26, ఆగస్టు 2025, మంగళవారం

సమస్య - 5225

27-8-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

వినాయక చవితి శుభాకాంక్షలు!

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మంచిద హరికథ గణేశ మండపమున”

(లేదా...)

“హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్”

15 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

చంపకమాల
పెరిగిన భక్తితత్పరత విద్యలు నేర్చెడు బాలబాలికల్
మురిపెమునన్ విరాళముల పొందుచు వేడుక తీర్చినారనన్
గురికొని తా నహల్యపయి కుక్కుట రూపము నెత్తివచ్చెడున్
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
విద్యనేర్చెడు బాలలు వేడ్కనెంచి
తీర్చినారయ భక్తితో దేవళమున
కుక్కుటముగ వచ్చి యహల్యఁ గొనిన కతన
మంచిద హరికథ గణేశ మండపమున?

Sitharamayya Solasa చెప్పారు...

కొండ యల్లుడగు శివుని కొమరుడు గద ,
యాత నిని ప్రతిష్ఠించిన యాలయమున ,
చేతనగును కదాయని చెప్పుకొనగ
మంచిద హరికథ , గణేశ మండపమున ?

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

పరమ పవిత్ర స్ధానమని భక్తులు
మిక్కిలి యాత్మ శుద్ధితో
నరయగ శ్రోతలెల్లరు గడాదర
భావముతోడ ప్రేమతో
వరదుని దివ్య గాథ విన భక్తులు
వచ్చిరి నీవు త్రాగియున్
హరికథ చెప్ప దోషమగునయ్య
వినాయక మండపంబునన్

krkr చెప్పారు...

స్వరములసాధనమ్మునను వాణియెఁబల్కగఁ బూర్వపుణ్యమై
సురుచిర వాజ్ఞ్మయం బుమరి శోభితమొప్పుచు సాగునోయనన్
వరుసలుఁదప్పుగాగనటుఁబాటవమించుక లేనివారలే
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
కరిముఖ పూజ జేయగ వికాసమయి వృద్ధిని గాంచె భవ్య వి
స్ఫురదభిరామ వైభవము, సొంపగు తెన్గుకళాళి ప్రోత్సహిం
ప రయము పూనె సార్థకుడు పండుగ వేళను, వ్యంగ్య పూరమౌ
హరికథ జెప్ప దోషమగునయ్య వినాయక మండపంబునన్ !

విరించి చెప్పారు...

కేకలు పెడ బొబ్బలతోడ పేకముక్క
లాటలు సినిమా నృత్యములచట నాడ
మంచిద , హరికథ గణేశ మండపమున
నేర్పరచిన మేలగు నదె యింపు గాదె.


అరయగ భక్తిభావమును వ్యాప్తిని జేసెడి లక్ష్యమందునన్
పురమున వీధులందు శివ పుత్రుని పూజలు పెద్దయెత్తునన్
జరిపెడి వేడ్కలందునను సత్కథ జెప్పుట మేలు, నెవ్విధిన్
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్.

M.B.G.TILAK చెప్పారు...

మంచిద హరికథ గణేశ మండపమున
నంచు సందియమ్మును కలిగించనేల?
పార్వతీ పరిణయ కథఁ బలుకునపుడు
గిరికథ యననొప్పును గద సురుచిరముగ!

హరికథయన్న సత్కథను హాయిగ తెల్పెడు సంప్రదాయమే
సరియగు రీతి నల్లిన రసాన్విత కావ్య విశేష గానమే
గిరిసుత సత్కథామృతము కీర్తన చేయఁ దలంతు నెవ్విధిన్
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

హరునకు హరికి భేదమీ యవనియందు
నరులు జూచుట సరికాదు తరచి చూడ
హరిహరులనిన నొక్కఁడె, యడుగనేల
మంచిద హరికథ గణేశ మండపమున?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

హరియన నీశ్వరుండు హరుడన్నను కేశవుడే గణింపగన్
హరిహర భేదమున్ మనమునందున దాల్చుట పాడియౌనె శం
కర వినుతుండు మాధవుడు గావునఁ నేటికి శంకబూన, శ్రీ
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్?

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మంచిద హారికథ గణే శ మండప మున
చిత్ర గీతాలు మేలంచు చెప్పె నొకడు
నాట్య భంగి మ లలరించు నవ్య మగుచు
ననుచు సలహాల నొసగిరి నవ్యు లిలను

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ప్రశ్నోత్తరి

తే.గీ:శివుని పుత్రుని నిలుపుక సేవ జేయ
మంచిద హరికథ గణేశ మండపమున?
ఈ కథన్ హరి హరు గాచె నిందు వలన
మంచిద హరికథ గణేశ మండపమున
(మొదటి పాదం లో మంచిదా? అని ప్రశ్న.రెండవ పాదం లో మంచిదే అని సమాధానం. వినాయకుడి కథ లో విష్ణువు శివుని రక్షించాడు కనుక అది హరికథ కూడా అవుతుంది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ప్రశ్నోత్తరి

చం:హరుని కుమారుడౌ గద గజానను డాతని పర్వ మందునన్
హరికథఁ జెప్ప దోషమగునయ్య వినాయక మండపమ్మునన్”
హరియె గజాసురున్ దునిమి యా హరు గాచెను గాదె ! యెవ్విధిన్
హరికథ జెప్ప దోష మగు నయ్య వినాయక మండపమ్మునన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

రాఘవుఁడు ప్రతిష్ఠించెను రక్తి శివుని
వాసుదేవుఁడు పూజించెఁ బరమ శివుని
హరిహరుల విభేదము పాడి యౌనె కాన
మంచిద హరికథ గణేశ మండపమున

[మంచిద = మంచిదే]


హరికి జనించెఁ బద్మభవుఁ డాది వెలింగెను సృష్టి కర్తయై
హరుఁ డుదయించె రుద్ర నిచయాఖ్యను బన్నుగఁ బద్మయోనికిన్
వర సుతుఁ డయ్యె విఘ్న గణ భర్త త్రినేత్రున కట్టు లైనచో
హరికథఁ జెప్ప దోష మగు నయ్య వినాయక మండపమ్మునన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

భక్తితో వినాయక నుత్సవంబు చేయ
వలయు కాని డీ జే శబ్దములను యువత
చిత్ర గీతాల నృత్యాలు చేయుచుంట
మంచిద!హరికథ గణేశ మండపమున
నేర్పరచ సముచితమగు నిర్ణయంబు.