17, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5216

18-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ముసురు పట్టిన దినము సుఖకరము”

(లేదా...)

“ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా”

25 కామెంట్‌లు:

M.B.G.TILAK చెప్పారు...

ఇక్క పట్టునుండ చిక్కును విశ్రాంతి
కసరు తేనెలట్టి కథలనెల్ల
చదివి సంతసించు సమయమాసన్నమై
ముసురు పట్టిన దినము సుఖకరము

Sitharamayya Solasa చెప్పారు...

వేసవి దివసముల వేడిమి కతమున 
పుడమి క్లేశమొందె భువనము నకు ,
ఎదురు చూచుచుండ నిపుడిన్నినాళ్ళకు
ముసురు పట్టిన దినము సుఖకరము

విరించి చెప్పారు...


బయటి పనుల కేగ పనియింక లేదయ్యె
బంధువెవడు రాడు పర్పమునకు
ప్రశ్నగుర్తువోలె పవళింప గావచ్చు
ముసురు పట్టిన దినము, సుఖకరము.


అసహాయుండ్రగుచున్ గృషాణులట తామాకాశమున్ గాంచి ప
న్నసమున్ దున్నిపరాయణమ్మున నటన్ నాటేసినన్ గాంచ ప
ర్ణసియేలేదని దైత్యదేవుని నటన్ బ్రార్థించు నవ్వేళలో
ముసురింతైననుఁ దగ్గకుండఁ గిరియన్ మోదంబు గల్గున్ గదా.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
ఉల్లితురిమి పెట్టి యిల్లాలు ముచ్చటన్
మిర్చి బజ్జి ప్రేమ మీరఁ గాల్చి
నిమ్మ రసము చల్లి కమ్మగ వడ్డించ
ముసురు పట్టిన దినము సుఖకరము!

మత్తేభవిక్రీడితము
దిసలెల్లన్ కరిమబ్బు గ్రమ్ము ఋతువై తీరంగ నాకాశమే
వసతిన్ జేరగ తెల్లయుల్లి తురుమున్ పల్లెంబునన్ జేర్చియున్
బసగల్గన్ సతి నిమ్మపిండి రుచిగన్ బజ్జీల వడ్డింపగన్
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా!

పఠానేని కార్తిక్ చెప్పారు...

మ.
దెసయో యేమొకొ కన్నుదోయికిని యుత్సేకించుచున్ గాంచినన్
కసి చల్వల్ గొని క్రమ్మె నిప్డు తగు సంకల్పంబుచే మంచుల్
లసదాక్రాంత విశాల శీతనగ హీర ద్యోతవద్రూఢితో,
ముసురింతైనను దగ్గకుండ గిరియన్ మోదంబు గల్గున్ గదా !

పఠానేని కార్తిక్ చెప్పారు...

మొదటి పాదం సవరణ:-
"దెసయో యేమొకొ కన్నుదోయికిని యుత్సేకించినన్ దోచునే"

M.B.G.TILAK చెప్పారు...

కసితోడన్ బనిచేయకుండ ముసురే కల్గించు నిశ్చింతతన్
విసుగంతంబగు నింటిపట్టు స్థిరమై విశ్రాంతి చేకూరగా
రసవంతంబగు కావ్యమెంచి చదువన్ లభ్యంబగున్ వైళమే
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాలు కదపకుండ కావలసినవెల్ల
నింట నమరినప్పు డెవరికైన
వానజల్లు పడిన పల్లటమేముండు?
ముసురు పట్టిన దినము సుఖకరము

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఇసుమంతేనియు కక్కసమ్మొదవకన్ యెంతేని సౌఖ్యమ్ముతో
వసనమ్మందున వస్తు సంచయము సంప్రాప్తించ నింకేటికిన్
వెసనమ్మొందు నగత్యమేరుపడు, నుద్వేలమ్ముగా నుర్విపై
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:బయట కేగు వృత్తియె లేక పైక మున్న,
ఇంట చాయి కాఫీ లిచ్చు నింతి యుండి
యామె సరస సౌందర్యాల నలరుచున్న
ముసురు పట్టిన దినము సుఖకరము”

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:ముసురో,భీకరకుంభవృష్టియొ,మరిన్ భూకంపమో తాళముల్
వసియించంగనె నాకడన్ విధిగ నే పర్వెత్తుటే బ్యాంకుకున్
సిసలౌ ధర్మము, నేను బాలు నయినన్ జెల్లున్ బడిన్ వీడగా
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా”
(నా దగ్గర బ్యాంకు తాళా లున్నప్పుడు ఎంత కష్ట మైనా బ్యాంకుకి వెళ్లాలి.చదువుకొనే పిల్ల వాణ్నైతే ముసురు పడితే బడి మానెయ్య వచ్చు.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ మండు గ్రీష్మమందు మనుజులు బాధల
పరిని విసుగుఁ జెంది భయము నొదవి
కష్టపడెడు వేళ కారు మబ్బులు క్రమ్మి
ముసురు పట్టిన దినము సుఖకరము

మ॥ అసలా వేసవి మండుటెండలకు నాహ్లాదంబు శూన్యంబునై
విసుగున్ జెందుచు నీరసించి మనుజుల్ భీతిల్ల బాధార్తులై
హసనంబున్ గన నల్ప పీడనపు సౌహార్దమ్మునన్ మబ్బులన్
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తనువు తాకి నంత తాపమ్ము నశియించు
చల్ల గాలి వీచి యుల్ల మలర
నురుము మెరుపు తోడి యున్న దు న్నట్టు గా
ముసురు పట్టిన దినము సుఖ కరము

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

వృత్త మొదటి పదము 'దెస' అని సవరణ

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా!

మత్తేభము:

ఉసురుల్ ముఖ్యమనెంచియే రయితులే యుక్తంబు కార్యంబనిన్
వెసులున్ జూడక స్వార్ధమున్ విడచియే వేయంగ సస్యంబులన్
అశువుల్ కన్నుల నిల్పుచున్ కరములన్ ప్రార్ధించ దైవంబునే
ముసురింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఉండ దుడ్డు చేతి నిండుగ నెన్నండు
కడుపు లోనఁ జల్ల కదలకుండ
నూసు పోక కాట లుండంగ దండిగ
ముసురు పట్టిన దినము సుఖ కరము


అసువుల్ కుందఁగఁ గుండ పోఁతగను నిత్యం బక్కటా ధాత్రినిన్
ముసు రింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు క్షీణింపదే
యసదై యుండఁగ నౌర వర్ష మిల మర్త్యానీక భూతాలికిన్
ముసు రింతైననుఁ దగ్గకుండఁ గురియన్ మోదంబు గల్గున్ గదా

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"... మ్మొదవకే యెంతేని.." అనండి. రెండవ పాదంలో గణభంగం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*దోయికిని నుత్సేకించు..* అనండి. రెండవ పాదంలో గణభంగం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

అన్ని యింటియందె యమరిన వారికి
ముసురు పట్టిన దినము సుఖకరము
రోజు కూలి తోడ రోజు గడుపు వార్కి
పస్తులుండు దినము పనియు లేక.