22, ఆగస్టు 2025, శుక్రవారం

సమస్య - 5221

23-8-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ”

(లేదా...)

“పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే”

12 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఒక తండ్రిరోదన:


తేటగీతి
కులము కాని వాని వలచి కోరినంత
సాధ్యపడదు మనువనంగ చచ్చిపోయె!
పెళ్ళిఁ జేయఁగ లేమంచు విప్పిసుతకు
జెప్పినన్ బోనిదే 'పోయెఁ' జెప్పకుండ!

ఉత్పలమాల
నెమ్మిని పెంచినాము సుత నేర్వగ విద్యకు పంపినామహో!
ద్రిమ్మరి నొక్కడిన్ వలచి తెమ్మనె వాడె వరుండు! నాకనెన్!
రమ్మనకుండ ద్వారమును రయ్యున మూయుచు వాడితోడనే
పొమ్మని యెంత చెప్పినను బోనిదె 'పోయె'ను జెప్పకుండనే!

విరించి చెప్పారు...


మరణ కాలమ్ము రాకున్న ధరణియందు
జీవులెంత యత్నించిన చావలేరు
ప్రాణమదిపోవు నాడింక వలదటంచు
చెప్పినన్, బోనిదే పోయెఁ జెప్పకుండ


చెమ్మయెజేరు కన్నులవి ఛీయని వాడి దరిద్రమే గనన్
గెమ్మటలెన్నొజేసెనని గిట్టుటె మార్గమటంచు నెంచు వా
డిమ్మహి వీడనెంచెకద యెన్నియొ మారులు ప్రాణమా యికన్
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే.

Sitharamayya Solasa చెప్పారు...

రోగిని యెర గుంచ మనుచు రోగహారి
పుట్టెడగదముల నొసగి , పోవుననుచు
చెప్పినన్ బోనిదే , పోయెఁ జెప్పకుండ
నేతీ బూరెలను గుడిచి నిదురబోవ

M.B.G.TILAK చెప్పారు...

అన్యదేశాన నివసించు నాత్మజుండు
రమ్ము రమ్మని పిలిచినఁ సమ్మతింప
లేదు లోలనయన సుతులెన్నిమార్లు
చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ

రమ్మని వాయుమార్గమున లక్షలు వెచ్చమొనర్చి పుత్రులే
పిమ్మట చీటినంపిరట పెద్దవిమానపు యాత్ర చేయగా
సమ్మతి నీయకున్నతరి సంతును చూచుటకున్ బ్రయాణమై
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చంద మామను బోలిన చక్క నైన
వరుని తో వివాహ ము చేయ వధువు వెడల
కుండ నుండగ నామెకు కోర్కె పుట్ట
చెప్పి బోనిదే పోయె చెప్ప కుండ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మగనిపై నలుకనుబూని మగువ చేరె
పుట్టినింటికి తగదిది పొమ్మటంచు
తనయకు హిత వచనములు తండ్రి యెంత
చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కమ్మని కాపురమ్మున నకారణ కొందలపాటు లేర్పడన్
యుమ్మలికమ్ము తోడనొక యుగ్మలి చేరెను పుట్టినింటికిన్
సమ్మతికాదు నీవు పతి సన్నిధివీడుట యంచు తండ్రియే
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ రమ్మనంగ జ్ఞానమిలను రాదు తెలుప
పొమ్మనంగ పోదు భువిని బుద్ధిలేమి
కార్య దక్షతఁ గాంచుచు ధైర్య మొదవి
చెప్పినన్ బోనిదే పోయె చెప్పకుండ

ఉ॥ రమ్మని యెంత వేడినను రానిది జ్ఞానము ధాత్రి యందునన్!
పొమ్మని యెంత వేడినను బోనిది తెల్పఁగ బుద్ధి మాంద్యమే!
గమ్మున కార్య శీలతను గాంచిన పిమ్మటఁ జూచు చుండఁగన్
బొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే

ప్రయత్నం సాధన ముఖ్యమండి (తరువాత అదృష్టం) serendipity follows hard work n attitude. Rarely does it betray.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ: సాయి బాబా గుడికి బోయి చేయి సేవ
యనగ నోపిక లేదని యనెను,గుడిన
చీరలకు వేల మట యని చెప్ప, నేను
చెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ”

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చెప్పినన్ అని సవరణ

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:"అమ్మకు జబ్బు చేసె నని, యామెను జూడు "డటంచు జెప్పె మా
తమ్ముడు,వెంటనే సెలవు దక్కదు,నీ వొక మారు చూడగా
పొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండ, నే
యమ్మయొ పిల్చినంతటనె యాదగిరిన్ గన మైత్రి జూపుచున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మున్ను సేసిన తమ కార్యముల వలననె
దొరకు నరులకు సుఖ మేని దుఃఖ మేని
పోకు పోకుమ యన్నను పోయెడిదియుఁ
జెప్పినన్ బోనిదే పోయెఁ జెప్పకుండ


నెమ్మిఁ జరించు లోన ననునిత్యము జీవి కొసంగఁ జేతనన్
రమ్మని పిల్వఁ గాలుఁడు కరమ్ము రయమ్మున నేఁగు నింగికిం
గ్రమ్మఁగ నీతి బాధ లిలఁ గాయము సైపఁగ నోప కార్తితోఁ
బొమ్మని యెంత చెప్పినను బోనిదె పోయెను జెప్పకుండనే