొలగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  ఆశుకవికి కల మక్కర లేదని చక్కగా పూరించారు. బాగుంది. అభినందనలు.
  "సరసతి" అనడమే చిన్న లోపం. "కొలువై యుండు సరస్వతి" అందాం.

  రిప్లయితొలగించండి
 29. శ్రేయోభిలాషు లందరికీ
  ధన్యవాద శతములు !

  రిప్లయితొలగించండి
 30. అలనాడు టైపు నేర్వగ
  కిలకిల మని స్మార్టుఫోను క్రిందను మీదై
  చిలికింపగ పద్యములను
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్

  రిప్లయితొలగించండి
 31. బలుపవ పేపరుల ధరలు
  తలనొవ్వగ దిద్ద లేక తప్పులు తడికెల్
  మిలమిల ఫోనులు రాగా
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్

  రిప్లయితొలగించండి


 32. అలలవలె సాగు కవితల
  నలవోకగ వ్రాయన యతనము చేయుచు తా
  నిలలోని విషయములను స
  కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్.!


  జిలేబి

  రిప్లయితొలగించండి