1, జులై 2025, మంగళవారం

సమస్య - 5170

1-7-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా”

(లేదా...)

“ఎలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా”

21 కామెంట్‌లు:

krkr చెప్పారు...

చిలువలుఁబలువలు రేపుచు
బలువురువిద్రోహులిచటఁబబ్బముగడుపన్,
చెలగుచుఁజెప్పిరిటులఁ"జి
ట్టెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా"
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

Sitharamayya Solasa చెప్పారు...

చిలుకపలుకులిడు జిన్నను
నలుగురు విని యచ్చెరువున నవ్వెడి రీతిన్
పలుకుమనగ నుడివె నిటుల ,
యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా !

పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
కలిమిని పొందఁ గోరుచు ప్రకాశ మయాంచిత బుద్ధి నిల్పి నే
నెలిమిగ కష్టమొందెడి పనిం బొనరించు నిశీథి కాలముం
గలిగిన నిద్రలో మునిగి కల్లల స్వప్నమునందుఁ గంటి చి
ట్టెలుకకుఁ బుట్టె నేనుగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ వలచఁగ బాలలు హాస్యము
చెలఁగ చలనచిత్ర మటుల చిత్రముల పరిన్
బొలుపుగ పిల్లలు మెచ్చఁగ
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

చం॥ వలచఁగ బాలలందరును భవ్యమటుంచును హాస్య మెంతయో
చెలఁగ విచిత్ర రీతులను చిత్రము, వింతగు జంతు జాలముం
దలఁచుట వైనమంచుఁ దగు నమ్మక ముంచి సృజించ నందులో
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా

వైనము ఉపాయము (నిఘంటువు సహాయమండి)

Animated cartoon movies రమారమి ఇలాగే ఉంటాయండి

విరించి చెప్పారు...


లలన చరవాణి యందున
పలు వింతల గాంచె నందు పరికింపంగన్
పులిగుహలో వసియించెడి
యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా.


పలు విధ వింతలన్ గనగ వచ్చునటంచును పాఠశాలలో
చెలిమరి చెప్పెనంచు నిలు చేరిన వెంటనె తండ్రి నడ్గగన్
వెలగన నెక్కువైన కడు పేర్మి గొనివ్వగ నందు గాంచగా
యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా.

M.B.G.TILAK చెప్పారు...

[వేద జ్యోతిష్యంలో 27 నక్షత్రాలను కొన్ని జంతు లక్షణాల ఆధారంగా 14 యోనులుగా విభజించారు]

తెలుపగ నడిగిరి వానిని
వలచిన జంటలకు యోని వర్గము తగునా
తిలకించిన జ్యోతిషుడనె
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

వలచిన వారి జాతకపు వర్గము లెంచగ సాటివచ్చునా
తెలుపుము వాస్తవమ్మనుచు తెచ్చిరి సర్వుల జాతకంబులన్
పలువురి జాతకంబులను బాగుగ చూచి వచించె జోస్యుడే
'ఎలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా'

Sitharamayya Solasa చెప్పారు...

చిలుకల రీతి పల్కునని చెంతకు బిల్చుకొనంగ , వానితో
నలుగురి మెప్పునొందుటకు నాలుగు మాటలు జెప్ప గోరగా
పలికెనతండు భీతిలక వాక్యమునొక్కటి వింత గొల్పుచున్
"యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

బలహీన మైన తల్లికి
బలవంతుడు సుతుడు బుట్ట పలికిరి మహిళల్
కిల కిల నవ్వుచు వింత గ
నెలుకకు జన్మించె నొక్క యెనుo గౌ రా!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కలు ద్రావిన మైకములో
పలికెనొకఁడు మతిచలించి పాలసునివలెన్
భళిరా కలికాలము! చి
ట్టెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కలుషఁపు మద్యముంగొనిన కల్లరియొక్కఁడు మైకమందునన్
పలికె బిడాలకమ్మునకు పన్నుగ బుట్టెను వానరమ్ము యిం
పలరగ గ్రామసింగమొక భారికి బుట్టినదక్కజమ్ముగా
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా

(భారి=సింహము)

పఠానేని కార్తిక్ చెప్పారు...

