29, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5289

30-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే”
(లేదా...)
“చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్”

18 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. చ.
      అరులను జూచి యెడ్తరకు నాజిని స్వేచ్ఛను గూర్చి సింహమై
      పరువులు వెట్టి చంపెను గృపాణము రక్తముతోడ దడ్వ భూ
      వరునకు కీర్తి చేర వర పండితులప్పుడు మేని గాయముల్
      చిరిగిన వస్త్రముల్ గన విశేషముగా నుతియింత్రు సత్సభన్ !

      తొలగించండి
  2. అరుదగు తుఫాను కతమున
    పురమున వాటికలు నీట మునుగగ వాటిన్
    సరిజేయు చుండు నప్పుడు
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే

    రిప్లయితొలగించండి
  3. కందం
    సిరిగలిగిన లేకున్నను
    ధరియించుట నాగరికత ధాత్రిని వలువల్
    కొరతల ప్రోగున గుట్టిన
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే!

    చంపకమాల
    ఉరువులఁ జూపెడున్ బగిది నొప్పని రీతిగ చించి పీలికల్
    తరిగిన సంప్రదాయముల దాల్చఁగ నాగరికుల్! విమర్శలన్
    గురియుచు పోసి కుప్పగను కూడదటంచును గాల్చినంతటన్
    జిరిగిన వస్త్రముల్! గని విశేషముగా నుతియింత్రు సత్సభన్

    రిప్లయితొలగించండి

  4. తరములు మారెను తాతా
    బరువది కాయమ్ము నిండ వలువలు దాల్చన్
    బరదేశము లందు గనగ
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే.


    బరువది కాదె కాయమును వస్త్రము నందున దాచుటయ్యదే
    తరములు మారె నంగముల దాచుటె తప్పని యెంచు చుండిరం
    చు రమణి చెప్పె నివ్విధిని జూడ విదేశము నందుపౌరులే
    చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు, సత్సభన్.

    రిప్లయితొలగించండి
  5. చిరుగులఁ గలిగిన వలువలు
    పరువని భావించుచుంద్రు బహిరంగముగా
    సరియగు బొక్కల కొలతలు
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే

    మరచిన సంప్రదాయముల మారెను గాదొకొ దృష్టికోణమే
    పరులని జూచి మూర్ఖులయి వస్త్రములన్ ధరియించువారలే
    పరువని యెంచుచుంద్రకట! బట్టలలో పలు బొక్కలుండగా
    చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్

    [బొక్కలు = రంధ్రములు]

    రిప్లయితొలగించండి
  6. కురులకు పలురంగులలది
    కరరుహములు చికిలిబెట్టి కడలుగొనంగన్
    అరుణిమ చెక్కుల టెక్కులఁ
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే

    రిప్లయితొలగించండి
  7. పరగులు పెట్టుచుండిన ప్రపంచము నందున హృచ్చయంబుతో
    కురుచుగ నున్నదుస్తులను కోరి ధరించుట దాని తోడుగన్
    కుఱువులు చక్కగన్ ప్రజకు గోచరమయ్యెడి పొక్కలుండు యా
    చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్

    రిప్లయితొలగించండి
  8. కరతలమున చరవాణము
    అరిమురి నడకలు దెరవుల నరవిరిగనులన్
    అరయగ నాగరికమిదెయె
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే

    రిప్లయితొలగించండి
  9. పరువఁపుటొంపులు సొంపులు
    నెరవుగ బహిరంగ పరుచ నెలతకుఁ దగునా?
    పొరబడి తలవకు లలనా
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే!

    రిప్లయితొలగించండి
  10. పరువఁపుటొంపు సొంపులను బట్టబయల్పడు రీతి కన్నియల్
    విరివిగ వస్త్రధారణము వేమఱు సల్పఁగ నేమి కర్మమో
    పరువునుదీయు పోకడలు భావ్యమొకో? సుదతీ తలంతువే
    చిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్?

    రిప్లయితొలగించండి
  11. తరచుగ పేదవారలను దక్కువగా
    గణియింత్రు వారికిన్
    కరము వివేకమున్ జదువు
    కల్గిన వారలు వేసుకున్నయా
    చిరిగిన వస్త్రముల్ గని, విశేషముగా
    స్తుతియింత్రు సత్సభన్
    అరయగ మేడలున్ మిగుల
    నర్థము గల్గిన వారినిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  12. కం॥ చిరిగిన బట్టలఁ గట్టగ
    ధర సిగ్గుఁ బడిరి గతమున ధన్యతఁ గనుచున్
    వరలఁగ నవ నాగరికత
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే

    చం॥ చిరిగన బట్టఁ గట్టనటు చేసిన పాపమటంచుఁ దల్చుచున్
    విరియఁగ బాధ యెక్కువగ వేదన నొందిరి నాఁడు పేదలే!
    తరుణము మారె నిప్పుడిలఁ దర్కమదేలనొ మోజు హెచ్చఁగన్
    జిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్

    (నవ నాగరికత మహిమ అండి. అత్యంత ధనికుల సరదా మరి)

    రిప్లయితొలగించండి
  13. కరువది యే దియు గాదయ
    పరుల నను క రించు ట నె డి పైత్యం బది యే
    నరుల కల వడె నదే మి టొ
    చిరిగిన బట్టలను గట్ట జేకురు బరువే,!?

    రిప్లయితొలగించండి
  14. కం:వరియించె నర్థ నగ్నత
    ధరియించగ నృత్య పాత్ర తరుణి,యటు పయిన్
    వరియించె క్యాబరే యిక
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే”
    (ఇక్కద "బరువు" ని "బరువు" అనే అర్థం లోనే వాడాను.సినిమా లో అర్థనగ్నం గా నటించింది.క్యాబరే లోకి దిగాక చిరిగిన బట్టలు కూదా బరువే అనిపిస్తున్నాయి.)

    రిప్లయితొలగించండి
  15. పర దేశస్థుల మహిమము
    విరివిగ వ్యయము నొనరించి విత్తముఁ గనుమా
    నరవరుల నేఁటి పోకడ
    చిరిగిన బట్టలనుఁ గట్టఁ జేకురుఁ బరువే


    తరతమ భేద మెంచక సదస్యులు నచ్చెఱు వంది నిల్వఁగా
    గురువుగ నెంచి డెందములఁ గూరిమిఁ జూపి కడింది వింత ము
    న్జరిగిన పండితోత్తముని చర్య నెఱింగిన నాఁటి నుండియుం
    జిరిగిన వస్త్రముల్ గని విశేషముగా నుతియింత్రు సత్సభన్

    రిప్లయితొలగించండి