28, డిసెంబర్ 2024, శనివారం

సమస్య - 4986

29-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్”
(లేదా...)
“కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్”

19 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

ఎంతో కాలముగ నడుగ ,
కాంతా ! రమ్మనెను యోగి ; కైవల్యరతిన్
అంతయు కాకుండినయెడ
కొంతయయిన దానిని సమకూర్చుట కొరకై

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
చింతల్ వీడుచు మదిలో
సంతోషమ్మున తపమ్ము సత్ఫలమిడగన్
సొంతంబంచును ముక్తికి
కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్

శార్దూలవిక్రీడితము
చింతల్ వీడుచు ధ్యానమార్గమదియే సిద్ధించి భక్త్యాత్ముడై
స్వాంతంబందున దివ్య భావనల దోచన్ సచ్చిదానందమే
సొంతంబౌచును చేరవచ్చెననుచున్ శోభించు ముక్త్యాళువౌ
కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

విరించి చెప్పారు...


చెంతకు జేరుచు పాదా
క్రాంతుడనైతిని ఖలాంతకా! కృతి వాసా!
పంతమ్ము వీడుచు నుమా
కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్.


సంతాపమ్మును దీర్చు నామమొకటే సత్కర్మ గా నెంచుచున్
సంతోషమ్ము జపింతు సంతతము నిష్కామంబు తో నిత్యమున్
పంతమ్మున్ విడి దాసదాసుడననున్ పాలింపగా హే యుమా
కాంతా రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాంతారమ్మున పర్ణశాలకడ నిష్కామమ్ముగా మౌనితా
చింతల్ వంతలువీడి దివ్యపదముల్ సిద్ధించు యన్వీక్షతో
స్వాంతంబందున భక్తినిల్పి భవ! పశ్వత్పాలుడా! యో యుమా
కాంతా! రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మొదటి పాదం చివర 'మౌనియై'

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాంతారమ్మున నన్యఁపు
చింతల్ విడనాడి మోక్ష సిద్ధికొరకు దా
స్వాంతమ్మున భక్తిగ శ్రీ
కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

సంతానంబును వీడి మౌనమునఁ గాషాయంబు మైదాల్చి వే
దాంతావాసుని స్త్రోత్రముల్ పలికి యాత్మానంద భావంబునన్
ప్రాంతమ్ముల్ తరియించి పోవుటెటనన్ ప్రశ్నంబుకున్ బల్కెనా
కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్!!

కాంతారమ్ము = అరణ్యము

M.B.G.TILAK చెప్పారు...

కాంతను విడనాడితి నే
కాంతమున తపంబుసల్ప కాంక్షించితి కా
మాంతా!దయపడు గిరిజా
కాంతా! రమ్మనెను యోగి కైవల్యరతిన్

కాంతాప్రీతిని వీడియుంటినిగదా కైవల్యమున్ జేరగా
సుంతైనన్ హృదయంబునన్ నిలువదే సూక్ష్మాత్మపైదృష్టి యే
కాంతంబే సరియైన మార్గముగదా గంగాధరా! పార్వతీ
కాంతా!రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

కవుతా రామకృష్ణ చెప్పారు...

చింతాక్రాంతుఁడనౌదు రాజనగరున్ జీవింప, భూజానికిన్
వంతల్దీర్పగఁ జేయుయత్నములతోన్, వర్జింప నా యజ్ఞమున్
భ్రాంతిన్ వీడి తపంబుఁబట్టవలయున్ మంత్రీ! తగున్ నాకు నా
కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

[నాకున్ - ఆ- కాంతారమ్ము -అనె]

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శాంతా కారుని రుద్రుని
స్వాంతము నందున నిలిపియు స్వ చ్ఛ o ద ము గా
భ్రాంతి ని వీడి జపిo చుచు
కాంతా రమ్మనెను యోగి కైవల్య రతిన్

రామోక్తం చెప్పారు...

కాంతార్థ ఫలాపేక్షల
భ్రాంతి యొకింతయునులేక భద్రుడనైతిన్
శాంతేషణమున నేగెద
కాంతారమ్మనెను యోగి కైవల్యరతిన్

కాంతారము : అడవి

Bapatla Venkateswara sai చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Bapatla Venkateswara sai చెప్పారు...

ఇంతియు ముక్తికి బాటని
పంతముతో పెండ్లియాడ పడుచును నొకతిన్
భ్రాంతిన నుండి పిలిచె, నో
కాంతా రమ్మనెను యోగి కైవల్యరతిన్!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:కాంతాపుత్రుల బంధ మ
నంతమ్మే! బ్రహ్మమే యనంత మ్మిక నన్
శాంతికి పురికొల్పిన దీ
కాంతార మ్మనెను యోగి కైవల్యరతిన్”
(కాంతారం అతనికి శాంతి మార్గం గా అనిపించింది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:కాంతాపుత్రుల బంధముల్ ముగిసె నా కర్తవ్యముల్ దీర్చితిన్
భ్రాంతుల్ బొందుచు సంతతమ్ము వలదీ పౌత్రాది బంధమ్ము లా
వంతౌ జీవిత మింక ముక్తి కొరకే అర్పింతు,నా వాస మీ
కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అంతశ్శత్రుచయ మణఁచి
దాంతుం డయి వీడి యెల్ల దర్పమ్మును నా
సంతాపముఁ ద్రుంప రమా
కాంతా రమ్మనెను యోగి కైవల్య రతిన్


అంతా మాయ యటంచు నెంచి మది నిత్యానంద చేతస్కులై
యెంతే నిష్ఠఁ జరించు వారలరు లేవే కోర్కు లెన్నంగ వే
దాంతజ్ఞానులు సత్తపోధనులు మీ యావాస మెచ్చోటు నాఁ
గాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

సంతసమును ప్రక్కన నిడి
చింతావంతయును లేక చేయగ తపమున్
పంతమును వీడి ముక్తికి
కాంతా!రమ్మనెను యోగి కైవల్యరతిన్.

A.Satyanarayana Reddy చెప్పారు...

కాంతాపుత్రులె ముఖ్యమంచు సతమున్ కాంక్షించి స్వార్థమ్ముతో
నెంతోజీవితమంతమయ్యెననుచున్నేహ్యమ్ము సంప్రాప్తమై
వింతౌరీతిని సర్వమున్ విడిచి తాభిక్షుండునై, వాసమే
కాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


కాంతా వ్యామోహము విడి
కాంతారము చేరి నాదు గాయనములచే
స్వాంతము మెప్పింతున్ శ్రీ
కాంతా !రమ్ము నెను యోగి కైవల్య రతిన్.

కాంతారమ్మును చేరి చిత్తమున శ్రీకాంతున్ సదా తల్చుచున్
భ్రాంతిన్ వీడుచు నెల్లయున్ మురహరున్ పాదార్పణమ్మంచు తా
శాంతాకారము తోడ నెమ్మదిగ ధ్యాసన్నిల్పి ప్రార్థించి శ్రీ
*“కాంతా!రమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్”*