21, జులై 2025, సోమవారం

సమస్య - 5189

22-7-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”

(లేదా...)

“న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ”

14 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

పజ్జన గలడని వచ్చిన
సజ్జనులను మోసగించి సంపాదించన్
బొజ్జను పెంచిన వాడగు 
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా;

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
సజ్జన సాంగత్యము విడి
యిజ్జగతిని గాయమందు నింపగు భాగాల్
బెజ్జము వేయుచు దొంగిలు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా?

శార్దూలవిక్రీడితము
గాయంబుల్, రుజమానెడున్ సరళిలోఁ గారుణ్యతత్థ్వాత్ముఁడై
శ్రేయంబందగ వైద్యమున్ సలుపగన్ శ్రీవిష్ణువంచెంచరే!
కాయంబందున దూరి చోరునివలెన్ గాఁజేయ భాగమ్ములన్
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సజ్జనుఁడయి నిరుపేదల
పజ్జకు తానేగి సేయ వైద్యము వానిన్
వెజ్జనదగు నన్యుండగు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా

విరించి చెప్పారు...


లజ్జ యిసుమంత లేకను
సజ్జన సేవను మరచుచు స్వార్థ పరుండై
యిజ్జగతిని గల కపటపు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా.


ధ్యేయంబొక్కటె యర్థసాధనమదే యింపంచు తా మెంచుచున్
శ్రేయంబున్ దలపోయకన్ జగతిలో శ్రీయున్న చాలంచు తా
హేయంబౌ పథమందునన్ చెలగెడిన్ హీనాత్ము లౌ వారైనచో
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మజ్జు గ మసలుచు నిరత ము
లజ్జను విడనాడి పేద లను నేడ్పి ంచే
వెజ్జును పోల్చుచు పలుకుచు
వెజ్జును నారాయణు డని పిలువగ దగునా?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

న్యాయాన్యాయ విచారణన్ విడిచి యన్యాయంబుగా పేదలన్
కాయంబందలి రక్తముం గుడుచునా కాఠిన్య చిత్తుండెటుల్
శ్రేయమ్ముం బొనరించు దీనజన సంక్షేమంబు పాటించకన్
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ

M.B.G.TILAK చెప్పారు...

సజ్జనులరుదై కనబడు
జజ్జరకార్లే బెడిదము జగతినరయ ని
ర్లజ్జగ జనులను దోచెడి
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా

చేయంజాలరు సేవ వారి కెపుడున్ జింతాయె సంపాదనే
హేయంబౌ పనులే సదా సలుపరే హీనాతిహీనంబుగా
న్యాయాన్యాయములన్ దలంచి నపుడే నాకొచ్చె సందేహమే
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ వెజ్జుగఁ బట్టముఁ బొందఁగ
లజ్జను వీడుచు ధనమును రయముగఁ గనఁగా
నిజ్జగమందున వర్తిల
వెజ్జుని నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా

శా॥ ప్రాయంబంతయు విద్యఁ గూర్చుకొని యుధ్భాసిల్ల వెచ్చమ్ము నెం
తో యాచించుచుఁ జేసి విత్తమును సంతోషమ్ముతోఁ బొందన
న్యాయంబంచును దెల్సి యార్జననె సన్మానించి వర్తిల్లఁగన్
న్యాయంబౌనొకొ వైద్యనిన్ బిలువఁగా నారాయణుండం చిసీ

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ముజ్జగముల రక్షించుచు
సజ్జనులన్ గాచు వేల్పు చక్రి , బతుకుకున్
బెజ్జము పెట్టు హరుం డీ
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”
(ఈ అసమర్థపు వైద్యుడు నస్రాయణుడు కాదు.లయకారి ఐన హరుడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:న్యాయమ్మౌ గతి నాడి జూసి,తన పై నన్ నమ్మకమ్ముంచు వా
డేయే పథ్యము జేయుచుండ వలెనో యేర్పాటు గా జెప్పి దీ
ర్ఘాయున్ జేయుట జెల్లు,సొమ్ము కొరకే యా మందులన్ గుప్పగా
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

బొజ్జను బెంచి ఘనమ్ముగ
లజ్జ విడిచి యీక యున్న లావుగ దుడ్డుం
బజ్జ కయిన రా నీయని
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా


ఆయా వేళల రక్షణం బొసఁగు నవ్యక్తుండు వైకుంఠుఁడే
రోయన్ బాధల నోర్వఁ జాల కవనిన్ రోగార్త కోటిన్ మృతి
చ్ఛాయా గ్రస్తులఁ గాచు భేషజములన్ సత్యమ్ము వీక్షింప న
న్యాయంబౌ నొకొ వైద్యునిన్బిలువఁగా నారాయణుండం చిసీ

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

లజ్జనువీడుచుసతతము
బొజ్జను నింపుకొననెంచుమోసమనస్కుల్
నిజ్జగమునసుజనులవరు
*“వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”*

న్యాయాన్యాయములెంచకుండగను ద్రవ్యంబేయిలన్ సర్వమై
కాయంబందునరోగమున్ననిక పైకమ్మందకన్చూడనన్
హేయంబౌపనులాచరించుచును తాహింసించనా కూళులన్
*"న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ”*

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

సజ్జనుల గుణము వీడుచు
లజ్జయె లేకుండ ధనము లాగుచు సతమున్
ఇజ్జగమున కపటుండగు
వెజ్జుని నారాయణుఁడని పిల్వగఁ దగునా?