14, జులై 2025, సోమవారం

సమస్య - 5182

15-7-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వారసుఁ గన నెంచఁ జేరె దాయ”

(లేదా...)

“వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే”

(పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
బాలకృష్ణుఁ జంపఁ బంపించ కంసుండు
నందమైనరూపునతివయౌచు
పూతన విషకుంభపుటెదతో మధురకున్
వారసుఁ గన నెంచఁ జేరె దాయ!

ఉత్పలమాల
కోరఁగ సాయమున్ హరిని, కూర్చొనఁజాలక పాద పీఠమున్
కౌరవ రాజరాజు కొనె గౌరవ మంచును శీర్ష పీఠమున్
జేరియు మీదటన్ తొలుత చెల్లెను క్రీడియె! కృష్ణ ప్రేమకున్
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే!

Sitharamayya Solasa చెప్పారు...

పుత్ర పౌత్ర పంక్తి పొందని ధనికుడు
బడెను వీలు నామ వ్రాయ కుండ ;
చనిన వాని యాస్తి చక్కగ పొందెడు
వారసుఁ గన నెంచఁ జేరె దాయ

విరించి చెప్పారు...

*(హిరణ్య కశ్యపుడు నారదునితో పలికిన మాటలు)*

అసుర జాతికెల్ల నధిపుడు వీడంచు
నమ్మియుంటి నోయి నారద విను
శత్రునామమెపుడు జపియించు చుండెనే
వారసుఁ గన నెంచఁ జేరె దాయ


ఫేరవ జాతి శ్వస్తనపు విట్పతి వీడని మోదమందితిన్
నారద! నీలిరాగమున నాసుతు బెంచదలంచ నేమి దై
త్యారిని స్మరియించుచు నతండిట ప్రక్కన బల్లమయ్యె నే
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే.

krkr చెప్పారు...

శ్రీరస కావ్యనాయకుడుఁజేరెనయోధ్యకుఁ బత్నితోడఁకై
వారములందగా నచటఁబట్టము గట్టిరి దేశవాసులున్,
దారనుఁబంపివేసెగద ధర్మమటంచును రామమూర్తిఁనే
వారసు రాకకై యెదురుపన్నుగ గాంచఁరిపుండుతోచెనే?
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తనకు శత్రువైన తనమేనయల్లుని
ప్రాణభీతిచేత బైసికొనఁగ
చెఱను మ్రగ్గుచున్న చెల్లెలు దేవకి
వారసుఁ గన నెంచఁ జేరె దాయ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కారణజన్ముడై భువిని కంసుని ద్రుంచగ ద్వాపరంబునన్
కోరిజనించె కృష్ణునిగ కోమలి దేవకి గర్భమందునన్
చారకమందునుంచి సహజన్ వసుదేవుల కక్కసమ్ముగా
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ ఆజి యందు రిపులు మోజుపడి సలుపఁ
బ్రాణనష్టముఁ గని పరితపించఁ
దప్పుఁ దెలిసి కొనుచుఁ దగు రీతి మసలఁగ
వారసుఁ గన నెంచఁ జేరె దాయ

ఉ॥ వీరులు వైరులిద్దరును భీకర యుద్ధము సల్పుచుండఁగన్
బోరునఁ బ్రాణనష్టమును భూరిగఁ గాంచఁగఁ దల్లడిల్లుచున్
మారిరి సఖ్యతా విలువ మన్నన సేయఁగ నెంచ నా విధిన్
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే!

అశోకుడు కళింగ యుద్ధము తరువాత మారినటులనండి

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
సారస సంభవ ప్రముద చారు కళాయుత కాంతకున్ వడిం
దీరుగఁ బూజలన్ సలుప దీక్షగఁ జెన్ను కవిత్వ శక్తికై
యూరిని చేరఁ దాను సుఖ యోగము వీడెను, నాదు కంటికిన్
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు దోచెనే !

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

స్థిర చరా స్తు లన్ని చెక్కు చెదర కుండ
వీలు నామ వ్రాయ వెదుకు చుండ
కలుగ లేదు దనకు కలిమి బొంద గలుగు
వార సు గన నెంచ జేరె దాయ

M.B.G.TILAK చెప్పారు...

వేగమె తొలివేల్పు విద్యను నేర్వ నౌ
రసుని బంపెగద హిరణ్య కశిపు
డే! హరిని భజించు డింగరి తోననె
వారసుఁ గన నెంచఁ జేరె దాయ

వేరము రాక్షసోచితపు విద్యను నేర్వగఁ బంపె పుత్రునిన్
బోరనఁ జెప్పమంచు దితి పుత్రుడు కోరెను దీర్ఘదర్శినే
ఘోరముగా సుతుండు హరిఁ గొల్చుట కన్గొని బల్కెనిట్టులన్
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:విప్రుడొకడు తనను వేధించ శిష్యుని
శస్త్ర విద్య తో నశాంతుడగుచు
వారసుఁ గన నెంచఁ జేరె దాయను జంప
జాలు ఫుత్రు బడయ జన్నమునకు.
(దాయ=శత్రువు.ద్రోణుని చంపే కొడుకు కోసం ద్రుపదుడు యజ్ఞం కోసం చేరాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:దూరమొనర్చి మైత్రి యల ద్రోణుని,విప్రుని చౌక జేయుచున్
దూరగ నేల?యజ్ఞుడయి దూరెను పో ఒక శిక్ష బొంద దా
నేరము దల్చి సిగ్గు బడ నేరక యా పగ నింక బెంచుచున్
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే”
(అంతా కలిపి ఒక బ్రాహ్మణుణ్ని అవమానించాడు.దానికి శిక్ష అనుభవించాక నేరానికి సిగ్గు పడక ఇంకా పగ పెంచుకొని ఆ బ్రాహ్మణ్ని చంపే వారసుడి కోసం యజ్ఞ మేమిటి? నిజానికి అతడంత ప్రథానం గా భావించ దగ్గ శత్రువు కాదు కదా! అది కేవలం రాచరికపు అహంకారం.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కన్న వారిపైన గౌరవ మది సున్న
యన్న దమ్ములందు నరుదు ప్రేమ
కాసులందు రక్తి గల యట్టి కలిలోన
వారసుఁ గన నెంచఁ జేరె దాయ


ఘోర తరాఘ వర్తనుఁడు కొడ్కట విప్ర కులాగ్రనేతకున్
సూర కులైక రాజునకు సూనుఁ డొసంగెఁ గలంత నిత్యమున్
వారక దానవేంద్రునకు వైష్ణవ భక్తుఁడు పుత్రుఁ డయ్యెనే
వారసు రాకకై యెదురు పన్నుగఁ గాంచ రిపుండు తోఁచెనే

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

సవతికన్నముందుసంతుతనకుపుట్ట
నాస్తు లెల్ల స్వంత మగునటంచు
మదినితలచిమంచిమాటలనాడుచు
*"వారసుఁ గన నెంచఁ జేరె దాయ”*


కోరగసంతురక్కసుడు కోమలి గర్భము దాల్చినంతనే
*వారసు రాకకై యెదురు పన్నుగ గాంచ రిపుండు తోచెనే*
తీరుగ బాల్యమాదిగను దేవుని యందున భక్తి హెచ్చగా
కూరిమివీడిబాధలిడె కుత్సితబుద్ధినిపూనితండ్రియే

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

మాట వినని సుతుకు మరణ శిక్షలు వేయ
జడియక హరి నామ జపము చేసి
స్తంభమందు జూపె శత్రువైన హరిని
వారసుఁ గన నెంచఁ జేరె దాయ.