22, ఏప్రిల్ 2024, సోమవారం

సమస్య - 4743

23-4-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్నిశిఖల మీద నాడె శిశువు”
(లేదా...)
“అగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్”

19 కామెంట్‌లు:

  1. కాళిసర్పంబుపడగపై కాలుపెట్టి
    తాండవంబునుజేసెగాధర్మమూర్తి
    చిన్నిపాదంబుతోడుతచెనకెచెడును
    అగ్నిశిఖలపైనినాడెశిశువు

    రిప్లయితొలగించండి
  2. లగ్నంబైనదిమానసంబునటనాలంబేలజేయంగనౌ
    మగ్నుండాయగసాధకుండుగనతామాయన్విడన్వేగమే
    భగ్నంబైజనెమాయతెమ్మెఱలునేభావంబుతానంటకే
    అగ్నిజ్వాలలపైననొక్కశిశువాడెన్మనోజ్ఞమ్ముగన్

    రిప్లయితొలగించండి
  3. బాలకృష్ణు లీల వర్ణింప తరమౌన
    చంప వచ్చి చచ్చె శకటరూపి
    అలుసు జేయ నెంచు యసురుల గర్వంపు
    అగ్ని శిఖల మీద నాడె శిశువు

    రిప్లయితొలగించండి
  4. దద్దరిల్లెజగముతాండవమాడగా
    చిన్నికృష్ణుడంతజేరికాళి
    ధర్మతేజుఁజూచితృప్తినిపొందగా
    అగ్నిశిఖలపైననాడెశిశువు

    రిప్లయితొలగించండి
  5. దురితమేమి నాదొ? దుష్యంత మహారాజు
    నాడు నను వివాహమాడి, మఱచె!
    నని శకుంతల సుతుఁగనఁగఁ దనదు భావ
    నాగ్నిశిఖల మీద నాడె శిశువు!

    శార్దూలవిక్రీడితము
    మగ్నమ్మౌచును నాటి ప్రేమసడిలో మాటాడ, దుష్యంతుఁడు
    ద్విగ్నంబొంద శకుంతలన్ మఱచి నిర్వేదంబునన్ ముంచఁగన్
    భగ్నమ్మైనది నాదు స్వప్నమనుచున్ బాలున్ గనన్ భావ దుః
    ఖాగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్!

    రిప్లయితొలగించండి
  6. మారు బేరగాడు మణుగు కుంకుమపువ్వు
    మూటలుగను కట్టి మూల బెట్ట
    వాని సుతుడు గాంచి ప్రాకుచు నటజేరి
    యగ్ని శిఖల మీద నాడె శిశువు.

    రిప్లయితొలగించండి
  7. అగ్నిన్ రాల్చెడు చూపులన్ గలిగి హ్వార్యమ్మొక్క టిచ్చోట ని
    ర్మగ్నంబై కబళించుచుండె నదియే మా గోవులన్ కాంచగన్
    భగ్నంబయ్యెను గోవు క్షేమమని గోపాలుండ్రు వాచింప నా
    అగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్.

    రిప్లయితొలగించండి
  8. భాను వరము వలన బడసిన తనయుని
    కుంతి నీట విడిచి కుములు చుండ
    నట్టి వేళ యందు నశ్రువు ల్ రాల్చ శో
    కాగ్ని శిఖ ల మీద నా డె శిశువు

    రిప్లయితొలగించండి
  9. సాహసమగు కేళి సలిపెడు మండలి
    పురమునందు రాత్రి పూట జూపు
    యద్భుతమగు కేళి యందొక కృత్రిమ
    యగ్నిశిఖల మీద నాడె శిశువు

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. ఆ॥ హరినిఁ గొలువ పుత్రుడనవరతమ్మును
      దండ్రి ఖిన్నుఁడౌచు తగదనంగ
      మానక చను సుతుని మంటలఁ బడవేయ
      నగ్ని శిఖల మీద నాడె శిశువు

      శా॥ భగ్నంబయ్యెను దండ్రి మానసము సంభావించి పుత్రుండటుల్
      మగ్నంబై హరి నామ సంస్మరణమే మద్భాగ్యమౌ సేయఁగన్
      నగ్నంబౌ నిజమన్నఁ గ్రుద్ధతను కీనాశంబునందుంచఁగా
      నగ్ని జ్వాలల పైన నొక్క శిశువాటాడెన్ మనోజ్ఞమ్ముగన్

      గణభంగము సవరించానండి, శార్దూలము రెండవ పాదములో నేటికీ అప్పుడప్పుడు ఇలా తప్పులు వస్తూనే ఉంటాయండి.

