4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 217 (రతికై సోదరిని వేగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. రవి గారూ,
    ఇంత స్పీడా? పూరణ చాలా బాగుంది. అభినందనలు. మిస్సన్న గారూ "హారతి"కి పిలుస్తూ పూరించారు. మిగతా కవి మిత్రులు దేనిని ఆశ్రయిస్తారో చూడాలి.

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారి పూరణ .......

    సతి తోడ సత్య దేవుని
    వ్రతమును సంపూర్తి జేసి, వందన మనుచున్
    నుతులను జేసియు, తుద హా-
    రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్!

    రిప్లయితొలగించండి
  3. గోలిహనుమచ్ఛాస్త్రి

    పతితో గూడియట రమా
    పతివ్రతమును చేయుచున్న పద్మావతి తా
    వెతికిమ్మని కప్పురహా
    రతికై సొదరిని వేగ రమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  4. గోలిహనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుందండీ మీ పూరణ. మీరూ "హారతి"నే ఆశ్రయించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించుచున్నవి.

    01)
    ________________________________________

    జత గూడిన సుదతి , గుడిన్
    హితముగ పెండ్లాడివచ్చి - హేలన్ నిలిచెన్!
    సతి పతులకు మంగళ హా
    రతికై సోదరిని వేగ - రమ్మని పిలిచెన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  6. ప్రతిదినము వరుస దప్పక
    వ్రతములు జరిపించు వాడు వర్జ్యము రాగా
    క్రతువు ముగించి చివరి హా
    రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  7. వసంత్ కిశోర్ గారూ,
    మీరూ "హారతి"నే ఆశ్రయించినా పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. రవి గారూ.. హారతి.. బాగున్నది, ప్రాస ఒకసారి చూడగలరు.

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారు, నెనర్లు. రెండు పద్యాలు ఒకేసారి ఆలోచిస్తూ చేసిన నిర్వాకం. సరిదిద్దుతాను.

    రిప్లయితొలగించండి
  10. సతతము శివపూజాదులఁ
    మతినిడి శంకరుఁ గొలిచెడు పావన చరితుం
    డతి వడిఁ బూజ సలిపి హా
    రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించుచున్నవి.

    02)
    ________________________________________

    సుత కొక పతకము కొనుటకు
    సతి, సోదరి ,తోడ బోయె - సంతకు ;నచటన్
    సుత తప్పిపోవ ,సుత భా
    రతికై సోదరిని వేగ - రమ్మని పిలిచెన్ !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి.

    కతిపయ దినముల నుండియు
    అతిగతి లేదనుచు మిగుల ఆతృతతో తా
    వెతుకను బోవుచు సతి భా
    రతికై, సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  13. రవి గారూ రెండవసారి ఇచ్చిన హారతి బహుబాగా ఉన్నది. అభినందనలు.
    హారతి నిచ్చుచున్న కవి మిత్రులందరికి అభినందనలు.బారతిని వెదుకుతున్న వారికి కూడా....

    గోలి హనుమచ్ఛాస్త్రి.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా !
    చాల దినముల నుండి
    ఈ సమస్య నన్ను వేధించు చున్నది.
    పాద్యాద్యక్షరములు గురు లఘువులలొ
    నేదో యొకటే యుండ వలెనను నియమము
    సులక్షణ సారము లోని క్రింది పద్యమున చెప్పబడ లేదు !

    ఆ నియమ మెచ్చట చెప్ప బడినది?
    అది కందమున కేనా ?ఇతరములకు వేనికైనా వర్తించునా??
    "త్రిశర" అంటే అర్థమేమి ???

    కందము త్రిశర గణంబుల
    నందము , గా భ జ స నలము - లట ,వడి మూటన్
    బొందును, నలజల నాఱిట
    నొందుం, దుద గురువు ,జగణ - ముండదు బేసిన్!

    రిప్లయితొలగించండి
  15. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
    బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.
    అందును గందంబులు నా
    నందంబులు భజసనలగాఖ్యలచే వా
    నిం దగు నెఱుగం బ్రాసము
    ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్.

    ఆదిమ వర్ణము వళి నిడు
    పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
    త్పాదాదుల నిలుపందగు
    గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్.

    నిడుదలగు పాదములకును
    వడి నాలవగణము మొదల వలయు నిలుప న
    క్కడలను గురువును మూఁడవ
    యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్.

