1, ఫిబ్రవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 214 (భార్యకుఁ బ్రణమిల్లె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్.
ఈ సమస్యను పంపించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  సీతాన్వేషణ జేయుచు
  ఆమారుతి లంకజేరి అచ్చట గని తా
  ముద్రికనిచ్చుచు రాముని
  భార్యకు బ్రణమిల్లె భక్తి భావము గదురన్.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు.

  01)
  _________________________________________

  శౌర్యము గల్గిన లక్ష్మణు
  నార్యుడు , శ్రీరాము , డకట - నడవుల విడువన్
  భార్యను; పనిచిన సోదరు
  భార్యకు బ్రణమిల్లె భక్తి - భావము గదురన్ !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 3. 02)

  _________________________________________

  క్రౌర్యము ద్రోణుడు పన్నిన
  కార్యము , ఛేదించు కొఱకు - కవ్వడి సుతుడున్

  వీర్యము తోడుగ , నర్జును

  భార్యకు బ్రణమిల్లె భక్తి - భావము గదురన్ !
  ___________________________________________

  రిప్లయితొలగించండి
 4. భారతీయ ఆధ్యాత్మిక మార్గదర్శి , శ్రీ రామకృష్ణ పరమహంసలకు ప్రణమిల్లుతూ -

  ఆర్యుండై , తాత్వికతా
  చార్యుండై , పరమ హంస , సమ్మతి - కాళిన్
  భార్యను సందర్శించెను
  భార్యకు బ్రణమిల్లె భక్తి భావము గదురన్ !!!

  రిప్లయితొలగించండి
 5. విష్ణు నందన్ గారికి వందనములు.
  ముచ్చటగా నున్నది మీ పూరణ.
  _______________________________________

  03)

  కార్యా కారణ మెరుగ , న
  నార్యుడు ,గొల్లడు , శుభదిన - నవసర మందున్
  చర్యకు , ప్రతిచర్యగ , తన
  భార్యకు బ్రణమిల్లె భక్తి - భావము గదురన్ !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 6. విష్ణు నందన్ గారి పూరణ చాలా బాగుంది. కిశోర్ జీ మీ పూరణలు అదిరాయి. హనుమఛ్ఛాస్త్రి గారూ ప్రాస కుదిర్చి మళ్ళీ వ్రాయండి

  రిప్లయితొలగించండి
 7. తూర్యములఁ బుస్తె గట్టెను
  భార్యకుఁ ; బ్రణమిల్లె భక్తి భావము గదురన్
  ఆర్యులగు అత్తమామల
  మర్యాదగ పెండ్లికొడుకు మంత్రము లందున్ !

  రిప్లయితొలగించండి
 8. డా.విష్ణు నందన్ గారి పూరణ చాల బాగుంది .కిషోర్ గారి పూరణలు బాగున్నాయి, మరిన్ని పూరణలు రావచ్చేమొ.

  ధైర్యము గలవాడని కిర
  ణార్యుని మన రాష్ట్ర ముఖ్య నాయకుడన,నౌ
  దార్యమునన్ రాజీవుని
  భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

  సూర్యుని సుతుడౌ కర్ణుని
  శౌర్యము గని రాజ్య మిచ్చెసఖుడై ,తానౌ
  దార్యముతో ద్రుత రాష్ట్రుని
  భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

  రిప్లయితొలగించండి
 9. శౌర్యము గల మారుతి ప్రభు
  కార్యము నెరవేర్చ బోయి, కనుగొనె సీతన్,
  ధైర్యము గూర్చగ ,రాముని
  భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గదురన్!

  రిప్లయితొలగించండి
 10. మూర్తి గారూ ! ధన్యవాదములు.
  మీరేం తక్కువ తిన్నారా !!!
  సమస్యను తుత్తునియలు చేసారు !
  భార్యకు బదులు అత్త మామలకు పెట్టించారు గదా !
  ప్రణతులు !

  పీతాంబరధరా ! ధన్యవాదములు.
  మీ పూరణలు కూడా చక్కగా కుదిరాయి.
  సోనియమ్మకూ , గాంధారికీ , సీతకూ పెట్టించారు గదా !
  ప్రణతులు !

  రిప్లయితొలగించండి
 11. చర్యకు తప్పక దగు ప్రతి
  చర్య గలుగు; కావలసిన సంతకమునకై
  కార్యార్థి మంత్రి వర్యుని
  భార్యకు బ్రణ మిల్లె భక్తి భావము గుదురన్!

  రిప్లయితొలగించండి
 12. హరీజీ!
  మంత్రి వర్యుని భార్యకు
  ప్రణతులు ! భేష్ !


