31, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 213 (విద్య నేర్చినవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
విద్య నేర్చినవాఁడె పో వింతపశువు.
ఈ సమస్యను సూచించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  విశ్వమందున చెప్పుము విజ్ఞుడెవడు?
  వెళ్ళమనుటకు ఒకమాట వేగచెప్పు?
  విద్యలేనిచొ వాడికి వేరు పేరు?
  విద్య నేర్చినవాడె,పో,వింతపశువు.

  రిప్లయితొలగించండి
 2. విద్య నేర్చిన వికసించు విమల మతియు
  ప్రజ్ఞ లందుట పరిపూర్తి పరుల హితము
  హితము సలుపక పరులను హింస కోపు
  విద్య నేర్చిన వాడె పో వింత పశువు .

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ప్రశ్నోత్తరాత్మకంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "లేనిచొ" అన్నారు. చొ అనరాదు. చో సాధురూపం.
  "విద్య లేనట్టి" అంటే సరి.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  "హింస కోపు" అనేది "హింస పెట్టు" అయితే?

  రిప్లయితొలగించండి
 4. విద్య నేర్చినవాఁడె పో వింతపశువు
  అన్న పశువు బాధ పడుచు విన్నవించె
  తాను సేవించు నీతిని తప్పకుండ
  నేటి ఆస్థాన సచివుల నీతి గనరె!

  రిప్లయితొలగించండి
 5. గురువు గారూ, నమస్కారములు. మీ సవరణ బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. గొప్ప చదువులు జదివెతా కోరి మంచి
  కొలువు; అమెరికా కెళ్ళెను కోరి కోరి!
  మోస మెంతయొ నేర్చెను;మొదట నుండె!
  విద్య నేర్చినవాఁడె పో వింతపశువు

  రిప్లయితొలగించండి
 7. "విద్య నేర్చిన వాడె పో వింత పశువు"
  విస్తు పోయిరి యిదివిని ,విబుధ వరులు,
  తామెవరిమొననెడుశంక తమకు గలుగ!
  శంకరయ్యను వేడిరి శంకదీర్ప!

  రిప్లయితొలగించండి
 8. శంకరయ్యగారూ
  మీరు చేసిన సవరణకు కృతజ్ఞతలు. అభినందనలకు ధన్యవాదములు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 9. హరి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  ఈ మధ్య మీ దర్శనం లేక బ్లాగు చిన్నబోతున్నది.
  మంచి పూరణ పంపారు. బాగుంది. అభినందనలు.
  "అమెరికా కెళ్ళెను" కంటే "అమెరికా కేగెను" అంటే బాగుంటుంది.

  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  "తా మెవరిమి అనే శంక కలిగిన వారు" ... ఇంకెవరు? "వి"కారమున్న బుధవరులే.

  రిప్లయితొలగించండి
 10. విద్య వినయమ్ము నిచ్చును ,విత్త మిచ్చు,
  యిచ్చు విజ్ఞాన ధనమును, యిచ్చు యశము!
  వెలుగు లార్పెడు, విలయమ్ము గలుగ జేయు
  విద్య నేర్చిన వాడె పో ,వింత పశువు!

  రిప్లయితొలగించండి
 11. విష్ణు నందను గారూ! నిన్నటి నా పద్యంపై మీరు వ్యాఖ్యానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యుడను.
  రైలుకెళ్ళే హడావిడి లో మూడవ పాదంలోని తప్పును గమనించ లేదు. గురువుగారు సవరించారు.
  నా కనిపిస్తోంది. గురువుగారి దగ్గరా, మీబోటి ఉద్దండ పండితుల దగ్గరా నాబోటి వాళ్ళు పాండిత్యాన్ని
  ప్రదర్శించడం అంటే కాన్వెంట్లో యల్ కే జీ చదువుతున్న కుర్రాడు ఆంగ్లంలో పే హెచ్ డి చేసిన ప్రొఫెసర్
  దగ్గర కెళ్ళి "మీకే కాదు సారు నాకు కూడా ఇంగ్లిష్ వచ్చును ఎ బి సి డి" అని అన్నట్లుగా ఉంది అని.
  మీ బోటి సహృదయులు మా అందరికీ ఇచ్చే ప్రోత్సాహం అనుపమానం, విలువ కట్ట లేనిది.

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న గారూ ,
  మీరలా అనడం మీ సౌశీల్యాన్నీ, సౌజన్యాన్నీ సూచిస్తోంది . కానీ నాకు నేను అనుకునేది ఆ శారదమ్మ ఒడిలో , ఈ పలుకులమ్మ బడిలో అందరమూ నిత్య విద్యార్థులమే ! మరీ మరీ ధన్యవాదాలు !!!  విద్య నరులకు రూప సంవృద్ధికరము ;
  విద్య ప్రచ్ఛన్న ధనము , సంవిద్ప్రదమ్ము ;
  విద్య వినయమ్మునొసగు ; నా వినయ రహిత
  విద్య నేర్చినవాఁడె పో వింతపశువు !!!