      తొలగించండి
  11. కాళియుడు వసించు కాళింది మడుగులో
    విషము వలనఁ బ్రతుకు విషమ మాయె
    హరి ఫణములపైన మురభిత్తు నర్తింప
    నగ్నిశిఖల మీద నాడె శిశువు

    భగ్నంబయ్యెను జీవనమ్ము యమునన్ బ్రాణాలు రూపాఱగా
    మగ్నంబయ్యెను క్ష్వేళమే మడుగునన్ మాహేయినిన్ జంప దుః
    ఖాగ్నిన్ బాపుటకై మురారి గునిసెన్ గాళీయ శీర్షంబుపై
    నగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్


    రిప్లయితొలగించండి
  12. భగ్నంబయ్యెను తమ్మిమొగ్గరమునా బాలుండు ఛేదింపను
    ద్విగ్నంబొందిరి కౌరవేయ గణముల్ విస్తారమౌ రీతిగా
    నగ్నింగ్రక్కెడు బాణసంచయముతో వ్యగ్రంబుగాజేయ తా
    నగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:పీర్ల పండుగ యని పెద్దలు భక్తి తో
    గుండములను దూకుచుండ సుంత
    భయము లేక పెద్ద వారి చంకల నెక్కి
    అగ్ని శిఖల పైన నాడె శిశువు

    రిప్లయితొలగించండి
  14. శా:లగ్నం బెంచితి మశ్వమేధమునకో భ్రాతా ధనుర్విద్యలో
    మగ్నున్ నన్ను కుశాఖ్య బాలు డొకడే మార్తాండ తేజమ్ముతో
    భగ్నున్ జేసెను వాని తేజము భళా!వర్ణింప మద్బాణ ఘో
    రాగ్నిజ్వాలలపైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్”
    (రాముని అశ్వాన్ని కుశుడు బంధించి లక్ష్మణుని తో యుద్ధం చెయ్యగా అతని శౌర్యానికి ఆశ్చర్య పడిన లక్ష్మణుడు రాముని తో అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  15. వెలుఁగు చున్న వహ్ని వీక్షించి కాళ్లను
    గరములఁ గదలించి మురిసి మిగుల
    ఋత్విజు లచట హవి నింపుగ వేల్వంగ
    నగ్నిశిఖల మీద నాడె శిశువు


    భగ్నస్వాంతులు పెద్ద లా వెతల సైపం జాల కంతన్ రుషా
    మగ్నాంతఃకరణప్రభా వశులు సంబాధాగ్ని మున్గంగ దుః
    ఖాగ్నిజ్వాలలణంగ దత్క్షణము బాల్యావస్థ నుప్పొంగు హ
    ర్షాగ్నిజ్వాలల పైన నొక్క శిశు వాటాడెన్ మనోజ్ఞమ్ముగన్

    రిప్లయితొలగించండి
  16. తమ్మిమొగ్గరమును ధాటిగ ఛేదించి
    బాలుఁడతఁడు జొచ్చె భండనమున
    వైరివరుల ధృతిని వ్రయ్యలు సేయుచు
    నగ్నిశిఖల మీద నాడె శిశువు

    రిప్లయితొలగించండి
  17. తల్లి వండు చుండ తనయుడు దరిచేరి
    కొంగు లాగి నంత కుంపటిపయి
    పడగ నిప్పురవ్వ వ్యాపించి నంతనే
    అగ్ని శిఖల మీద నాడె శిశువు

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అమ్మకాని కనుచు నగ్నిశిఖము దెచ్చి
    యింట నుంచ వారి చంటివాడు
    మూలనున్న చిన్న మూటపై ప్రాకుచు
    అగ్ని శిఖల మీద నాడె శిశువు.

    రిప్లయితొలగించండి