  04)
  _________________________________________

  చౌర్యము చేయ దలంచి , నా
  చార్యు గృహము జొచ్చి, గాంచె - శంకరి పటమున్ !
  ధైర్యము నిమ్మని , నీశ్వరు
  భార్యకు బ్రణమిల్లె భక్తి - భావము గదురన్ !
  _________________________________________

  రిప్లయితొలగించండి
 13. 05)
  __________________________________________

  తిర్యక్పుండ్ర ధరుడొ , కా
  చార్యుడు , దేవాలయమున - జలధిజ ప్రతిమన్
  కార్యము దీర్చగ , జిష్ణుని
  భార్యకు , బ్రణమిల్లె , భక్తి - భావము గదురన్ !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 14. Incredible India, Athithi Devo Bhava అని స్ఫూర్తిమంతమైన యాడ్స్ లో కనిపిస్తూ బాధ్యతను గుర్తుచేసే అమీర్ ఖాన్ "యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః" అన్న నానుడికీనుగుణంగా తన శ్రీమతి కిరణ్ రావ్ కి నమస్కరిస్తున్నాడు అని ఊహ

  "పర్యాటకులకు మీరౌ
  దార్యమ్మును చూపుటదియె ధర్మమ్మని " గాం
  భీర్యమ్మున పల్కు నమీర్
  భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్.

  ఎవరూ వాడని పదాలతో పూరణచేద్దామని ఇలా ప్రయత్నించా...

  రిప్లయితొలగించండి
 15. వివరానికి చిన్న సవరణ

  యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతాః" అన్న నానుడికీనుగుణంగా తన శ్రీమతి కిరణ్ రావ్ కి వేదికపై నమస్కరిస్తున్నాడు అని నా ఊహ

  రిప్లయితొలగించండి
 16. శౌర్యమ్మునిడు కరమ్ములు
  ధైర్యముతోబోర పోయె , దన యిల్లాలే
  కార్యమ్ము లన్ని చేయగ
  భార్యకు బ్రణమిల్లె భక్తి భావము గదురన్!

  (యుద్ద రంగములో తన చేతులను కోల్పోయిన వీర సైనికుడు
  తనకు సేవలందిస్తున్నభార్యకు తాను చేస్తున్న ప్రణామం )

  రిప్లయితొలగించండి
 17. సప్తపది సినిమాలో సంఘటన.

  ఆర్యుడు భక్తశిఖామణి
  భార్యకుఁ, బ్రణమిల్లె భక్తిభావము గదురన్,
  దుర్యశముఁ గలుగు తథ్యము
  చౌర్యపు సొత్తుఁ గొనగనని స్వాంతముఁ దలపన్.

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి.

  కవి మిత్రులు నాపొరబాటును క్షమింతురు గాక.ఉదయం గ్రామంతరము వెళ్ళే హడావిడిలో ప్రాసనియమం తప్పి పూరించాను.సవరించి పూరించుచున్నాను.

  సూర్యకుల తిలకు రాముని
  భార్యకు బ్రణమిల్లె భక్తి భావముగదురన్
  శౌర్యముతో హనుమంతుడు
  కార్యము సాధించి,మణిని గైకొని మరలెన్.

  రిప్లయితొలగించండి
 19. గోలి హనుమచ్ఛాస్త్రి.

  ఆర్య, సుమన్,రవి,రామా
  చార్యులు,గోవిందు,రాజు,శంతను,గుడిలో
  భార్యలతోగలసి హరుని
  భార్యకు బ్రణమిల్లె భక్తి భావముగదురన్

  రిప్లయితొలగించండి
 20. సూర్య కులాన మొలచి ఆ
  శ్చర్యముగ వివాహమాడె క్ష్మాసుత సీతన్!
  భార్యయె అత్తగ మారగ
  భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్!!


  (వివరణ: విష్ణువుకు భార్య అయిన భూదేవియే, రామావతారములో అత్తగా మారినది)

  రిప్లయితొలగించండి
 21. భార్యన బ్రతుకున సగమౌ,
  భార్యనగా నింటి లక్ష్మి, భాగ్యము పతికిన్
  భార్యయె, సాక్షాత్ కృష్ణుడె
  భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్.

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు.
  కవి మిత్రుల పూరణలన్నీ వైవిధ్యంగా, మధురంగా, ప్రశంసనీయంగా ఉన్నాయి.
  ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల మనశ్శాంతి లేక మిత్రుల పూరణలను విడివిడిగా సమీక్షించలేక పోతున్నాను. ఉదయం ఏదో రకంగా వీలు కలిగించుకొని క్రొత్త సమస్యను పోస్ట్ చేసాను. ఇకముందు కూడా చేస్తాను.
  దయచేసి రెండు మూడు రోజులు మిత్రులు పరస్పరం గుణదోష విచారణ చేస్తూ వ్యాఖ్యలు పెట్ట వలసిందిగా మనవి.
  గొడవలు సద్దు మణిగాక ప్రశాంత చిత్తంతో మీ మీ పూరణలను మళ్ళీ పరామర్శిస్తాను.

  రిప్లయితొలగించండి
 23. గోలి హనుమచ్ఛాస్త్రి

  పూర్వపు ఉత్సాహముతో పునరాగమనాన్ని కాంక్షిస్తున్నాము.

  రిప్లయితొలగించండి
 24. ఆర్యుడు తన కోరికకై
  కార్యము నెరవేర్చబూని కాంతను గోరన్
  సూర్యుని నాపంగ తనదు
  భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్

  రిప్లయితొలగించండి
 25. శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. ఆర్యుడు ఛాందసుడు తనకు
  మిర్యపు పది కూతుల వల మెదడిక చెడగా
  సూర్యుని వోలు కొడుకు నిడ
  భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్

  రిప్లయితొలగించండి