  ( భర్తృహరి సుభాషితాల్లోని ' విద్యా నామ నరస్య రూపమధికం ' శ్లోక భావాన్ని స్మరిస్తూ )

  రిప్లయితొలగించండి
 13. విద్య యొక రెండు విధములీ పృథ్వి ; నార్ష
  విద్య నేర్చినవాడె పో విబుధవరుడు ;
  అహిత పథము , వామాచారమయిన క్షుద్ర
  విద్య నేర్చినవాఁడె పో వింతపశువు !!!

  రిప్లయితొలగించండి
 14. విష్ణు నందను గారూ! మీకు మరొక్క సారి నా నమోవాకాలు.

  కనక కశిపుడు సుతునితో ననెను,"యిలను
  విద్య వలయును జనులకు, విబుధు డగును
  విద్య నేర్చినవాఁడె పో, వింతపశువు
  విద్య లేకున్న, చదివింతు బిడ్డ! నిన్ను."

  రిప్లయితొలగించండి
 15. లంచములు కూర్చు విందువిలాసములవి
  వద్దనెడు తండ్రి నెద్దను మొద్దను మరి
  మాట లేటికి నేతికి చోటు లేని
  విద్య నేర్చినవాఁడె పో, వింతపశువు

  రిప్లయితొలగించండి
 16. లంచములు కూర్చు విందువిలాసములవి
  వద్దనెడు తండ్రి నెద్దను మొద్దను మరి
  మాట లేటికి న్తీతికి చోటు లేని
  విద్య నేర్చినవాఁడె పో, వింతపశువు

  రిప్లయితొలగించండి
 17. మంద పీతాంబర్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  "విత్త మిచ్చున్ + ఇచ్చు", "ధనమును + ఇచ్చు" అన్నప్పుడు యడాగమం రాదు.
  ".................................. విత్త మిచ్చు
  నిచ్చు విజ్ఞానధనముఁ దా నిచ్చు యశము" అని నా సవరణ.

  డా. విష్ణు నందన్ గారూ,
  రెండు సుభాషిత రత్నాలను ప్రసాదించారు. నా బ్లాగు ధన్య మయింది. మీకు నా నమోవాకాలు.

  మిస్సన్న గారూ,
  మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
  "అనెను + ఇలను" అన్నప్పుడు యడాగమం రాదు. దానిని "అనియెన్ + ఇలను = అనియె నిలను" అంటే సరి!

  ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  రెండు సార్లు "నీతి" దగ్గరికి వచ్చే సరికి చెయ్యి వణుకుతున్న దెందుకండీ :-)

  రిప్లయితొలగించండి
 18. శ్రీ పీతాంబర్ గారూ, మీ పూరణలు బాగున్నాయి,కాని గురువు గారిని యిబ్బందికరమైన ప్రశ్నలు వేయడము మీకు తగునా ?

  విద్య లొసగవె మనిషికి వింత నడక
  విద్య నేర్చెనో వేసెను వింత ఱంకె
  విద్య గూర్చెను బత్తెము + వింత గడ్డి
  విద్య నేర్చిన వాడె పో వింత పశువు

  రిప్లయితొలగించండి
 19. శ్రీ నరసింహ మూర్తి గారు, నిజానికి సమస్యను సూచించిన శ్రీ కిషోర్ గారిని ఇబ్బంది పెట్టాల్సింది ,ఐనా గురువు గారు శంకను తీర్చినారు గదా!

  రిప్లయితొలగించండి
 20. అందరి పూరణలు చాల బాగున్నవి. వినయము లేని విద్య...,విలయము నేర్పు విద్య... భేష్... అందరికి అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 21. పదవు లియనట్టి చదువులు పనికి రావు
  వినయ మొసగెడి విద్యలు మనకు తగవు
  ధనమె మూలము జగతికి దండు కొనగ
  విద్య నేర్చిన వాడెఁ పో వింత పశువు !

  గురువు గారూ !నమస్కారములు నిన్నటి పూరణ నచ్చినందుకు ధన్య వాదములు.ఐతె ఖచ్చితంగా ఈ రోజు ఎన్ని తప్పులు వస్తాయొ ? ఎందుకంటే 3 లొ 2 తప్పులు వస్తాయి నిజంగా మీ సహనానికి ఎలా అభినందించినా తక్కువె ! కాకపోతె మీ రిచ్చే ప్రోత్సాహంతొ మళ్ళీ మళ్ళీ రాయాలని పిస్తుంది. మరొక సారి ధన్య వాదములు + కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 22. 1969 ఉద్యమ నేపద్యములో గురువుగారి గురువు గారిని బలవంతముగా Train ఎక్కించి పంపించటము గురించి..

  కలహమిరు సీమల నడుమ కలిగి నంత
  గురుఁడు పరుఁడని తెలియక కోపగించి
  గురుఁడు పరుఁడనుచుఁ దలచి తరిమి వేసె
  విద్య నేర్చినవాఁడె పో వింతపశువు!!

  పరుఁడు (1)= పరమాత్మ, దైవము
  పరుఁడు (2)= శత్రువు, అన్యుడు

  రిప్లయితొలగించండి
 23. అందరికీ వందనములు.
  మిత్రుల పూరణలు
  ముచ్చటగా నున్నవి.