ద్రుతాంతం తరువాత యడాగమం రాదు మహోదయ. "గొల్పుచున్ యెలుకకు" అనేది తప్పు

Bapatla Venkateswara sai చెప్పారు...

కలిగిన సుతుడును వింతగ
పలికెను తన కుంతితోడ వలపుగ నగవున్
తిలకించి వాయు దేవుడు
ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా

Sitharamayya Solasa చెప్పారు...

🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కుల మరయ నంట రానిది
వెలిఁగెను గీర్తి శిఖరాన భీమ్రావ్ రామ్జీ
చెలువపు టంబేద్క రవని
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా


వెలసెనె యేకలవ్యుఁ డిల వింటికి నెక్కుడు నై చరించుచుం
గులము గణింప నల్ప మఁట గుట్టుగ నేర్చెను మించ నర్జునిం
జెలఁగును సృష్టి లోను గడు చిత్రము లెన్నియొ యెంచి చూడఁగా
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:గెలు పీయగ నీ కొండల
ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా!
అలసితిమి దీని తోడనె
పలాయనమె మంచి దంచు బరుగిడిరి రిపుల్
(శివాజీ మహారాజుకి కొండ ఎలుక అనే బిరుదు ఉంది. ఆయనకి గెలుపు ఇవ్వటానికే ఈ ఏనుగు జన్మించింది అని శివాజీ యొక్క ఏనుగును చూసి శత్రువులు భయపడ్డారు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:కలుగుల నన్నిటిన్ దనదు కాలిన ద్రొక్కుచు మృత్యురూపమై
ఎలుకకుఁ బుట్టె నేనుఁగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా”
బల మగు శత్రువై, తమదు బ్రాణము నిల్వగ నన్యజాతులన్
బలమగు జాతి చంపుటయె వన్యవిధానము కాదె చూడగన్?
(ఎలుకలకు మృత్యువుగా ఏనుగు,జింకకు శత్రువు గా వ్యాఘ్రము పుట్టాయి.)

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
కలిగిన బంట్రోతు కొలువు
వెలయింపగ తండ్రి సుతుఁడు విద్యాధికుఁడై
నిలచెను జిల్లానేలుచు
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా!

చంపకమాల
కొలువున భృత్యులై సఖులు కూరిమి విద్యల నేర్ప పుత్రులున్
దెలివిగ వారలున్ జదివి తేలఁగ రాబడి రక్షణంబునన్
బలమగు శాఖలన్! ప్రజలు వారలగాంచుచు నిట్లు పల్కిరే!,
"యెలుకకుఁ బుట్టె నేనుఁగు! జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!"

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !

చంపకమాల:

కలి పదమెట్టె గాంచుమయ కాయలు పండ్లును వింతఁజూపెనే
పలికెను ముందుకాలమున పాదప జంతువు వింత లెన్నియో
కలుగును వైపరీత్యములు గానగ లేమని పోతులూరియే
యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
ఎలుకకు బుట్టె నేనుగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!!

చంపకమాల:

తలచిరి శాస్త్రవేత్తలు విధాతను మించి సృజించ జీవులన్
మలచగ నెంచి జన్యువుల మార్పిడి సేయగ సాధ్యమేయనిన్
సలుపగ జీవజాలముల జన్యు పరీక్షల మార్పుతో భళా !
ఎలుకకు బుట్టె నేనుగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!!

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

నిలిచె గుమాస్తాగ పితయు
విలసిల్లగ సుతుడు మిగుల విద్యాధికుడై
తెలివిగ నయ్యె కలెక్టరు
నెలుకకు జన్మించె నొక్క యేనుంగౌరా!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కలుగున చిట్టెలుక యొకటి
నెలుకకు జన్మించె,,నొక్కయేనుంగౌరా
యిలలో నొసగెను జన్మయు
నలయక రెండింటి కచట నందరు జూడన్