24, ఫిబ్రవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 236 (రాతికి వందనము లిడ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్.

14 కామెంట్‌లు:

 1. భీతిలు మృకండుసూనుం
  డే తీరునఁ గాలు గెలచె నిలలోఁ గనఁగా
  నాతతభక్తిన్ త్రిపురా
  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి.


  నీతలపున శివ రూపము
  ప్రీతిగ భావించి మిగుల ప్రేమతొ భక్తిన్
  ఏ తరువుకు, మరి పుట్టకు,
  రాతికి, వందనములిడ వరమ్ములు దక్కున్.

  రిప్లయితొలగించండి
 3. ప్రాతః కాలమ్మందున
  ప్రీతిన్ నమకాది చమక రీతి యుతముగా
  చేతో విశుద్ధి మదనా
  రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్ !!!

  రిప్లయితొలగించండి
 4. ఏ తలపున తలచెదవో
  యాతని, కనబడు నతండు యట్లే నీకున్
  ప్రీతి న్నాతని తలచుచు
  రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్!
  సూక్తి: యద్భావం తద్భవతి. విశ్వనాధ వారు కల్పవృక్షంలో యుద్ధకాండలో కుంభకర్ణుడి చేత అనిపించిన"అతండు యాతండే అయినచో ..." ప్రయోగం గుర్తుకొచ్చింది. "అతడు=పరమాత్మ"

  రిప్లయితొలగించండి
 5. ఖ్యాతిని, జీవన గతిలో
  జాతికి నీతిని, నియతిని ,జనులకు కడుసం
  ప్రీతిని గూర్చే దైత్యా
  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!

  రిప్లయితొలగించండి
 6. భూతములందున , మరియున్
  భూతే తరముల,విశాల భూతల మందున్
  జ్యోతుల జిమ్మెడు తిరుమల
  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్!!!

  రిప్లయితొలగించండి
 7. మాతా పితలకు, గురువుకు
  చేతలలో ప్రేమ జూపి సేవలు జేసే
  వ్రేతల భక్తికి ఫలమది
  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్

  రిప్లయితొలగించండి
 8. రాతిని దేవునిఁ జేసిన
  ఖ్యాతిని గనె నార్యులట్టి గౌరవ ప్రదమౌ
  రాతిని దైవంబుండును.
  రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్.

  ఆర్యులారా!
  "హరికి వాణియె భార్య మహాత్ము లెన్న"
  అనే సమస్యను శ్రీ కంది శంకరార్యుల అనుమతితో
  తేట గీతిలో కాని,
  కందంలో కాని,
  చంపక మాలలో గాని,
  ఉత్పలమాలలో కాని
  పూరించ కలరని
  ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 9. నాతిగ రూపము నిచ్చెను
  రాతికి, వందనము లిడ వరమ్ములు దక్కున్
  సీతాపతి కరుణించున్
  కోతియు, గోపన్న< బోయ కొలచిన రీతిన్!

  రిప్లయితొలగించండి
 10. రాఘవ గారూ,
  త్రిపురారాతికి వందనము లిడిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సర్వత్రా శివుణ్ణి దర్శింప జేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  డా. విష్ణు నందన్ గారూ,
  మదనారాతికి వందనము లిడిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  "యద్భావం తద్భవతి" అంటున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.

  సనత్ శ్రీపతి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "వ్రేతల" ... ?

  చింతా రామకృష్ణారావు గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  చాలా మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. చింతా రామకృష్ణా రావు గారూ,
  ధన్యవాదాలు. మీరిచ్చిన సమస్యను "వారాంతపు సమస్యా పూరణం" శీర్షికలో కొత్తగా పోస్ట్ చేసాను. హరి గారు "గీత గర్భిత చంపకమాల" వ్రాసారు. నేను "కంద గీత గర్భిత చంపకమాల" వ్రాసాను. నా పద్యం నాకే సంతృప్తికరంగా లేదు. ఇది నా మొదటి ప్రయత్నం. ఎలా ఉందో మీరే విశ్లేషించాలి.

  రిప్లయితొలగించండి
 12. నేతల కాళ్ళకు మ్రొక్కుచు
  భూతలముల మాఫియాకు పూజల నిడుచున్
  భీతిలి గుజరాతు చలువ
  రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్

  రిప్లయితొలగించండి
 13. ప్రాతఃకాలము నందున
  ప్రీతిని విగ్రహము జేసి పెట్టిన వీధిన్
  నాతి యిటలీది పాలన్
  రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్

  రిప్లయితొలగించండి