  01)
  _______________________________________

  *సీ*
  విద్య ,విద్య ననేమి - విఙ్ఞాన మందురు !
  విద్య మేధను బెంచు ! - వినయ యుతము !

  విద్యలోన గలవు - వివిధ విధంబులు !
  విద్య యనంతము - విశ్వ మందు !

  విద్యయన్న వెలుగు ! - విజయమ్ము గలిగించు !
  విద్య లేని నాడు - వియమ మౌను !

  విబుధ వరులు మెచ్చు - విద్యార్థె విద్యార్థి !
  విద్య నొద్దను వాడు - వింత పశువు!


  తే*గీ
  కోటి విద్యలు కూడును - కూర్చు , గాని
  ప్రాణి కోటుల హింసింప - పాడి గాదు !
  విశ్వ విలయమ్ము నొనరించు - పిశున మైన
  విద్య నేర్చిన వాఁడె పో - వింత పశువు !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 24. 02)
  _________________________________________

  *సీ*

  విద్యలెన్నొ గలవు - వేదకాలము నుండి
  చోర విద్యయు నందు - జూడ నొకటి !

  సకల శాస్త్రము లందు - సర్వోన్నతుండగు
  దశకంఠుడును నేర్చె - దంభ విద్య !

  తరుణి సీతను గొనె - తాపసి రూపున
  మాయ రూపు మడియ - మారిచుండు !

  దార జెప్ప వినడు - ధర్మమును గనడు
  తోటి వారి దొలగ - ద్రోసి నాడు

  తే*గీ
  మంత్రి బాంధవ హితులయు - మాట వినక
  దార పుత్రులు దూరమై - దారి లేక
  చివరి కేమాయె చావుకు - చేరు వాయె !
  విద్య నేర్చిన వాఁడె పో - వింత పశువు !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 25. నిద్రలో, పసి బాలుర, నీతి మాలి,
  ద్రుపద పుత్రిక సుతులను ద్రుంచె! కపటి!
  ద్రోణ పుత్రుడు! ఘాతకి! ద్రోహి! ధర్మ-
  విద్య నేర్చిన వాడె? పో! వింత! పశువు.

  రిప్లయితొలగించండి
 26. 03)

  ________________________________________

  *సీ*

  దారుణ తపమున - ధాతను మెప్పించి
  పలు వరంబులు గొన్న - ఫలితు డతడు !

  మూడు లోకంబుల - వేడుక తోడను
  చతురత గెలిచిన - చక్రవర్తి !

  యఙ్ఞ యాగాదుల - నఙ్ఞాని యౌటను
  చిందర వందర - జేసె నతడు !

  హరినామ మన్నను - హరి భక్తులన్నను
  నిరతము ద్వేషించు - వైరి యతడు !

  తే*గీ
  బాలు , ప్రహ్లాదు , హరిభక్తు, - బాధ పెట్టి
  పెక్కు రీతుల హింసించె - పిచ్చితనము !
  కడకు కడతేరె , హిరణ్య - కశిపు డంత !
  విద్య నేర్చిన వాఁడె పో - వింత పశువు !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 27. 04)
  ________________________________________

  నవ్వి పోదురు జనులంత - నన్ను జూసి
  ఎగ్గు సిగ్గులు నాబోంట్ల - కిలను లేవు !
  నీతి మాలిన నిర్భాగ్య - నేత నేనె !
  విద్య నేర్చిన వాఁడె పో - వింత పశువు !
  ________________________________________

  విద్య = రాజకీయ విద్య = politics
  ________________________________________

  రిప్లయితొలగించండి
 28. మనుజుడై బహు చక్కగ మాటలాడు;
  కుక్కలా మొరిగికిలించు కోతిలాగు;
  గేదెరంకె లేసెడి, మిమిక్రీయనబడు
  విద్యనేర్చినవాడె, పో, వింతపశువు

  మార్చి,2007 లో సుజనరంజని పత్రికలో 'విద్యలేనివాడు వింతపశువు' అని సమస్య ఇచ్చారు. కొద్దిగా వైవిధ్యంతో పూరించడానికి నేను చేసిన ప్రయత్నం. భావవంతా ఒక్క పద్యంలో వ్రాయలేక రెండిటిగా పూరించాల్సి వచ్చింది.

  వేడిగిన్నె చురక వాడిగా తగలగా
  వెర్రికేక పెట్టె గొర్రెలాగ;
  పప్పు చేయబోవ, పలుచగా తేలగా
  ఓండ్ర పెట్టెనతడు నోర్వలేక;
  పాకమువలెనున్న శాకముందినలేక
  రంకె వేసెనయ్య రంగచారి;
  వంట చేసిపెట్ట యింట యిల్లాలు ' శ్రీ
  విద్య ' లేని, వాడు, వింత పశువు!!!

  రిప్లయితొలగించండి
 29. శ్యామసుందర్ (పుష్యం)గారికి స్వాగతం !
  మీ పూరణ బావుంది !
  మీ పుష్యం బ్లాగులో మీ పద్యాలు కూడా
  చాలా బావున్నాయ్ !

  రిప్లయితొలగించండి