28, ఫిబ్రవరి 2011, సోమవారం

పదవీ విరమణ సన్మాన పత్రము

శ్రీ బేతి నరసింహ స్వామి గారు, B.A., B.Ed.,
స్కూల్ అసిస్టెంట్ (ఆర్ట్స్)
ప్రాథమికోన్నత పాఠశాల, వెంకటాపురం, మం. సంగెం.
ది. 28-02-2011 నాడు పదవీ విరమణ చేయుచున్న సందర్భమున సమర్పించిన
సన్మాన నవరత్నములు

శ్రీ లక్ష్మీ నరసింహ కృ
పాలోకన లబ్ధ సుఖ శుభైక భవిష్య
త్కాలము నీ దగుత! వినుత
శీలాంచిత జీవన! నరసింహ స్వామీ!


తే.గీ.
పేరు కెక్కిన నగరమౌ నోరుగల్లు
లోన `బేతి` వంశమ్మున మాననీయు
లైన `రాజయ్య, రాజమ్మ` లనెడి దంప
తులకు జనన మందిన పుణ్య ఫలము నీవు.


తే.గీ.
పసితనము నందున ద్విచక్ర వాహనమ్ము
నభ్యసింపఁగ క్షత వామహస్తుఁడ వయి
మొక్కవోని ధైర్యముతోడ చక్కనైన
విద్యలను శ్రద్ధతోఁ జదివితివి నీవు.


తే.గీ.
పేర్మితోడ నుపాధ్యాయ వృత్తిఁ బూని
చేరి `ఆజంనగరు, మామునూరు క్యాంపు`
పిదప `తిమ్మాపురము` మరి `పెన్షనుపుర,
ఓరుగల్ కోట, కల్లెడ` నొనరఁ జేసి
చివర `వెంకటాపురము`ను చేరినావు.


కం.
తెల్లని నవ్వుల మల్లెలు
పిల్ల లనుచు నెంచి సర్వ విధముల వారిన్
జల్లఁగఁ జూచుచు జ్ఞానపు
వెల్లువలోఁ దేల్చినావు; విజ్ఞాన నిధీ!


తే.గీ.
పాఠశాలలో నుత్తమ ప్రతిభఁ జూపి
నట్టి విద్యార్థులను మెచ్చి యాదరమున
పారితోషకముల నిచ్చి వారి నెల్ల
ప్రోత్సహించిన యాదర్శ మూర్తి వీవు.


కం.
మనమున మంచితనము నీ
వనయము నెలకొల్పి మిత్రు లందరు మెచ్చన్
వెనుకడుగు వేయకను ముం
దునకే సాగితివి కష్టదూరుఁడ వగుచున్.


తే.గీ.
సాధుశీల `రాజేశ్వరి`న్ సతిగ పొంది,
`శ్వేత` కూతురై, `శర`తల్లుఁడై తనరగ,
పౌత్రుఁడైన `హేమంతు` సంబర మిడంగ,
ధీవిశాలురు సత్కీర్తిఁ దెచ్చు సుతులు
`రామకృష్ణ, గౌతము, రఘురాము` లలర
భావి జీవనమున శాంతిఁ బడయఁ గలవు.


కం.
ఎద లుప్పొంగ సమర్పిం
చెద మిదె `బేత్యన్వయ నరసింహ స్వామీ`!
కొదవయె లేని శుభముఁ గన
పదవీ విరమణ సమయ శుభాకాంక్ష లివే!


సమర్పణ
విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు
యు. పి. యస్. వెంకటాపురం, మం. సంగెం.
రచన: కంది శంకరయ్య, విశ్రాంత తెలుగు పండితుడు.

11 కామెంట్‌లు:

 1. గురువు గారూ పద్యాలు కడు రమ్యంగా ఉన్నాయి.
  నరసింహ స్వామి గారికి మంచి బహుమానం.

  రిప్లయితొలగించండి
 2. శంకరార్యా!నవ రత్నములును నవ నవలాడుచున్నవి.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ, చక్కని పద్యాలు.చాలా బాగున్నాయి. శ్రీ నరసిం హ స్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకు సుదీర్ఘ ఆయురారోగ్య శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 4. శంకరార్యా !
  నవరత్న మాల
  ధరించిన మీ మిత్రులు నరసింహ స్వామి గారూ
  ధరింపజేసిన మీరూ
  దానిని గాంచిన మేమూ
  ధన్యులం !

  రిప్లయితొలగించండి
 5. మిస్సన్న గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  వసంత్ కిశోర్ గారూ,
  పద్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. వరంగల్‌లో ఉన్నప్పుడు సన్మానాలకు, పెళ్ళిళ్ళకు, రిటైర్‌మెంట్లకు ఎవరెవరో వచ్చి పద్యాలు వ్రాయించుకొని వెళ్ళేవారు. ఒకవిధంగా వరంగల్ జిల్లాలో నేను "సన్మాన పత్రాల" స్పెషలిస్టును. ఇప్పటికి కొన్ని వందలు వ్రాసాను. ఐతే వాటిని బ్లాగులో పెట్టలేదు. ఆ ఆలోచనే రాలేదు. కాని మొన్న మా బావగారి కొరికపై దీనిని బ్లాగులో పెట్టాను.

  రిప్లయితొలగించండి
 6. నవ రత్నాలు చాలా బాగున్నాయి మాస్టారూ!
  నరసింహ స్వామి గారికి పదవీ విరమణ మహోత్సవ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. వరంగల్లు వరంగల్లే, మాస్టారూ! ఆ శోభ హైదరాబాదులో కనిపించదు సార్.

  రిప్లయితొలగించండి
 8. పద్యాలు చాలా బాగున్నాయ్ మాస్టర్ గారు ....
  నరసింహ స్వామి గారికి పదవి విరమణ మహోత్సవ అబినందనలు

  రిప్లయితొలగించండి
 9. సుమలత గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం!
  మీ పేరంటే నాకు ఇష్టం. అది మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ పేరు. మా అమ్మాయి స్వాతి వాళ్ళ అన్నయ్యను పెళ్ళి చేసికోవాలి అని సుమలత కోరిక. కాని మా అమ్మాయి ఇష్టపడలేదు. "అది నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్‌గానే ఉండాలి. అది ఆడబిడ్డ అయి నా నెత్తినెక్కి నన్ను డామినేట్ చేయడం నా కిష్టం లేదు." అంది. ఇద్దరి పెళ్ళిళ్ళు అయి పిల్లలు కలిగినా వాళ్ళ స్నేహం కొనసాగుతున్నది.
  నా పద్యాలు నచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. మాస్టర్ గారు నా పేరు అంటే నాకు చాలా ఇష్టం మరి నా పేరు లోని మొదటి రెండు అక్షరాలు అంటే పిచ్చి కాని ఎవ్వరు పిలవరు అందరు బుజ్జికన్నాఅనేవాళ్ళే
  నా పేరు నచ్చినందుకు ధన్యవాదాలు;
  ఇంకా మంచి పద్యాలు రాయాలని కోరుకుంటూ

  రిప్లయితొలగించండి