    *ఇందు పుర బాణనగముల
    కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
    గందములకు నార్యాదుల
    చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్.
    *ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7

    కందము నర్థంబులతుద
    నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
    జెందిన జగణము లత్వముఁ
    బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్.

    క్రమమునఁ బథ్యార్యార్థము
    లమరంగా వీడుపడిన నది గాథాభే
    దముగాఁగం బరఁగు ప్రపం
    చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్

    రిప్లయితొలగించండి
  16. వెంకటప్పయ్య గారికి
    మిక్కిలి ధన్యవాదములు !

    అయ్యా ! నా వద్ద నున్న "సులక్షణ సారము"
    అను పుస్తకములో పై మొదటి పద్య మొకటే గలదు !
    అది సంగ్రహము కానోపు!

    కంద పద్య లక్షణముల దెలుపు నిన్ని పద్యములు గలవా!!!
    వీని మూల గ్రంధము ,రచయిత మొదలగు వివరములు
    దయచేసి జెప్ప ప్రార్థన !

    రిప్లయితొలగించండి
  17. హరి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రవి గారూ,
    హనుమచ్ఛాస్త్రి గారి సూచన మేరకు పద్యాన్ని సవరించారు. సంతోషం!

    వసంత్ కిశోర్ గారూ,
    "సుత భారతి ..." బాగుంది పూరణ. అభినందనలు.
    త్రి అంటే మూడు, శరమంటే ఒకటి. మూడూ, ఒకటి వెరసి నాలుగు. కందం త్రిశర (చతుర్మాత్రా)గణాలతో శోభిస్తుంది.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    వసంత్ కిశోర్ గారికి భారతిని సుత అయితే, మీకు సతి అయింది. బాగుంది.

    రిప్లయితొలగించండి
  18. రతి అగ్నిహోత్రి నాయిక
    అతులిత సౌందర్య రాశి, అభిమానంబే
    మితిమీర చిత్రముఁ గనగ
    రతికై, సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  19. గతిలేక పొలము పనులకు
    జత తన చెల్లెలిని గూడి చనె పొలతుక ! స
    మ్మతి మధ్యాహ్నపు వేళ , వి
    రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్.

    (విరతి = విశ్రాంతి , విరామము )

    రిప్లయితొలగించండి
  20. సు తపో భూమికి "అభ్యు
    న్నతికై" రమ్మనుచు పిలిచె "నారీ ! మాతా
    పితరుకై" రమ్మని "భా
    రతికై" సోదరిని వేగ రమ్మని పిలిచెన్. !!

    ప్రవాస భారతీయులను తలిదండ్రులకు వార్ధక్యంలో తోడూ, నీడా అందిస్తూ ఆనందం కలిగించటానికి, తాము కూడా అభ్యున్నతి పొందగలిగేందుకుగా, మాతృదేశ ప్రగతికి తోడ్పడవలసినదిగానూ ఆహ్వానం పలుకుతున్నాం

    రిప్లయితొలగించండి
  21. జిగురు సత్యనారాయణ గారూ,
    మీరు "రతి అగ్నిహోత్రి"ని ఆశ్రయించడం బాగుంది. నాకూ ఆవిడ గుర్తుంది. మరోచరిత్ర హిందీ వర్షన్ హీరోయిన్ కదా! మంచి పూరణ. అభినందనలు.

    డా. విష్ణునందన్ గారూ,
    అక్కాచెల్లెళ్ళకు "లంచ్ బ్రేక్" ఇచ్చిన మీ ప్రతిభకు వందనాలు. ఇంతటి ఉత్తమ పూరణ నిచ్చిన మీకు ధన్యవాదాలు.

    సనత్ శ్రీపతి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ఊకదంపుడు గారూ,
    అలా పూరించే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  23. 1960 విశాఖపట్నం:

    అతివల కింపుగ నుండెడి
    సతీసుమతి గాధ వినుచు సత్వరముంగన్
    పతితో గూడి "వివిధ భా
    రతి" కై సోదరిని వేగ రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  24. శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అతిగా ప్రేమను చూపుచు
    వ్రతమున పచ్చలు కొనుటకు భార్యకు తనకున్
    స్వతహా తూకము చేయుచు
    రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్

    రతి = గురిగింజ (పచ్చలతూనికయందొక యెత్తు)

    రిప్లయితొలగించండి